అవమానించి బెదిరించారు.. లేఖలో గాయకుడి ఆవేదన
అభిమానులతో ఊహించని ఘర్షణలు అప్పుడప్పుడు సెలబ్రిటీలకు తీవ్రమైన చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.
By: Tupaki Desk | 6 May 2025 9:34 AM ISTఅభిమానులతో ఊహించని ఘర్షణలు అప్పుడప్పుడు సెలబ్రిటీలకు తీవ్రమైన చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. అలాంటి ఒక ఘర్షణ ఇప్పుడు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, రాష్ట్రం నిషేధించడం వరకూ వెళ్లింది. పాపులర్ గాయకుడు సోను నిగమ్ పై కన్నడిగులు గుర్రుగా ఉన్నారు. అతడిపై కన్నడ చిత్రసీమ అనధికారిక నిషేధం అమలు చేసింది. అతడికి పాడేందుకు ఇకపై అవకాశాల్లేకుండా నిలువరించింది. అలాగే కన్నడ పరిరక్షక సంఘాలు అతడిపై సీరియస్ గా కేసులు నమోదు చేస్తుండడం చర్చనీయాంశమైంది. దీనంతటికీ కారణం అభిమానితో తలెత్తిన అనూహ్యమైన గొడవ. ఒక లైవ్ కాన్సెర్టులో తలెత్తిన వివాదం కాస్తా చినికి చినికి గాలివానగా మారి ఇప్పుడు అతడిని నిషేధించేంత వరకూ పరిస్థితి దిగజారిందంటే ఈ వివాదంలో తప్పు ఎవరిదో కనుగొనాలి.
ఇంతకీ సోనునిగమ్ చేసిన తప్పేమిటి? అంటే.. అతడు కన్నడ అభిమానితో దురుసుగా ప్రవర్తించడం, కన్నడ భాషను అవమానించడం అనేది ప్రధాన ఆరోపణ. లైవ్ కాన్సెర్టులో కన్నడ పాట పాడాల్సిందిగా కోరిన అభిమాని కోరికను నిరాకరించడమే గాక, అతడిని పహల్గామ్ లో దాడి చేసిన తీవ్రవాదులతో పోల్చాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన పోలీసులు వారంలోగా వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు జారీ చేయడం సంచలనమైంది. ప్రస్తుతం ఈ కేసును కర్నాటక పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారిస్తున్నారు.
తాజాగా ఈ వివాదంపై స్పందించిన సోను నిగమ్ అభిమానితో జరిగిన వాస్తవ ఘర్షణను వివరించే ప్రయత్నం చేసారు. 51ఏళ్ల వయసు ఉన్న తనను కొడుకు వయసు ఉన్న అభిమాని అవమానించాడని, కొందరితో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడని సోను నిగమ్ పేర్కొన్నారు. అభిమానుల అభ్యర్థనను గౌరవించి కన్నడ పాటల్ని పాడేందుకు అంగీకరించానని, అయితే ఇప్పుడే కార్యక్రమం మొదలైందని వారిని సముదాయించే ప్రయత్నం చేసానని సోను అన్నారు. కానీ ఆ సమయంలో సదరు దురభిమాని తన స్నేహితుల గుంపుతో కలిసి తనను బెదిరించి గొడవ చేయడానికి ప్రయత్నించాడని సోను నిగమ్ ప్రత్యారోపణలు చేసారు.
నేను దేశభక్తుడిని. భాష పేరుతో ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నిస్తే దానిని అంగీకరించను అని సోను అన్నారు. కన్నడ భాష తనకు రెండో భాష అని, భాషను తాను ఎంతో గౌరవించి ప్రేమిస్తానని అన్నారు. ప్రతిసారీ కచేరీలో గంటపాటు కన్నడ పాటల కోసం ప్రిపరేషన్ సాగిస్తానని కూడా అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలు సంస్కృతి సంగీతం, సంగీతకారులను తాను ఎంతగానో గౌరవించి ప్రేమిస్తానని సోను అన్నారు. పోలీసుల విచారణకు తాను అన్నివిధాలా సహకరిస్తానని, వారి నిబంధనల మేరకు అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రస్తుతం సోను సుదీర్ఘ నోట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.