వంగా చేతిలో బాటిల్.. స్పిరిట్ టీజింగ్ వేరే లెవెల్!
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు మరో ఆసక్తికరమైన ఫొటో వచ్చేసింది.
By: Tupaki Desk | 23 Oct 2026 5:40 PM ISTప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు మరో ఆసక్తికరమైన ఫొటో వచ్చేసింది. ఈసారి డార్లింగ్ పక్కన సందీప్ రెడ్డి వంగా కనిపించారు. కిచెన్‌లో బాటిల్ ఓపెన్ చేస్తున్న వంగాను ప్రభాస్ నవ్వుతూ చూస్తున్న ఫొటో అది. దీనికి 'స్పిరిట్స్ ఆర్ హై' అంటూ ఇచ్చిన క్యాప్షన్ మరింత ఆసక్తి పెంచింది. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఒక ఎత్తయితే, ఆ బాటిల్‌తో 'స్పిరిట్' పేరును కనెక్ట్ చేసిన విధానం మరో ఎత్తు.
నిజానికి ఈ బాటిల్ వ్యవహారం చూస్తే గతంలో వచ్చిన 'స్పిరిట్' ఫస్ట్ లుక్ గుర్తుకురాకుండా ఉండదు. గాయాలతో నిలబడిన ప్రభాస్ చేతిలో బాటిల్, పక్కన తృప్తి డిమ్రి కనిపించారు. అప్పట్లో ప్రభాస్ పట్టుకున్నది గ్లాసా, బాటిలా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. చివరకు అది లీటర్ బాటిల్ అని వంగానే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అదే తరహా వస్తువుతో ఇద్దరూ కనిపించడం అభిమానులకు సరదాగా అనిపిస్తోంది.
వంగా సినిమాల్లో హీరోల అలవాట్లకు క్రేజీ యాంగిల్ ఉంటుంది. 'అర్జున్ రెడ్డి' నుంచి 'యానిమల్' వరకు ఈ బజ్ హైలెట్ అయ్యింది. హీరో కోపం, ప్రేమ, వ్యసనాలు.. అన్నింటినీ పాత్రలో భాగంగానే చూపిస్తారు. ఇప్పుడు ప్రభాస్‌ను కూడా 'వన్ బ్యాడ్ హ్యాబిట్' ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా పరిచయం చేశారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లో రఫ్ లుక్ చూపించారు. అసలు ఆ బ్యాడ్ హ్యాబిట్ వెనక ఎలాంటి కథ ఉందనేది మాత్రం ఇంకా బయటపెట్టలేదు.
మరోవైపు ప్రభాస్‌కు ఈ సినిమా కెరీర్ పరంగా కూడా ప్రత్యేకమే. 'బాహుబలి'లో రాజుగా, 'సలార్'లో మాస్ హీరోగా, 'కల్కి'లో ఫ్యూచరిస్టిక్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు వంగా దర్శకత్వంలో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు. 'యానిమల్'లో రణబీర్ కపూర్‌ను పూర్తిగా కొత్తగా ప్రజెంట్ చేసిన వంగా, ప్రభాస్‌తో ఎలాంటి ప్రయోగం చేస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ ఇమేజ్‌కు తగ్గ ఎలివేషన్స్‌తో పాటు పాత్రలోని నెగటివ్ షేడ్స్‌ను ఎలా చూపిస్తారనేది ఆసక్తికరం.
ఇక 'స్పిరిట్' రిలీజ్ ప్లాన్ కూడా ఇటీవలే మారిపోయింది. ముందుగా 2027 మార్చి 5న సినిమా తీసుకురావాలనుకున్న మేకర్స్ ఇప్పుడు అక్టోబర్ 29కి మార్చారు. దీపావళి సీజన్‌ను టార్గెట్ చేశారు. అదే సమయంలో రణబీర్ కపూర్ 'రామాయణ' రెండో భాగం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఒకవైపు పురాణ నేపథ్యంలోని భారీ సినిమా, మరోవైపు వంగా స్టైల్లో పోలీస్ యాక్షన్ డ్రామా రావడంతో బాక్సాఫీస్ పోటీ ఆసక్తికరంగా ఉండబోతోంది.
'స్పిరిట్'లో వివేక్ ఒబెరాయ్ కూడా కీలక పాత్ర చేస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ కూడా వంగానే చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' తరహాలోనే ఈ సినిమాను కూడా తనకు నచ్చిన విధంగా కట్ చేయబోతున్నారు. టీసిరీస్, భద్రకాళి పిక్చర్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
