Begin typing your search above and press return to search.

భారీగా పెరిగిన హీరోయిన్స్ పారితోషికం.. కారణం ఇదే

పదేళ్ల ముందు వరకు సౌత్ ఇండియాలో హీరోయిన్స్‌ పారితోషికం నామమాత్రంగానే ఉండేది.

By:  Tupaki Desk   |   6 May 2025 4:00 PM IST
భారీగా పెరిగిన హీరోయిన్స్ పారితోషికం.. కారణం ఇదే
X

పదేళ్ల ముందు వరకు సౌత్ ఇండియాలో హీరోయిన్స్‌ పారితోషికం నామమాత్రంగానే ఉండేది. హీరోలు పది నుంచి ఇరవై కోట్లు పారితోషికంగా తీసుకున్న సమయంలో హీరోయిన్స్ కోటి పారితోషికంను అందుకోవడం పెద్ద విషయం. మొన్నటి వరకు హీరోయిన్స్‌ రెండు మూడు కోట్ల పారితోషికం తీసుకున్నారంటే చాలా ఎక్కువ అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నార్త్‌ హీరోయిన్స్‌తో సమానంగా పారితోషికంను అందుకుంటున్నారు. హీరోయిన్స్‌ కూడా ఏకంగా పది కోట్ల రూపాయల పారితోషికంను అందుకున్న దాఖలాలు ఉన్నాయి. తెలుగు హీరోయిన్స్‌లోనే ఇద్దరు ముగ్గురు పది కోట్ల పారితోషికం అందుకున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

ఇటీవల ఒక స్టార్‌ హీరోయిన్‌ తెలుగులో ఒక సినిమాను కమిట్‌ అయ్యేందుకు గాను ఏకంగా పది కోట్ల రూపాయలను డిమాండ్‌ చేసిందట. ఆ నటి డిమాండ్‌ కి నిర్మాతలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆమె డేట్లు పెద్ద మొత్తంలో ఇవ్వకున్నా, పెద్దగా యాక్షన్‌ సీన్స్‌, నటనకు ఆస్కారం ఉన్న సీన్స్‌ చేయకున్నా కూడా పది కోట్ల పారితోషికంను ఇచ్చేందుకు నిర్మాత కమిట్‌ అవ్వడానికి కారణం ఆమెకు ఉన్న మార్కెట్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆ సీనియర్ హీరో ఎలాగూ తెలుగులో మంచి స్టార్‌డం ఉన్న నటుడు. కనుక తెలుగు మార్కెట్‌కి ఇబ్బంది లేదు. ఇక ఇతర భాషల్లో మంచి మార్కెట్‌ కోసం ఆ హీరోయిన్‌ను లైన్‌లోకి తీసుకున్నారని తెలుస్తోంది.

ఆ మధ్య ఒక టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో సినిమాలో బాలీవుడ్‌ నటిని ఎంపిక చేశారు. ఆమెకు అత్యధిక పారితోషికంను ఇచ్చారనే వార్తలు వచ్చాయి. ఆమెకు బాలీవుడ్‌లో ఉన్న స్టార్‌డంతో సినిమాకు అక్కడ మంచి మార్కెట్‌ దక్కుతుంది అనే ఉద్దేశంతో ఆ స్థాయి పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. హీరోయిన్స్ కి ఉన్న స్టార్‌డం ను బట్టి పారితోషికంను ఇస్తున్నారు. ఇతర భాషల్లో మన సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే హీరోయిన్‌ అక్కడి హీరోయిన్‌ కావాలి. ఆ హీరోయిన్‌కి ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అవుతుంది. అందుకే హీరోయిన్‌లు పారితోషికం భారీగా డిమాండ్ చేస్తున్నారు. అందుకు నిర్మాతలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు.

హీరోయిన్స్ వల్ల ఇతర భాషల్లో థియేట్రికల్‌ బిజినెస్ మాత్రమే కాకుండా ఓటీటీ బిజినెస్‌ కూడా అనూహ్యంగా పెరగడం మనం చూస్తూ ఉంటాం. అందుకే హీరోయిన్స్‌ను ఎంపిక చేసే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఆ మధ్య ఒక సీనియర్ హీరో సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌తో ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా హిందీ ప్రేక్షకులు సినిమాను ఓటీటీలో అత్యధికంగా చూశారు. కేవలం ఆ హీరోయిన్‌ వల్లే ఓటీటీలో తెలుగు సినిమాకు హిందీలో అత్యధిక వ్యూస్ వచ్చాయని టాక్. అందుకే హీరోయిన్స్‌ కి భారీగా పారితోషికం పెరిగింది. ముందు ముందు హీరోలకు సమానంగా పారితోషికం అందుకున్న ఆశ్చర్యం లేదు.