నటన మాత్రమే కాదు.. నిర్మాణం కూడా!
ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా పలు వ్యాపారాలు చేస్తూ సత్తా చాటుతున్నారు.
By: Tupaki Desk | 5 April 2025 7:00 PM ISTఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా పలు వ్యాపారాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. కొంతమంది హీరోయిన్లు వస్త్ర ప్రపంచంలోకి ఎంటరైతే, మరికొందరు బ్యూటీ ఉత్పత్తుల్లోకి ఎంటరయ్యారు. ఇంకొందరు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. కానీ కొందరు మాత్రం ఎక్కడైతే డబ్బు సంపాదిస్తున్నారో అక్కడే దాన్ని ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ నిర్మాతలుగా మారారు.
అప్పట్లో విజయ నిర్మల, భానుమతి లాంటి హీరోయిన్లు నిర్మాతలుగా మారి సినిమాలను నిర్మిస్తే ఇప్పుడు ఎంతోమంది హీరోయిన్లు నిర్మాతలుగా మారారు. మంచి కథలు దొరికితే వాటిని పక్కకు పోనీయకుండా తామే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టి నిర్మాతలుగా మారి సినిమాలు తెరకెక్కిస్తూ కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు.
మంచు లక్ష్మి: మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఎప్పుడో సినిమాల్లోకి వచ్చి నటిగా సినిమాలు చేస్తూనే మరోవైపు పలు సినిమాలను నిర్మించింది. మంచు లక్ష్మి నిర్మాతగా శ్రీ, నేను మీకు తెలుసా, ఝుమ్మంది నాదం, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, దొంగాట సినిమాలు నిర్మించింది.
యార్లగడ్డ సుప్రియ: అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ మొదట హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం సుప్రియ, అడివి శేష్ హీరోగా డెకాయిట్ మూవీ నిర్మిస్తోంది.
శివానీ రాజశేఖర్: సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివానీ రాజశేఖర్ కూడా నిర్మాతనే. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటిస్తూ తన తండ్రి హీరోగా నటిస్తున్న సినిమాలను నిర్మిస్తూ ఉంటుంది. శివానీ నిర్మాణంలో ఎవడైతే నాకేంటి, సత్యమేయ జయతే, కల్కి సినిమాలను నిర్మించింది.
నిహారిక: ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక మొదటి నుంచే నిర్మాణ రంగంలో ఉంది. హీరోయిన్ కంటే ముందే నిహారిక ఒక బ్యానర్ ను నిర్మించి అందులో షార్ట్ ఫిల్మ్స్ నిర్మిస్తూ ఉండేది. కమిటీ కుర్రోళ్లు సినిమాతో సినీ నిర్మాతగా మారిన నిహారిక ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో రెండో సినిమాను నిర్మించడానికి రెడీ అవుతుంది నిహారిక.
సమంత: స్టార్ హీరోయిన్ సమంత కూడా రీసెంట్ గానే సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో శుభం అనే సినిమాను నిర్మించిన సమంత, ఆమె ప్రధాన పాత్రలో మా ఇంటి బంగారం అనే సినిమాను కూడా అనౌన్స్ చేసింది. హీరోయిన్ గా సత్తా చాటిన సమంత నిర్మాతగా కూడా సక్సెస్ అవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇక రౌడీ పిక్చర్స్ బ్యానర్ లో నయనతార కూడా వరుస సినిమాలు నిర్మిస్తూ ఉంటుంది. ఈ బ్యానర్ లో నయనతారనే కాకుండా తన భర్త విఘ్నేష్ దర్శకత్వంలో వచ్చే సినిమాలను కూడా నిర్మిస్తోంది.
నిత్యా మీనన్ : ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించి నిత్యా మీనన్ కూడా ఈ మధ్య సినీ నిర్మాణంలోకి ఎంటరై స్కై ల్యాబ్ సినిమాతో నిర్మాతగా మారింది. ఆ సినిమాలో నిత్య కూడా ఒక లీడ్ రోల్ లో నటించింది.
అమలాపాల్: కడవర్ తో నిర్మాతగా మారిన అమలాపాల్ నిర్మాతగా ఇప్పుడు పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. పిట్టకథలు అనే వెబ్ సిరీస్ ను నిర్మించిన అమలాపాల్ అందులో లీడ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమలాపాల ప్రొడక్షన్స్ నుంచి అడాయ్, అధో అంధా పరవాయి పోలాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.
నజ్రియా నజీమ్ : మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ భార్య, మలయాళ నటి అయిన నజ్రియా నజీమ్ కూడా తన పేరుతో నజ్రియా నజీమ్ అనే ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ ను స్టార్ట్ చేసి మంచి సినిమాలను తెరకెక్కిస్తోంది.
జ్యోతిక : సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించిన జ్యోతిక చంద్రముఖి సినిమాతో అందరినీ మెప్పించింది. జ్యోతిక తన భర్తతో కలిసి 2D ఎంటర్‌టైన్మెంట్స్‌కు కో ప్రొడ్యూసర్ గా ఉంటూ జై భీమ్ లాంటి ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తోంది.
తాప్సీ: తెలుగు, హిందీ భాషల్లో నటిగా తనదైన ముద్ర వేసుకున్న తాప్సీ నటిగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
వీరే కాకుండా ప్రియాంక చోప్రా, కృతి సనన్, అనుష్క శర్మ, కంగనా రనౌత్ కూడా పలు సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు.
