స్పిరిట్ : మరో హీరోయిన్ ఫిక్స్ అయినట్లే..!
'యానిమల్' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగు దర్శకుడు సందీప్ వంగ తన తదుపరి సినిమాను ప్రభాస్‌తో చేయబోతున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 19 Jun 2025 11:00 PM IST'యానిమల్' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగు దర్శకుడు సందీప్ వంగ తన తదుపరి సినిమాను ప్రభాస్‌తో చేయబోతున్న విషయం తెల్సిందే. ప్రభాస్, సందీప్ వంగ సినిమా ప్రకటన వచ్చి ఏళ్లు గడిచింది. ఈ ఏడాదిలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదు. ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. వీరి కాంబోలో రూపొందుతున్న సినిమాకు స్పిరిట్ అనే టైటిల్‌ను సైతం అప్పట్లోనే ప్రకటించాడు. ప్రభాస్ విభిన్న పాత్రలో నటించబోతున్నాడు. సినిమాలో హీరోయిన్‌కు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను ఎంపిక చేయడం జరిగింది.
సందీప్ వంగపై నమ్మకంతో పాటు, ప్రభాస్‌కి ఉన్న స్టార్‌డం నేపథ్యంలో స్పిరిట్ సినిమాకు దీపికా ఓకే చెప్పింది. కథ కూడా విన్న తర్వాత దీపికా పదుకునే పారితోషికం విషయంలో రాజీ పడేది లేదని చెప్పడంతో సందీప్ వంగ ఆమెను తొలగించాడు. సందీప్ వంగకు దీపికాకు మధ్య పెద్ద వార్ నడిచింది. పేరు ఎత్తకుండా దర్శకుడు సందీప్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఆయనకు మద్దతుగా చాలా మంది నిలిచారు. దీపికా ను తొలగించి యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన త్రిప్తి డిమ్రిని ఎంపిక చేయడం జరిగింది. త్రిప్తి ఎంపిక ను కొన్ని బాలీవుడ్ మీడియా హౌస్‌లు తీవ్రంగా పరిగణిస్తూ వచ్చాయి. ఆమెను డీ గ్రేడ్ చేస్తూ కొందరు పీఆర్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో త్రిప్తి డిమ్రికి మద్దతుగా నిలిచిన వారు చాలా మంది ఉన్నారు. స్పిరిట్ సినిమాలో మరో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బీని ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. ఈ సమయంలో వామికా గబ్బి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో త్రిప్తి ఎదుగుదలను కొందరు వ్యతిరేకిస్తూ ఉంటే వామికా మాత్రం తన సపోర్ట్ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎదగాలి, ప్రతి ఒక్కరి ఎదుగుదల కోసం ఇండస్ట్రీలో సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉంటాను అంది. త్రిప్తితో తనకు ఎలాంటి గొడవలు లేవని, ఆమెతో వర్క్ చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వామికా గబ్బి చేసిన వ్యాఖ్యలు వీరిద్దరు కలిసి 'స్పిరిట్' సినిమాలో నటించబోతున్నారు అనే వార్తలకు బలం చేకూర్చుతున్నాయి.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్‌గా చూపబోతున్నారని కొందరు లేదు ఆర్మీ ఆఫీసర్‌గా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. త్వరలోనే ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసిన మారుతి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఇదే ఏడాదిలో పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఫౌజీ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత స్పిరిట్ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొంటాడని తెలుస్తోంది. వెయ్యి కోట్ల వసూళ్లు టార్గెట్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
