సౌత్ గేమ్ ఛేంజర్: హాలీవుడ్‌పై దండయాత్ర
దక్షిణాది సినిమా ఇప్పుడు హాలీవుడ్ రేంజుకు ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ సైతం దీనిని అనుసరించాల్సిన పరిస్థితి ఉంది.
By: Tupaki Desk | 23 April 2025 12:37 PM ISTదక్షిణాది సినిమా ఇప్పుడు హాలీవుడ్ రేంజుకు ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ సైతం దీనిని అనుసరించాల్సిన పరిస్థితి ఉంది. తెలుగు, తమిళం, కన్నడ రంగాల్లో భారీ పాన్ ఇండియా సినిమాల వెల్లువ కొనసాగుతోంది. ప్రపంచంలోని అత్యున్నత సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినోదరంగంలో సౌత్ తన పరిధిని విస్త్రతం చేస్తోంది. మంచి కథ, కథనాలతో పాటు, అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, గ్రాఫిక్స్- వీఎఫ్ఎక్స్ వర్క్ ని సౌత్ ఇండస్ట్రీ సద్వినియోగం చేసుకుంటోంది. ఇటీవలి కాలంలో అపరిమిత బడ్జెట్లతో సౌత్ లో చేస్తున్న సాహసాలు అన్నీ ఇన్నీ కావు. పాన్ వరల్డ్ మార్కెట్లో సత్తా చాటడమే ధ్యేయంగా మన దర్శకనిర్మాతల ప్రణాళికలు చూస్తుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం. కొత్త మార్కెట్లకు ద్వారాలు తెరవడం ద్వారా మునుముందు హాలీవుడ్ కి ధీటైన సినిమాలను సౌతిండియా లేదా భారతీయ సినీపరిశ్రమ అందించే ప్రయత్నం చేస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి మొదలు పెట్టిన యజ్ఞంలో ఇతర దర్శకులు పాల్గొంటున్నారు. ప్రశాంత్ నీల్, సుకుమార్ సహా చాలా మంది నేటితరం జెన్ జెడ్ దర్శకులు ఈ యజ్ఞాన్ని మునుముందు కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే మన దర్శకనిర్మాతలు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం కోసం, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషలిస్టుల కోసం ఏకంగా హాలీవుడ్ కి వెళ్లి భారీ మొత్తాల్ని ఖర్చు చేస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. సూపర్‌స్టార్ మహేష్ - రాజమౌళి సినిమా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ మూవీ, యష్ నటిస్తున్న టాక్సిక్, మెగాస్టార్ చిరంజీవి- వశిష్ఠల విశ్వంభర.. వీటన్నిటికీ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ నిపుణులు పని చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మహేష్ - రాజమౌళి ఫారెస్ట్ అడ్వెంచర్ కోసం భారీ వీఎఫ్ ఎక్స్ వినియోగించనున్నారు. వీఎఫ్ ఎక్స్ - హై-ఎండ్ గ్రాఫిక్స్‌ను అందించడానికి హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందం కుదిరిందని సమాచారం. తొలుత వీఎఫ్ఎక్స్ సన్నివేశాలను రాజమౌళి పూర్తి చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పెండింగ్ చిత్రీకరణ జరుగుతుండగానే వీఎఫ్ఎక్స్ తో ముడిపడిన పనులు వేగంగా పూర్తవుతాయనేది వ్యూహం. ఇలా చేయడం ద్వారా టైమ్ ని బాగా సేవ్ చేయగలరు. ఈ చిత్రం దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలనేది రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పని చేసారు. మహేష్ బాబు స్వయంగా సినిమా సాంకేతిక అంశాలపై దృష్టి సారించి మూడు రోజుల సెషన్ కోసం జర్మనీకి వెళ్లారని కూడా కథనాలొచ్చాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ మూవీ మరో లెవల్లో ఉంటుందని ఇప్పటికే సంకేతాలు అందాయి. దీనికి తాత్కాలికంగా AA22xA6 అని పేరు పెట్టారు. పుష్ప, పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు అతడు ఏకంగా హాలీవుడ్ రేంజ్ మార్కెట్ పై దృష్టి సారించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ కోసం అట్లీ టాప్ హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలతో చర్చించేందుకు లాస్ ఏంజిల్స్‌కు వెళ్లిన సంగతి తెలిసినదే. స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్, కెప్టెన్ అమెరికా: సివిల్ వార్, అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ చిత్రాలకు పని చేసిన ప్రఖ్యాత ఐరన్‌హెడ్ స్టూడియో సీఈవో, ఆర్ట్ డైరెక్టర్ జోస్ ఫెర్నాండెజ్ సహా ప్రఖ్యాత వీఎఫ్ఎక్స్ నిపుణులను వారు కలిశారు. ఐరన్ మ్యాన్ 2, జీఐ జో: రిటాలియేషన్ చిత్రాలతో పాపులరైన వీఎఫ్.