ఇక ధనుష్ కాపాడాల్సిందేనా?
దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డాడన్నట్టుగా తయారైంది క్రేజీ హీరోయిన్ శ్రీలీల పరిస్థితి.
By: Ravindar Gorantla | 10 April 2026 4:00 AM ISTదేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డాడన్నట్టుగా తయారైంది క్రేజీ హీరోయిన్ శ్రీలీల పరిస్థితి. ఎన్ని క్రేజీ ఆఫర్లు తలుపు తట్టినా సక్సెస్ మాత్రం అందరి ద్రాక్షలా ఊరిస్తూ కెరీర్‌పై నీలినీడలు కమ్మేలా చేస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినిమా `చిత్రాంగద`తో కెరీర్ ప్రారంభించినా ఆ తరువాత కొంత విరామం అనంతరం `పెళ్లిసందడి`తో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
తొలి మూవీ సక్సెస్ కావడంతో ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించిన శ్రీలీల కెరీర్ ప్రారంభంలోనే క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకోవడం మొదలు పెట్టింది. `పెళ్లిసందడి` తరువాత మాస్ మహారాజాతో కలిసి `ధామాకా`లో నటిస్తే ఇది కూడా భారీ విజయాన్ని అందించిన ఇండస్ట్రీలో శ్రీలీల క్రేజ్‌ని భారీగా పెంచేసింది. అయితే ఆ తరువాత చేసిన `స్కంద` బిగ్ షాక్ ఇచ్చింది. రామ్ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన ఈ మూవీ రొడ్డ యాక్షన్ సినిమా కావడంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసి శ్రీలీలకు షాక్ ఇచ్చింది.
అయితే నందమూరి బాలకృష్ణతో అనిల్ రావిపూడి చేసిన `భగవంత్ కేసరి` మాత్రం ఆ లోటుని తీర్చి మంచి విజయాన్ని అందించింది. అయితే ఇందులో శ్రీలీల హీరోయిన్ కాదు. కీ రోల్ అంతే. ఆ తరువాత నితిన్‌తో చేసిన ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, సూపర్ స్టార్ మహేష్‌బాబుతో చేసిన `గుంటూరు కారం`, రవితేజ `మాస్ జాతర` వంటి సినిమాలు శ్రీలీలకు పెద్దగా ఫలితాన్ని అందించలేకపోయాయి. స్టార్ హీరోల సినిమాలే అయిన సరైన కథ, కథనాల్లో బలం లేకపోవడంతో అవి బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచి షాక్ ఇచ్చాయి.
ఇక రీసెంట్‌గా విడుదలైన పరాశక్తి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన `ఉస్తాద్ భగత్‌సింగ్` బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. `ధురంధర్ 2`కు పోటీగా రిలీజ్ చేసిన `ఉస్తాద్ భగత్‌సింగ్` గురించి ఎవరు చర్చంచుకోలేదంటే ఆ సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలా శ్రీలకు చిన్న సినిమాలే కాకుండా స్టార్స్‌తో చేసిన సినిమాలు కూడా షాక్ ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి ధనుష్ 55వ ప్రాజెక్ట్‌పై పడింది.
శ్రీలీల ప్రస్తుతం ధనుష్ 55వ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. ఇందులో మెయిన్ హీరోయిన్ సాయి పల్లవి. `అరమన్` ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక అతిథి పాత్రలో నటిస్తుండగా లేటెస్ట్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమాతో మళ్లీ శ్రీలీల ట్రాక్‌లోకి వచ్చేస్తుందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి ఈ మూవీతో పాటు హిందీలో అనురాగ్ బసు రూపొందిస్తున్న సినిమాలో శ్రీలీల నటిస్తోంది.
