Begin typing your search above and press return to search.

అప్పుడు మన సినిమా పై చిన్నచూపు.. ఇప్పుడు ఆదర్శం!

పాతిక సంవత్సరాల క్రితం బాలీవుడ్‌ సినిమాలకు ఏ విధంగానూ సౌత్‌ ఇండియన్ సినిమాలు పోటీ ఇచ్చేవి కాదు.

By:  Tupaki Desk   |   22 April 2025 4:00 AM IST
అప్పుడు మన సినిమా పై చిన్నచూపు.. ఇప్పుడు ఆదర్శం!
X

పాతిక సంవత్సరాల క్రితం బాలీవుడ్‌ సినిమాలకు ఏ విధంగానూ సౌత్‌ ఇండియన్ సినిమాలు పోటీ ఇచ్చేవి కాదు. హీరోల పారితోషికం మొదలుకుని ప్రతి విషయంలోనూ బాలీవుడ్‌ సినిమాలకు, తెలుగు తమిళ సినిమాలకు తేడా చాలా ఉండేది. హిందీ సినిమాల బడ్జెట్‌, అక్కడి టెక్నికల్‌ వాల్యూస్ చూసి చాలా మంది తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఆశ్చర్యపోయేవారు. హిందీలో హిట్ అయిన కొన్ని సినిమాలను అప్పట్లో తెలుగులో అధికారిక రీమేక్‌ లేదా అనధికారిక రీమేక్ చేసేవారు. చాలా సబ్జెక్ట్‌లను హిందీ సినిమాలను ఆదర్శంగా తీసుకుని చేశారు అంటూ అప్పట్లో విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. బాలీవుడ్‌ తో పోల్చితే తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలు చాలా ముందు ఉన్నాయి.

ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి గత దశాబ్ద కాలంగా వచ్చిన సినిమాలు హిందీ ఫిల్మ్‌ మేకర్స్‌ని సైతం సర్‌ప్రైజ్‌ చేసే విధంగా సూపర్‌ హిట్‌ అయ్యాయి. సబ్జెక్ట్‌, టెక్నికల్‌, బడ్జెట్‌ ఇలా ప్రతి అంశంలోనూ తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఒకప్పుడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్‌ శెట్టి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిందీలో ఎప్పుడో వచ్చిన షోలో, మొఘల్‌ ఏ అజమ్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆ తరహాలోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌లో సినిమాలు వస్తున్నాయని అన్నాడు. కానీ ఇప్పుడు అదే దర్శకుడు తెలుగు సినిమాలు బాహుబలి, కల్కి 2898 ఏడీ సినిమాలు అంటే తనకు ఇష్టం అని, ఆ సినిమాల వల్ల తన ఫిల్మ్‌ మేకింగ్‌ ఆలోచన మారిందంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

బాహుబలి, కల్కి సినిమాలను ఫ్యామిలీ మొత్తం కలిసి చూసి ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తనలాంటి ఫిల్మ్‌ మేకర్స్‌ ఆ సినిమాలను చూసి చాలా నేర్చుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు తెలుగు సినిమాలను నాసిరకం సినిమాలు అంటూ వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్‌ వారు, తెలుగు సినిమాను చిన్న చూపు చూసిన హిందీ ఫిల్మ్‌ మేకర్స్ ఇప్పుడు మన సినిమాలను ఆదర్శంగా తీసుకుంటున్నామని చెప్పడం ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం. తెలుగు సినిమా స్థాయి కేవలం టెక్నికల్‌గానే మారకుండా కథను చూపించే విధానంలో, టెక్నాలజీని వినియోగించుకోవడంలోనూ చాలా మార్పులు వచ్చాయి.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద మినిమం వసూళ్లను సొంతం చేసుకోలేక పోతున్నాయి. కరోనా తర్వాత హిందీ సినిమాల సక్సెస్‌ రేటు దారుణంగా పడిపోయింది. కానీ సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో సినిమాల జోరు మరింతగా పెరిగింది. థియేట్రికల్‌ రిలీజ్‌ మాత్రమే కాకుండా ఓటీటీలోనూ సౌత్‌ సినిమాలకు విశేష ఆధరణ లభిస్తుంది. హిందీ సినిమాల బడ్జెట్‌తో పోల్చితే సౌత్‌ సినిమాల బడ్జెట్‌ ముఖ్యంగా తెలుగు సినిమాల బడ్జెట్‌ రెండు మూడు రెట్లు అధికంగా పెరిగింది. ప్రభాస్ వంటి స్టార్‌ హీరోల సినిమాలు పాజిటివ్ టాక్‌ దక్కించుకుంటే చాలు వేయ్యి కోట్ల వసూళ్లు నమోదు అవుతున్నాయి.