పెళ్లి తర్వాత బాలీవుడ్ రేసులో సౌత్ హీరోయిన్లు!
ఒకప్పుడు పరిశ్రమలో హీరోయిన్లకు వివాహం జరిగితే వారి కెరీర్ ముగిసిపోయినట్లే అనే బలమైన అపోహ ఉండేది.
By: Srikanth Kontham | 19 May 2026 11:00 PM ISTఒకప్పుడు పరిశ్రమలో హీరోయిన్లకు వివాహం జరిగితే వారి కెరీర్ ముగిసిపోయినట్లే అనే బలమైన అపోహ ఉండేది. గ్లామర్ ఫీల్డ్‌లో పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గడం, స్టార్ హోదాను కాపాడుకోవడం చాలా కష్టంగా మారేది. కానీ మారుతున్న కాలంతో పాటు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయికలు పెళ్లి తర్వాత కూడా వెండితెరపై హవాను కొనసాగిస్తూ బాలీవుడ్ రేసులో నిలుస్తున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా హిందీ బెల్ట్‌లో భారీ విజయాలను అందుకోవడం సవాలుగా మారినా? సౌత్ భామలు మాత్రం ఆ సవాలును స్వీకరిస్తూ ముందడుగు వేస్తున్నారు. లేడీ సూపర్‌స్టార్ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. పెళ్లి తర్వాత కూడా సౌత్ హీరోయిన్ బాలీవుడ్‌లో ఈ స్థాయి మాసివ్ సక్సెస్ సాధించవచ్చని నయనతార నిరూపించారు. ఈ ఘనవిజయం ప్రస్తుతం హిందీ చిత్రాలపై దృష్టి పెట్టిన ఇతర దక్షిణాది నటీమణులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది. ఇదే దారిలో పయనిస్తూ బాలీవుడ్‌లో లక్ చెక్ చేసుకోబోతున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన. పెళ్లి తర్వాత రష్మిక నటిస్తున్న మొదటి క్రేజీ హిందీ ప్రాజెక్ట్ 'కాక్టైల్ 2'. బాలీవుడ్ చాక్లెట్ బోయ్ షాహిద్ కపూర్‌తో కలిసి ఆమె నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ మూవీ జూన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
'యానిమల్' సినిమాతో ఇప్పటికే ఉత్తరాదిన భారీ క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత రాబోతున్న 'కాక్టైల్ 2' చిత్రంతో నయనతార తరహాలోనే మరో 1000 కోట్ల భారీ విజయాన్ని అందుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ కూడా సౌత్ కనెక్షన్‌తో హిందీ మార్కెట్‌లో సరికొత్త రికార్డులు సృష్టించే పనిలో ఉన్నారు. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్న తర్వాత కియారా ఎంచుకుంటున్న పాత్రలు ఎంతో వైవిధ్యంగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం 'టాక్సిక్' పైనే ఉన్నాయి.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామాలో కియారా అద్వానీ లీడ్ రోల్ పోషిస్తుండటంతో? పెళ్లి తర్వాత కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ మైలురాయిగా నిలుస్తుందని ధీమాగా ఉన్నారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు , పాన్-ఇండియా సినిమాల ట్రెండ్ కారణంగా హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలకు, వారి వృత్తిపరమైన విజయాలకు ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. పెళ్లయిన నటీమణులను కూడా ప్రేక్షకులు స్క్రీన్‌పై అంతే ఆదరిస్తున్నారు. రష్మిక మందన, కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా ఫిట్‌నెస్‌ను, గ్లామర్‌ను కాపాడుకుంటూ బాలీవుడ్ అగ్ర హీరోల సరసన భారీ బడ్జెట్ చిత్రాలను లైన్‌లో పెడుతున్నారు.
సౌత్ - నార్త్ ఇండస్ట్రీల మధ్య ఉన్న సరిహద్దులు చెరిగిపోతుండటం వీరికి మరింత ప్లస్ పాయింట్‌గా మారుతోంది.పెళ్లి తర్వాత బాలీవుడ్ మార్కెట్‌లో నిలదొక్కుకోవడం అనేది సౌత్ హీరోయిన్లకు క్రేజీ టాస్క్ అయినా నటన, అంకితభావంతో సక్సెస్ అవుతున్నారు. జూన్ 19న రాబోతున్న రష్మిక 'కాక్టైల్ 2' భవిష్యత్తులో రానున్న కియారా `టాక్సిక్` చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను రాబడతాయో చూడాలి. ఈ చిత్రాలు గనుక ఘనవిజయం సాధిస్తే పరిశ్రమలో వివాహం తర్వాత హీరోయిన్ల కెరీర్ ప్లానింగ్ వారి స్టార్ హోదాకు సంబంధించిన సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం.
