Begin typing your search above and press return to search.

బి టౌన్‌లో శ్రీలీల రొమాంటిక్ ఎంట్రీ ఇవ్వనుందా?

సౌత్‌లో ఎన్నో సినిమాల్లో నటించి, ముఖ్యంగా టాలీవుడ్‌లో సూపర్‌ హిట్స్‌ను దక్కించుకున్న శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధం అయింది.

By:  Tupaki Desk   |   5 July 2025 12:38 PM IST
బి టౌన్‌లో శ్రీలీల రొమాంటిక్ ఎంట్రీ ఇవ్వనుందా?
X

సౌత్‌లో ఎన్నో సినిమాల్లో నటించి, ముఖ్యంగా టాలీవుడ్‌లో సూపర్‌ హిట్స్‌ను దక్కించుకున్న శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధం అయింది. కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో శ్రీలీల బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతుంది. ఇప్పటికే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. మొదట ఈ సినిమాను 'ఆషికి 3' అంటూ ప్రచారం చేశారు. ఆషికి ప్రాంచైజీలో రాబోతున్న సినిమా కావడంతో ఖచ్చితంగా బాగుంటుందని, ఆషికి స్థాయి లవ్‌ కమ్‌ రొమాన్స్ ఉంటుందని అంతా భావించారు. కానీ తాజాగా దర్శకుడు అనురాగ్ బసు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు ఆషికి 3 టైటిల్‌ అంటూ జరుగుతున్న ప్రచారంను ఖండించాడు.

ఈ సినిమా గురించి దర్శకుడు అనురాగ్‌ బసు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చక్కని లవ్‌ స్టోరీతో రూపొందుతున్న సినిమా అన్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తి అయిందని, త్వరలోనే షూటింగ్‌ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తప్పకుండా ఈ సినిమా బాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసంను వ్యక్తం చేశాడు. శ్రీలీలకు ఇప్పటి వరకు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పెద్ద గుర్తింపు దక్కలేదు. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా శ్రీలీలకు పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్‌డం దక్కింది. ఆ గుర్తింపుతోనే అనురాగ్ బసు ఈ సినిమాలో ఆమెను ఎంపిక చేశాడని తెలుస్తోంది.

ఆషికి ప్రాంచైజీ మూవీ అంటూ మొదట్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో కచ్చితంగా రొమాంటిక్‌ సీన్స్ ఉంటాయనే ప్రచారం జరిగింది. శ్రీలీల, కార్తీక్‌ ఆర్యన్‌ కాంబోలో ఉండే రొమాంటిక్‌ సీన్స్ సినిమాను హిట్‌ చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం ద్వారా శ్రీలీల బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉంటాయని చాలా మంది అన్నారు. అయితే ఆషికి 3 టైటిల్‌ కాదంటూ దర్శకుడు స్వయంగా చెప్పడంతో ఆ రొమాంటిక్ సీన్స్ ఉండవేమో అని కొందరు అనుకుంటున్నారు. తాజాగా దర్శకుడు అనురాగ్‌ బసు ఈ సినిమా మంచి రొమాంటిక్ జర్నీ అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ రొమాంటిక్ మూవీలోనే కాకుండా తెలుగులో మాస్‌ జాతర సినిమాలో నటిస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ధమాకా సినిమా తర్వాత రవితేజ, శ్రీలీల కలిసి మాస్ జాతరతో రాబోతున్నారు. ఇక ఈ అమ్మడు తమిళ్‌లో సాలిడ్‌ ఎంట్రీకి రెడీ అవుతోంది. తమిళ్‌లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ మూవీస్‌లో మొదట ఉండే పరాశక్తి సినిమాలో శివ కార్తికేయన్‌ కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాతో కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఈ అమ్మడు నిలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న పరాశక్తి సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయింది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.