ఇండస్ట్రీ బజ్: పోటీతత్వం కంటే కంటెంటే కింగ్
ఆ తర్వాత కన్నడ చిత్రపరిశ్రమ కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో ఈ ఫీట్ ని సాధించింది. దీంతో మాలీవుడ్, కోలీవుడ్ లో దిగ్గజాలంతా పోటీతత్వంతో సినిమాలు తీయడం ప్రారంభించారు.
By: Tupaki Desk | 11 May 2025 2:00 PM ISTఇటీవలి కాలంలో దక్షిణాది సినీపరిశ్రమలో పోటీతత్వం అమాంతం పెరిగింది. మొదట టాలీవుడ్ 500-1000 కోట్ల మధ్య వసూళ్ల క్లబ్ చిత్రాలను అందించింది. ఆ తర్వాత కన్నడ చిత్రపరిశ్రమ కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో ఈ ఫీట్ ని సాధించింది. దీంతో మాలీవుడ్, కోలీవుడ్ లో దిగ్గజాలంతా పోటీతత్వంతో సినిమాలు తీయడం ప్రారంభించారు. కానీ పెద్ద సినిమాలు తీసిన ప్రతిసారీ కోలీవుడ్ చతికిలబడుతూనే ఉంది. ఒక్క దళపతి విజయ్ సినిమాలు మినహా ఇతరులు నటించిన సినిమాలేవీ 300కోట్లు వసూలు చేయడం గగనంగా మారింది. జైలర్ తో రజనీకాంత్ ఒక్కడే 500కోట్ల క్లబ్ లో అడుగు పెట్టారు. అంతకుముందు ఆయనకే 2.0 తో 500కోట్ల క్లబ్ దక్కింది. కోలీవుడ్ పెద్ద బ్లాక్ బస్టర్ వసూళ్ల రేంజ్ 300 కోట్ల లోపే.
అయితే ఇటీవలి కాలంలో అనూహ్యంగా మలయాళ చిత్రపరిశ్రమ రేసులో ముందుకు దూసుకొచ్చింది. టాలీవుడ్, శాండల్వుడ్ తర్వాత మాలీవుడ్ అనేంతగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ 2 ఎంపూరన్ అద్భుతమైన కంటెంట్ తో బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధించింది. ఈ సినిమా 270 కోట్ల వసూళ్లను సాధించగా, లాల్ నటించిన మరో సినిమా 180 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇంకా ఆడుతోంది. దీంతో మోహన్ లాల్ ఒక్కడే ఈ సీజన్ లో సుమారు 450కోట్లు వసూలు చేసిన హీరో అయ్యాడు. బాక్సింగ్ డ్రామా 'అలపుజ్జ జింఖానా' రూ.68 కోట్లు, రేఖ చిత్రం రూ. 57 కోట్లు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ రూ. 53 కోట్ల వసూళ్లతో మాలీవుడ్ ది బెస్ట్‌గా ఉంది.
ఇదే ఏడాదిలో కోలీవుడ్ పరిస్థితి మరీ ధీనంగా మారింది. అక్కడ భారీ అంచనాలతో వచ్చిన అజిత్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ ఆశించిన రేంజుకు చేరలేక చతికిలబడ్డాయి. హైప్ తో వచ్చిన సూర్య రెట్రో, డ్రాగన్ కూడా ఫ్లాప్. కుడుంబస్థాన్, టూరిస్ట్ ఫ్యామిలీ లాంటి చిత్రాలే బెటర్ అనిపించాయి. ముఖ్యంగా కోలీవుడ్ బడా హీరోల సినిమాలు డిజాస్టర్లుగా మారడంతో రేసులో తంబీలు వెనక్కి తగ్గినట్టయింది. ఇక అవార్డ్ సినిమాలకు మాత్రమే అని చెప్పుకునే మాలీవుడ్ ఇటీవల కమర్షియల్ గాను మంచి విజయాల్ని అందుకుంటూ రేసులో ముందుకు దూసుకొస్తోంది. పోటీతత్వం కంటే మంచి కంటెంట్ తో మాలీవుడ్ తన పేరును నిలబెట్టుకుంటోంది.
