సినిమా నుంచి సోను నిగమ్ పాట తొలగింపు
అభిమాని వర్సెస్ గాయకుడు సోను నిగమ్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. బెంగళూరులోని ఓ లైవ్ కచేరీలో కన్నడ పాటల్ని పాడాల్సిందిగా ఒక అభిమాని సోనూ సూద్ ని అభ్యర్థించాడు.
By: Tupaki Desk | 8 May 2025 4:58 PMఅభిమాని వర్సెస్ గాయకుడు సోను నిగమ్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. బెంగళూరులోని ఓ లైవ్ కచేరీలో కన్నడ పాటల్ని పాడాల్సిందిగా ఒక అభిమాని సోనూ సూద్ ని అభ్యర్థించాడు. కానీ సోనూ సూద్ దానికి దురుసుగా సమాధానమిచ్చారనేది ప్రధాన ఆరోపణ. ``కన్నడ కన్నడ అంటూ ఇలాంటి విభేధాలతోనే పహల్గామ్ దాడి జరిగింది`` అంటూ సోనూ నిగమ్ అభిమానిపై సీరియస్ అయ్యాడు. కారణం ఏదైనా కన్నడ భాషకు అవమానం జరిగిందంటూ అతడిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. సోను నిగమ్ దీనికి వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు పంపారు.
సోను నిగమ్ పై ఆరోపణల నేపథ్యంలో కన్నడ సినీపరిశ్రమ అనధికారిక సహాయనిరాకరణను అమలు చేసింది. అతడికి కన్నడ పరిశ్రమలో అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. తాజాగా ఈనెలలో విడుదల కానున్న కన్నడ చిత్రం `కులదల్లి కీల్యావుడో` నుండి నేపథ్య గాయకుడు సోను నిగమ్ పాటను అధికారికంగా తొలగించారు. బెంగళూరు ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మేకర్స్ ప్రకటించారు. గాయకుడు సోను నిగమ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కర్ణాటక ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పినా కానీ అతడిని విడిచిపెట్టలేదు.
సోను వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందిన `కులదల్లి కీల్యావుడో` నిర్మాతలు అతడి నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పత్రికా ప్రకటనలో వారు ఇలా వ్యాఖ్యానించారు. ``సోను నిగమ్ మంచి గాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇటీవల ఒక కచేరీలో అతను కన్నడ గురించి మాట్లాడిన తీరు మాకు చాలా బాధ కలిగించింది. సోను నిగమ్ కన్నడకు చేసిన అవమానాన్ని మేము సహించలేము, కాబట్టి పాటను తొలగించాము`` అని ప్రకటనలో పేర్కొన్నారు.
మనోమూర్తి స్వరపరిచిన `మన్సౌ హాత్తాడే` అనే పాటను మూడు నెలల క్రితం రికార్డ్ చేయగా, ఏప్రిల్ 5న సోను యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశారు. ఇప్పుడు దీనిని కన్నడ ప్లేబ్యాక్ గాయకుడు చేతన్ గానంతో తిరిగి రికార్డ్ చేయనున్నారు.