Begin typing your search above and press return to search.

'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' మూవీ రివ్యూ

మార్వెల్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో అభిమాన గణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఆ సంస్థ రూపొందించే సూపర్ హీరో సినిమాలకు ఉండే డిమాండ్ వేరు.

By:  Tupaki Desk   |   30 July 2026 11:04 AM IST
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ
X

‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ

నటీనటులు: టామ్ హాలండ్- జెండాయా- శాడీ సింక్- జాకబ్ బ్యాటలాన్- జాన్ బెర్నతాల్- మైకేల్ మాండో- టిల్మన్-మార్క్ రుఫాలో తదితరులు

సంగీతం: మైకేల్ జియాచినో

ఛాాయాగ్రహణం: బ్రెట్ పావ్లాక్

నిర్మాణం: మార్వెల్ స్టూడియోస్

రచన: క్రిస్ మెకేనా- ఎరిక్ సిమ్మర్స్

దర్శకత్వం: డెస్టిన్ డేనియల్ క్రెటాన్

మార్వెల్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో అభిమాన గణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఆ సంస్థ రూపొందించే సూపర్ హీరో సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. ఇక వాటిలో స్పైడర్ పేరు చెబితే మార్వెల్ ఫ్యాన్స్ ఊగిపోతారు. ఆ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పుడొచ్చిన కొత్త చిత్రం.. ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి అంచనాల మధ్య విడుదలైంది. మరి ‘స్పైడర్ మ్యాన్’ మరోసారి మెప్పించాడా? తెలుసుకుందాం పదండి.

ముందుగా ‘బ్రాండ్ న్యూ డే’ కథ విషయానికి వస్తే స్పైడర్ మ్యాన్ గా తనకున్న ప్రత్యేక శక్తులతో న్యూయార్క్ నగరాన్ని కాపాడుతూ వస్తున్న పీటర్ పార్కర్ (టామ్ హాలండ్).. తన ఐడెంటిటీ బయటపడిపోవడం వల్ల తన వాళ్లకు ప్రమాదం తలెత్తడంతో అందరి జ్ఞాపకాల నుంచి తనను తుడిచేసి కొత్త జీవితం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఒంటరివాడైపోతాడు. దీని వల్ల వేదన అనుభవించినప్పటికీ ప్రజల కోసం ఓర్చుకుంటాడు. అప్పుడే జీన్ (శాడీ సింక్) అనే అమ్మాయి వల్ల న్యూాయార్క్ నగరం కొత్త ముప్పును ఎదుర్కొంటుంది. ఆమె వల్ల తన ప్రియురాలైన ఎంజే (జెండయా) కూడా ప్రమాదంలో ఉన్నట్లు పీటర్ కు అర్థమవుతుంది. ఆ స్థితిలో పీటర్ ఏం చేశాడు.. ఎంజేతో పాటు న్యూయార్క్ నగరాన్ని ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ.

సూపర్ మ్యాన్ సినిమాలనగానే ఆ పాత్ర చేసే అద్భుత విన్యాసాలు.. కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలు.. వావ్ అనిపించే విజువల్ ఎఫెక్ట్స్.. ఇలా నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేసే విజువల్ వండర్స్ ను ఆశిస్తారు ప్రేక్షకులు. వాటి డోస్ తగ్గితే సంతృప్తికరంగా అనిపించదు. ఈ కోణంలో చూస్తే ‘స్పైడర్ మ్యాన్’ ఫ్రాంఛైజీలో వచ్చిన కొత్త చిత్రం ఒకింత నిరాశపరిచే చిత్రమే. గత స్పైడర్ చిత్రాల్లో ఉన్నంత భారీతనం.. నాన్ స్టాప్ యాక్షన్.. హై మూమెంట్స్.. విజువల్ మాయాజాలం ఇందులో లేదు. అందుకు కారణం లేకపోలేదు. ఈసారి ఎంచుకున్న కథే కాస్త భిన్నమైంది. కుటుంబం-సన్నిహితులు అందరికీ దూరమై ఒంటరివాడిగా మారిన స్పైడర్ మ్యాన్.. ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెడతాడిందులో. అందుకే ఈ చిత్రానికి ‘బ్రాండ్ న్యూ డే’ అని టైటిల్ పెట్టారు. ఈ క్రమంలో అతను ఎదుర్కొనే వేదనను ఇందులో హైలైట్ చేశారు. అదే సమయంలో జీన్ అనే అమ్మాయి చేసిన విలన్ పాత్ర కూడా ఉద్వేగభరితమైందే. ఇలా హీరో-విలన్ ఇద్దరి పాత్రలకూ బలమైన ఎమోషనల్ టచ్ ఇవ్వడంతో కథలో ఫోకస్ భావోద్వేగాల మీదే ఎక్కువగా ఉంటుంది. అవి బాగా పండాయి కూడా. అలా అని ‘స్పైడర్ మ్యాన్’ విన్యాసాలేమీ లేవని కాదు. ఆ పాత్ర మార్కు ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందని కాదు. ఆ రకమైన వినోదం ఉంది. కానీ డోస్ తగ్గింది.

