శ్రీవిష్ణు చెప్తుంది ఆ సినిమా గురించేనా?
ఫిల్మ్ ఇండస్ట్రీకి, సినిమాకి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు చాలానే ఉంటాయి.
By: Tupaki Desk | 7 May 2025 4:29 PM ISTఫిల్మ్ ఇండస్ట్రీకి, సినిమాకి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు చాలానే ఉంటాయి. అవి కొన్నిసార్లు కొందరు కావాలని బయటపెడితే, మరికొన్ని అనుకోకుండా బయటకు వస్తాయి. ఏదేమైనా బయటికొచ్చిన ఆ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు అలాంటి ఓ వార్తను వెల్లడించాడు టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు.
సింగిల్ ప్రమోషన్స్ లో భాగంగా శ్రీవిష్ణు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. శ్రీవిష్ణు హీరోగా 2021లో వచ్చిన అర్జున ఫాల్గుణ పెద్ద ఫ్లాపనే సంగతి తెలిసిందే. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రిలీజైన ఈ సినిమా ఎన్నో అంచనాలతో రిలీజై ఆ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద సినిమా చతికిల పడిపోయింది.
ఈ సినిమా గురించి సింగిల్ ప్రమోషన్స్ లో మాట్లాడాడు శ్రీవిష్ణు. వాస్తవానికి అర్జున ఫాల్గుణ సినిమాకు ముందు అనుకున్న ఇంట్రడక్షన్, క్లైమాక్స్ వేరట. వాటిని మార్చి వేరే వాటిని పెట్టి సినిమా తీశారు. రిలీజయ్యాక సినిమాలో అవే పెద్ద మైనస్ లుగా మిగిలాయి. కట్ చేసి చూస్తే ఆ సినిమా వచ్చిన 9 నెలలకు మరో సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది.
అర్జున ఫాల్గుణ సినిమా కోసం తమ యూనిట్ ముందు ఏదైతే క్లైమాక్స్ ను అనుకున్నారో ఆ హిట్టైన సినిమాలో అదే క్లైమాక్స్ ఉందని, ఆ మూవీ హిట్ అవడంలో క్లైమాక్స్ చాలా కీ రోల్ పోషించిందని, దీంతో తమ చిత్ర యూనిట్ మొత్తం షాకయ్యామని చెప్పాడు శ్రీ విష్ణు. హిట్టైన సినిమా లాగా రిచ్ గా తీయకపోయినా తమ సినిమాలోని క్లైమాక్స్ కూడా చాలా బాగా వచ్చిందని, కానీ అనవసరంగా తర్వాత క్లైమాక్స్ ను మార్చుకుని తప్పు చేశామని తెలిపాడు.
అర్జున ఫాల్గుణ సినిమాను ముందు అనుకున్నట్టే తీసి ఉంటే మంచి రిజల్ట్ వచ్చి ఉండేదేమో అని కూడా శ్రీవిష్ణు ఈ సందర్భంగా చెప్పాడు. అయితే ఇన్ని చెప్పిన టాలెంటెడ్ హీరో ఆ సినిమా పేరుని మాత్రం బయటపెట్టలేదు. కానీ శ్రీవిష్ణు చెప్పిన దాన్నిబట్టి చూస్తే అది కాంతార అయుండొచ్చంటున్నారు. అర్జున ఫాల్గుణ సినిమాకు ముందు అనుకున్న క్లైమాక్స్ లో ఫాంటసీ టచ్ ఉండి ఉంటుంది. అందుకే శ్రీవిష్ణు అలా అన్నాడని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక సింగిల్ సినిమా విషయానికొస్తే మే 9న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం శ్రీవిష్ణు తెగ ప్రమోషన్స్ చేస్తూ మూవీకి ఆల్రెడీ కావాల్సినంత బజ్ ను తీసుకొచ్చాడు.
