టాలెంటెడ్ హీరోకు బాలీవుడ్ ఆఫర్
తాజాగా సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీవిష్ణు ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.
By: Tupaki Desk | 12 May 2025 12:30 PMఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలుంటారు. అందులో కొంతమంది హిట్ ఫార్ములాని పట్టుకుని అదే మూస పద్దతిలో సినిమాలు చేస్తుంటే, మరికొంత మంది మాత్రం హిట్టూ ఫ్లాపును లెక్క చేయకుండా ప్రతీసారీ ఏదొక కొత్తదనాన్ని చూపించాలని పరితపిస్తూ ఉంటారు. ఇందులో హీరో శ్రీవిష్ణు రెండో కోవకు చెందిన వాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి శ్రీవిష్ణు వివిధ ప్రయోగాలు చేస్తూనే వస్తున్నాడు.
తాజాగా సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీవిష్ణు ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని మొదటి రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.11.2 కోట్లు సాధించి రికార్డు సృష్టించింది. సింగిల్ సినిమా శ్రీవిష్ణు కెరీర్లో మరో మంచి హిట్ గా నిలిచింది.
సింగిల్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీవిష్ణు ప్రస్తుతం అడిగిన ప్రతీ ఒక్కరికీ ఇంటర్వ్యూలిస్తూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అందులో భాగంగానే శ్రీవిష్ణు తనకు ప్రతీ సినిమా ఓ కొత్త అనుభవాన్ని ఇచ్చిందని, ప్రతీ సినిమాతో తాను ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నట్టు వెల్లడించాడు.
కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు ఫోన్ చేసి అభినందించినప్పుడు తనకు చాలా బూస్టప్ వచ్చేదని, బ్రోచేవారెవరురా సినిమా చూసి ఇండస్ట్రీలోని చాలా మంది తనను ప్రశంసించారని, ఆ విషయాన్ని తానెప్పటికీ మర్చిపోలేనని, రవితేజ, అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాలకూ సపోర్ట్ గా నిలుస్తుంటారని శ్రీవిష్ణు తెలిపాడు.
తాను గతేడాది చేసిన స్వాగ్ సినిమా తర్వాత తనకు కోలీవుడ్ నుంచి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయని, ఆ సినిమా తర్వాతే తనకు మొదటిసారి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని వెల్లడించిన శ్రీవిష్ణు రొటీన్ సినిమాలు చేయడం తనకు నచ్చదని, అందుకే ప్రతీసారి కొత్తదనం కోరుకుంటూ డిఫరెంట్ సినిమాలే చేస్తానని చెప్పాడు. తాను ఏ సినిమా చేసినా ఆడియన్స్ కు నచ్చేలా ఉండాలనే ఉద్దేశంతో ఆచితూచి అడుగులేస్తానని వెల్లడించాడు శ్రీవిష్ణు.