Begin typing your search above and press return to search.

'ధమాకా' రిపీట్‌ కాకుంటే క్యూటీకి కష్టాలే..!

వరుస సినిమాలు చేస్తున్న శ్రీలీల హిట్స్ కంటే ఎక్కువగా ప్లాప్స్‌ను మూట కట్టుకుంటుంది.

By:  Tupaki Desk   |   1 April 2025 11:00 PM IST
Sree Leela Career Struggles
X

టాలీవుడ్‌లో రాఘవేంద్ర రావు కొత్త 'పెళ్లి సందడి' సినిమాతో శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడినప్పటికీ లక్కీగా రవితేజకు జోడీగా 'ధమాకా' సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. శ్రీలీలకు ధమాకా కలిసి వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆ సినిమాలో శ్రీలీల వేసిన డాన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. కమర్షియల్‌ హిట్‌ దక్కడంతో పాటు నటిగా, డాన్సర్‌గా, క్యూట్‌ లుక్స్‌తో మెప్పించడంతో శ్రీలీల ఒక్కసారిగా టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అయింది. ధమాకా సినిమాతో శ్రీలీల టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఒకానొక సమయంలో శ్రీలీల చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి.

వరుస సినిమాలు చేస్తున్న శ్రీలీల హిట్స్ కంటే ఎక్కువగా ప్లాప్స్‌ను మూట కట్టుకుంటుంది. ధమాక సినిమా తర్వాత శ్రీలీలకు సాలిడ్‌ సక్సెస్‌, కమర్షియల్‌ సూపర్‌ హిట్‌ లేదు. అయినా కూడా ఆఫర్లకు తక్కువ లేదు. ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుకు జోడీగా నటించే అవకాశాన్ని గుంటూరు కారం సినిమాతో సొంతం చేసుకుంది. ఆ సినిమా నిరాశ పరిచిన ఈమె మహేష్ బాబుతో చేసిన కుర్చీ మడత పెట్టి సాంగ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని శ్రీలీల చాలా ఆశలు పెట్టుకుంది. కానీ నిరాశే మిగిలింది. ఆ తర్వాత ఆమె నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తూ వచ్చాయి. గత ఏడాది ఈమె నుంచి వచ్చిన గుంటూరు కారం అంతకు ముందు ఏడాది వచ్చిన స్కంద, ఆది కేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి.

పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా లక్కీగా బాలీవుడ్‌లోనూ ఈమెకు గుర్తింపు దక్కింది. ఆ గుర్తింపుతోనే బాలీవుడ్‌లో తాజాగా ఒక సినిమాకు సైన్ చేసింది. అనురాగ్‌ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఒక హిందీ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం వచ్చింది. ఇదే సమయంలో తమిళ్‌లోనూ ఈమె ఎంట్రీకి సిద్ధం అయింది. అమరన్ స్టార్‌ శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందుతున్న క్రేజీ మూవీ 'పరాశక్తి' లో హీరోయిన్‌గా నటిస్తుంది. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో పాటు రవితేజ హీరోగా రూపొందుతున్న మాస్‌ జాతర సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది.

తెలుగు మూలాలు ఉన్నప్పటికీ ఈ అమ్మడికి టాలీవుడ్‌లో ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ ఈమె ఈమధ్య కాలంలో ఎక్కువ ఫ్లాప్స్‌ను చవిచూడటంతో కష్టాల్లో పడింది. రవితేజతో ప్రస్తుతం నటిస్తున్న మాస్‌ జాతర సినిమా ఫలితం తారు మారు అయితే టాలీవుడ్‌లో కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మరో వైపు తమిళ్‌లో ఈమె పరాశక్తి సినిమాతో సక్సెస్‌ను సొంతం చేసుకుంటే కోలీవుడ్‌లో రాబోయే రెండు మూడు ఏళ్ల పాటు వరుసగా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరో వైపు బాలీవుడ్‌లోనూ ఈమె ప్రస్తుతం చేస్తున్న సినిమా హిట్‌ అయితేనే అక్కడ కెరీర్ ఉంటుంది. ఒకవేళ ఆ హిందీ సినిమా నిరాశను మిగిల్చితే కచ్చితంగా అక్కడ ఆఫర్లను సొంతం చేసుకోవడం కష్టమే. కనుక ప్రస్తుతం మూడు భాషల్లో చేస్తున్న మూడు సినిమాలు శ్రీలీలకు కెరీర్ పరంగా అత్యంత కీలకంగా మారాయి. మరి ఆ మూడు ఫలితం ఏంటి అనేది ఈ ఏడాదిలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.