ఫ్యాక్ట్ చెక్ : శ్రీలీల మూడో దత్త కూతురు కాదు
అందంతో పాటు మంచి మనసున్న హీరోయిన్ శ్రీలీల. ఈమె ఇప్పటికే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 3 May 2025 10:00 PM ISTఅందంతో పాటు మంచి మనసున్న హీరోయిన్ శ్రీలీల. ఈమె ఇప్పటికే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న విషయం తెల్సిందే. వారి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటూ, వారితో ఉన్న ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉండే శ్రీలీల ఇటీవల ఒక చిన్న పాపతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ పాప రాకతో తమ ఫ్యామిలీ మరింత పెరిగింది. మా కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చింది అంటూ శ్రీలీల సోషల్ మీడియా ద్వారా లవ్ ఈమోజీలను షేర్ చేసి మరీ పోస్ట్ చేసింది. దాంతో చాలా మంది శ్రీలీల మరో పాపను దత్తత తీసుకుంది అనుకున్నారు. పలు మీడియా సంస్థలు కూడా అదే విషయాన్ని దృవీకరించాయి. ఇండస్ట్రీకి చెందిన వారు కూడా సోషల్ మీడియా ద్వారా శ్రీలీల మూడో దత్త కూతురు అన్నట్లుగా ప్రచారం చేశారు.
సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. శ్రీలీల గొప్పతనం గురించి మరోసారి, ఆమె మంచితనం గురించి మరోసారి ప్రముఖంగా చర్చ జరిగింది. శ్రీలీల ఇటీవల షేర్ చేసిన పాప ఫోటోల గురించి ఫ్యాక్ట్ చెక్ చేసిన సమయంలో అసలు విషయం బయటకు వచ్చింది. శ్రీలీల ఇటీవల షేర్ చేసిన ఫోటోలో ఉన్న పాప ఎవరో కాదు తన సోదరి కూతురు. అంతే తప్ప ఆ పాపను శ్రీలీల దత్తత తీసుకోలేదు. తన సోదరి కూతురు రాకతో పిన్నిగా శ్రీలీల చాలా సంతోషంగా ఉందట. అందుకే తమ ఫ్యామిలీ పెరిగింది, మా ఆనందానికి అవధులు లేవు అన్నట్లుగా కాస్త భారమైన, బలమైన పదాలతో శ్రీలీల తన సంతోషంను వ్యక్తం చేసింది.
శ్రీలీల ఇప్పటికే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పుడు మరో పాపను దత్తత తీసుకోవడం అంటే నిజంగా గొప్ప విషయం అని అంతా అనుకున్నారు. కానీ ఆమె దత్తత తీసుకోలేదు. ఆమె సినిమాలతో చాలా బిజీగా ఉండటం వల్ల ఆమె ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితి లేదు. అందుకే ఆమె ఈ సమయంలో దత్తత ఆలోచన చేయక పోవచ్చు. ప్రస్తుతం తన ఆధ్వర్యంలో ఉన్న ఇద్దరు పిల్లలను సాధ్యం అయినంత వరకు ఆనందంగా చూసుకునేందుకు ప్రయత్నింస్తూ ఉంటుంది. శ్రీలీల ఆ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవడం కూడా చిన్న విషయం ఏమీ కాదు. కోట్ల పారితోషికాలు తీసుకునే వారు చిన్న సాయం చేసేందుకు ముందుకు రారు. అలాంటిది శ్రీలీల ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవడం గొప్ప విషయం.
ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అంటూ ఐటెం సాంగ్ చేయడంతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకుంది. దాంతో హిందీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. కేవలం హిందీ సినిమా మాత్రమే కాకుండా తమిళ్ సినిమాలోనూ ఈమెకు నటించే అవకాశం దక్కింది. ఇక తెలుగులో ఈమె జోరు కంటిన్యూ అవుతోంది. రవితేజ తో ధమాకా సినిమా తర్వాత మరో సినిమాను చేసేందుకు ఈమె రెడీ అయింది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆఫర్‌లను కూడా ఈమె తిరస్కరించకుండా ఓకే చెప్పేందుకు రెడీగా ఉంది. ఒక్క భాషలో అని కాకుండా అన్ని భాషల్లోనూ ఈ అమ్మడు నటిస్తూ దూసుకు పోతుంది.