ఎక్స్ సూపర్‌వైజర్ జేమ్స్ మాడిగన్‌తో కూడా బన్ని అట్లీ బృందం సంప్రదించింది. ఈ సినిమా కోసం అపరిమిత బడ్జెట్ ఖర్చు చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `విశ్వంభర` కోసం ప్రఖ్యాత హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ బృందాలతో కలిసి పని చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం ఏకంగా వీఎఫ్ఎక్స్ బడ్జెట్ ని 75 కోట్లకు పెంచడంతో మరో స్థాయిలో విజువల్స్ ని ఎలివేట్ చేసేందుకు పనులు సాగుతున్నాయని సమాచారం. ఇటీవల విడుదలైన విశ్వంభర టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ నాశిరకంగా ఉన్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో దానిపై మేకర్స్ వివరణ ఇచ్చారు. తొలుత పలు వీఎఫ్ఎక్స్ కంపెనీలతో సంప్రదింపులు జరపగా 3నెలల్లో పని పూర్తి చేస్తామని చెప్పినా కనీసం 6 నెలలకు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందని, దీంతో ఏఐ సహకారంతో టీజర్ పనిని పూర్తి చేసి రిలీజ్ చేసామని తెలిపారు. కానీ నాశిరకం విజువల్స్ కారణంగా దీనికి సానుకూల స్పందన రాలేదని నిర్మాతలు వెల్లడించారు.
యష్ కథానాయకుడిగా జాతీయ అవార్డ్ గ్రహీత గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ `టాక్సిక్` కోసం భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. టాక్సిక్ బృందం అంతర్జాతీయ రిలీజ్ కోసం ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని కథనాలొచ్చాయి. దానికి తగ్గట్టే యాక్షన్ పార్ట్, వీఎఫ్ ఎక్స్ కోసం హాలీవుడ్ నిపుణులతో కలిసి పని చేస్తున్నారు. `టాక్సిక్` వరల్డ్ క్లాస్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతోంది. జాన్ విక్, ఫాస్ట్ & ఫ్యూరియస్ వంటి హాలీవుడ్ ఫ్రాంచైజీలకు పని చేసిన ప్రఖ్యాత స్టంట్ కోఆర్డినేటర్ జెజె పెర్రీ కొరియోగ్రఫీ చేశారు. యాక్షన్‌కు అనుబంధంగా సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌ను అందిస్తున్నారు. `డూన్: పార్ట్ 2` సినిమా వెనుక బాఫ్టా విన్నింగ్ వీఎఫ్ఎక్స్ స్టూడియో అయిన DNEG దీనికోసం పని చేస్తోంది. అల్ట్రా మోడ్రన్ స్టోరీ టెల్లింగ్ లో గీతూ మోహన్ అంకితభావం దృష్ట్యా మేకర్స్ అపరిమిత బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారని సమాచారం.
తదుపరి ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ మూవీ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారని సమాచారం. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు, వీఎఫ్ ఎక్స్ నిపుణులతో అత్యంత భారీ స్కేల్ లో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. సముద్రం నేపథ్యంలో నీల్ భారీ యాక్షన్ సీక్వెన్సుల్ని ప్లాన్ చేస్తుండడంతో దీనికి వీఎఫ్.ఎక్స్ ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా దీనిపై నీల్ బృందం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న సీక్వెల్ మూవీ `జై హనుమాన్` కోసం భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని కూడా కథనాలొచ్చాయి.