Begin typing your search above and press return to search.

బాలూ పాటకు ఆమె పల్లవి

గాన గంధర్వుడుగా తెలుగు వారి నీరాజనాలు మాత్రమే కాదు దేశంలోని అనేక ప్రాంతీయ భాషలలో కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు తెచ్చుకున్నారు.

By:  Satya P   |   17 April 2026 8:58 AM IST
బాలూ పాటకు ఆమె పల్లవి
X

గాన గంధర్వుడుగా తెలుగు వారి నీరాజనాలు మాత్రమే కాదు దేశంలోని అనేక ప్రాంతీయ భాషలలో కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్ లో సైతం బాలూ సత్తా చాటారు. అక్కడ అనేక హిట్ సాంగ్స్ బాలు పేరు మీద నమోదు అయి ఉన్నాయి. అయితే బాలూ కుటుంబ సభ్యులు కూడా సినీ సంగీత ప్రపంచంలో తమ ప్రతిభను చాటుకున్న సంగతి చాలా కొంతమందికే తెలుసు. బాలు చెల్లెలు ఎస్పీ శైలజా నేపధ్య గాయనీమణిగా తన పాటలతో అలరించారు. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ అయితే సింగర్ గా అనేక చిత్రాలలో పాటలు పాడి పేరు తెచ్చుకున్నారు. అదే వరసలో కుమార్తె ఎస్పీ పల్లవి కూడా సినీ రంగంలో ప్రవేశించి కొన్ని పాటలు పాడారు.

తండ్రితో కలసి కుమార్తె :

ఆమె తన తండ్రి ఎస్పీ బాలూతో కలసి 1994లో వచ్చిన ప్రేమికుడు మూవీలో అందమైన ప్రేమరాణి చేయి తగిలితే అంటూ సాగే పాటను ఆలపించారు. ఈ మూవీకి సంగీతం అందించింది ఎస్ ఏ రహమాన్. అలాగే ఆమె జీన్స్ మూవీలో కూడా ప్రముఖ గాయకుడు ఉన్ని క్రిష్ణన్ తో కలసి హాయిరబ్బా హాయిరబ్బా అంటూ పాడిన పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది. అలాగే తెలుగులో డ్రైవర్ బాబు సినిమాలో బాలు శైలజతో కలసి ముద్దుకు ముద్దుగుమ్మ అన్న పాట పాడారు.

బాలు నిబద్ధత అది :

ఎస్పీబీ తన ఇద్దరు పిల్లలకు సంగీతం పట్ల మక్కువతో పెట్టుకున్న పేర్లు ఎంతో ముచ్చటగా ఉంటాయి. కుమార్తెకు పల్లవి అని కుమారుడికి చరణ్ అని ఆయన పేర్లు పెట్టడం ద్వారా పాట తన ఇంట్లోనూ ఒంట్లోనూ ఉందనిపించారు. చిన్న వయసులోనే తెలుగు సినిమాల్లో బాల నటులకు పల్లవి కొన్ని పాటలను పాడి నేపధ్య గాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. బాలు వంటి గాయకుడు ఇంట్లో ఉంటే పిల్లలకు కూడా ఆ సంగీత వాసనలు అబ్బుతాయి అనడానికి పల్లవి చరణ్ ఇద్దరూ ఉదాహరణగా చెప్పాలి.

స్టేజ్ షోలతో కూడా :

ఆమె గతంలో బాలూతో కలసి స్టేజ్ షొలను కూడా చేసి శ్రోతలను అలరించారు. అయితే ఆమె కేవలం హాబీగానే పాటలను తీసుకున్నారు. కానీ ప్రొఫెషనల్ సింగర్ గా మారాలని అనుకోలేదని అంటారు. ఇదిలా ఉంటే పల్లవి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. ఇక బాలు దివంగతులు అయ్యాక ఎస్పీ పల్లవి అప్పుడప్పుడు స్టేజి షోలు చేస్తూ వస్తున్నారు. అందులో ఆమె బాలు జ్ఞాపకార్ధం ఆయన పాటలను ఆలపిస్తూ అభిమానులను రంజింపచేస్తున్నారు.

ఈ మధ్యనే కేరళలో బాలూ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని అక్కడ బాలూ అభిమానులు పూనుకుని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాలూ కుమార్తె పల్లవి కనిపించి ఆయన అభిమానులు అందరినీ ఆకట్టుకున్నారు. సందర్భం కుదిరిన ప్రతీ సారీ తన తండ్రి బాలు గురించి ఆమె ఎంతో గొప్పగా చెబుతారు. బాలూ పాటలతో పెరిగిన ఆయన కుమార్తె తన తండ్రి వారసత్వాన్ని కుటుంబ సభ్యులం అంతా కలసి కొనసాగిస్తామని చెబుతూ ఉంటారు.