Begin typing your search above and press return to search.

గ్రేట్‌ : సోనూ సూద్‌ కొనసాగిస్తూనే ఉన్నాడు

కానీ విలన్ పాత్రలతో మెప్పించి రియల్‌ హీరో అనిపించుకున్న సోనూ సూద్‌ మాత్రం తన సంపాదనలో మెజార్టీ భాగంను అవసరాల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు వినియోగిస్తారు.

By:  Ramesh Palla   |   31 July 2025 4:40 PM IST
గ్రేట్‌ : సోనూ సూద్‌ కొనసాగిస్తూనే ఉన్నాడు
X

సినిమాల్లో హీరోలుగా నటించే వారు నిజ జీవితానికి వచ్చేప్పటికి జీరోలుగా నిలుస్తూ ఉంటారు. వెండి తెరపై వంద మందిని ఒంటి చేత్తో మట్టి కరిపించే హీరోలు కనీసం ఒక్కరికి సాయం చేయరు అనే విమర్శలు ఉన్నాయి. కొందరు హీరోలు తమకు తోచిన విధంగా సాయం చేస్తూ ఉంటే, కొందరు హీరోలు తమ అభిమానుల ద్వారా తమ సాయం ను జనాలకు అందిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది స్టార్స్‌ తాము సంపాదించిన రూపాయిలో ఒక శాతం లేదా రెండు మూడు శాతం వరకు సాయంకు వినియోగిస్తారు. కానీ విలన్ పాత్రలతో మెప్పించి రియల్‌ హీరో అనిపించుకున్న సోనూ సూద్‌ మాత్రం తన సంపాదనలో మెజార్టీ భాగంను అవసరాల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు వినియోగిస్తారు. కరోనా సమయం నుంచి ఆయన యొక్క సేవా గుణం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం.

సోనూసూద్‌ సహాయ కార్యక్రమాలు

కరోనా మొదటి దశ సమయంలో లాక్‌డౌన్‌ కష్టాల నుంచి వలస కార్మికులను కాపాడిన దేవుడు సోనూసూద్‌ అనే విషయం తెల్సిందే. ఇక రెండోసారి కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో సోనూ సూద్‌ వేలాది మందికి ఆక్సీజన్‌ అందించి దేవుడు అయ్యాడు. అలా దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న గొప్ప వ్యక్తి సోనూ సూద్‌ అనడంలో సందేహం లేదు. అలాంటి సోనూ సూద్‌ కరోనా తర్వాత సైలెంట్‌ అయ్యాడా అంటే లేదు... ఆయన సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక ఫౌండేషన్‌ను ప్రారంభించి తనవంతు సహాయ సహకారాలు అందిస్తూనే గొప్ప మనసును చాటుకుంటున్న విషయం తెల్సిందే.

500 మంది కోసం వృద్ధాశ్రమం

తాజాగా ఆయన తన 52వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా ప్రముఖులకు పార్టీలు ఇవ్వకుండా, తన ఫ్యామిలీతో విదేశీ ట్రిప్స్‌కు వెళ్లకుండా ఏకంగా 500 మంది అనాధలు ఉండే విధంగా ఒక భారీ భవన నిర్మాణంను చేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. అందుకోసం కావాల్సిన నిధులను సోనూసూద్‌ ఇప్పటికే ఏర్పాటు చేశారట. ప్రస్తుతం ఆ వృద్ధాశ్రమం నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఎవరూ లేని వారి కోసం, వారి బాగోగులు చూసుకోలేని వారి కోసం ఈ వృద్దాశ్రమం పని చేస్తుందని ఆయన ప్రకటించాడు. ఈ రోజుల్లో పది మందిని పోషించాలంటేనే చాలా ఖర్చుతో కూడిన పని. అలాంటిది సోనూసూద్‌ ఏకంగా 500 మంది కోసం వృద్దాశ్రమం ఏర్పాటు చేయాలని అనుకోవడం ఆయన యొక్క గొప్ప మనసుకు నిదర్శనం అనడంలో సందేహం లేదు.

మరిన్ని సినిమాల్లో సోనూ సూద్‌

ఇప్పటికే సోనూసూద్‌ను రియల్‌ హీరో, గ్రేట్‌ హీరో అంటూ అభిమానులు గుండెల్లో పెట్టుకుని మరీ చూసుకుంటున్నారు. అలాంటి అభిమానం సొంతం చేసుకున్న సోనూ సూద్‌ ముందు ముందు మరిన్ని సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆయన హీరోగా నటించాలని కూడా కొందరు ఆశిస్తున్నారు. కరోనా ముందు వరకు ఏడాదికి అయిదు నుంచి పది సినిమాలు చేస్తూ వచ్చిన సోనూసూద్‌ ఇప్పుడు వచ్చిన రియల్‌ హీరో ఇమేజ్ కారణంగా విలన్‌ పాత్రలను పొందలేక పోతున్నాడు. ప్రస్తుతానికి కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఆయన తిరిగి విలన్‌గా వరుస సినిమాలు చేయాలని భావిస్తున్నాడట. అందుకు తగ్గట్టుగా కథలు వింటున్నాడు. అంతే కాకుండా హీరోగా మంచి కథ, దర్శకుడు దొరికితే నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నాడు.