రెండున్నర గంటల నిడివి ఉన్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’లో ఒక గంట పాటు సింపుల్-ఎమోషనల్ కాన్వర్జేషన్లు ఉంటాయి. వాటిలో హైలైట్ అనిపించేది విలన్ పాత్ర చేసిన జీన్ తో స్పైడర్ మ్యాన్ జరిపే పది నిమిషాల సంభాషణ. చాలా ఎమోషనల్ గా సాగే ఆ సన్నివేశం ప్రేక్షకులను కదిలించేస్తుంది. విలన్ పాత్ర మీద కూడా సానుభూతి కలిగించి.. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టే సీన్ అది. ప్రి క్లైమాక్సులో వచ్చే ఈ సన్నివేశం ఒక్కటి చాలు ‘బ్రాండ్ న్యూ డే’ ప్రత్యేకత ఏంటో చెప్పడానికి. ఐతే ‘స్పైడర్ మ్యాన్’ గత చిత్రాల్లో పీటర్-ఎంజే మధ్య క్రియేట్ చేసిన స్ట్రాంగ్ బాండ్ కు తగ్గట్లు ఇందులో ఆ రెండు పాత్రల మధ్య ఎమోషన్ ను ఇందులో క్యారీ చేయలేకపోయారు. ఈ క్యారెక్టర్ల మధ్య సీన్లు సరిగా పండలేదు. ఇక ‘బ్రాండ్ న్యూ డే’లో ఆరంభ సన్నివేశాలు కూడా కొంచెం నెమ్మదిగా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత మాత్రం సినిమా రయ్యిన దూసుకెళ్తుంది.

‘బ్రాండ్ న్యూ డే’లో యాక్షన్ డోస్ మునుపటి సినిమాల స్థాయిలో లేకపోయినా.. ఉన్నంత వరకు యాక్షన్ ఘట్టాలు అదిరిపోయాయి. స్కార్పియన్ తో ఫైట్.. ప్రి క్లైమాక్స్ ఎపిసోడ్ వావ్ అనిపిస్తాయి. ముఖ్యంగా హల్క్ పాత్ర క్యామియోతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఉన్న కాసేపు హల్క్ పాత్ర ఇచ్చే హైయే వేరు. హల్క్-స్పైడర్ మ్యాన్ ఫైట్లో భారీతనం.. విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి. క్లైమాక్స్ ఫైట్లో స్పైడర్ మ్యాన్ విన్యాసాలు కూడా ఆకట్టుకుంటాయి. యాక్షన్ కొరియోగ్రఫీ.. విజువల్ ఎఫెక్ట్స్.. సినిమాటోగ్రఫీ.. బీజీఎం వేరే లెవెల్లో సాగాయి. స్పైడర్ మ్యాన్ పాత్రలో టామ్ హాలండ్ అద్భుతంగా నటించాడు. జీన్ పాత్రలో శాడీ సింక్ పెర్ఫామెన్స్ కూడా కట్టిపడేస్తుంది. జెండయా ఓకే కానీ.. గత సినిమాల లెవెల్లో తన పాత్ర-నటన లేవు. మిగతా ఆర్టిస్టులంతా బాగా చేశారు. మార్వెల్ వాళ్ల ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పేదేముంది? టాప్ లెవెల్లో సాగాయి. ముందే అన్నట్లు ‘స్పైడర్ మ్యాన్’ గత చిత్రాల స్థాయిలో నాన్ స్టాప్ యాక్షన్-విజువల్ మాయాజాలం లేకపోయినా.. హై ఇచ్చే సీన్లు తగ్గినా.. ‘బ్రాండ్ న్యూ డే’లో వినోదానికి ఢోకా లేదు. మిగతా 'స్పైడర్ మ్యాన్' చిత్రాల కంటే ఇది భిన్నంగా.. ఎమోషనల్ గా సాగుతుంది. ‘స్పైడర్ మ్యాన్’ లవర్స్ కచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా ఇది.

చివరగా: స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే.. బ్రాండ్ న్యూ ఎంటర్టైన్మెంట్

రేటింగ్ - 3.25/5