త్రీ ఇడియట్స్ స్ఫూర్తిపై ఆమిర్ ఖాన్ క్లారిటీ
మోడీ ప్రభుత్వం నియంత తీరుతో వ్యవహరిస్తోందని సోషల్ మీడియా వేదికగా వాంగ్ చుక్ మద్దతుదారులు ఎండగడుతున్నారు. వాంగ్ చుక్ కు మద్దతు గా కొంత మంది బాలీవుడ్ స్టార్లు కూడా నిలిచారు.
By: Srikanth Kontham | 17 July 2026 3:43 PM ISTనీట్ పరీక్ష లీకేజ్ వ్యతిరేకంగా ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సోనమ్ దీక్షకు దిగి 20 రోజులవుతుంది. రోజు రోజు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. అయినా కేంద్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది. ఈ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యకమవుతున్నాయి. మోడీ ప్రభుత్వం నియంత తీరుతో వ్యవహరిస్తోందని సోషల్ మీడియా వేదికగా వాంగ్ చుక్ మద్దతుదారులు ఎండగడుతున్నారు. వాంగ్ చుక్ కు మద్దతు గా కొంత మంది బాలీవుడ్ స్టార్లు కూడా నిలిచారు.
ఈ నేపథ్యంలో సూపర్ హిట్ చిత్రం 'త్రీ ఇడియట్స్' లోని ఫుంగ్‌సుక్ వాంగ్‌డూ పాత్ర సోనమ్ వాంగ్‌చుక్ స్ఫూర్తితోనే రూపొందిందన్న ప్రచారానికి బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్ తెరదించారు. తన పాత్రకు వాంగ్‌చుక్ జీవితానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేశారు.
'త్రీ ఇడియట్స్' చిత్రం అప్పట్లో విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ సంచలనం సృష్టించింది. ఆ చిత్రంలోని హీరో పాత్ర ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అయితే సోనమ్ వాంగ్‌చుక్ సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆమిర్ ఖాన్‌కు ఎంతో గౌరవం ఉందని.. కానీ సినిమా పరంగా ఈ పాత్రను ఎవరినీ ఉద్దేశించి సృష్టించలేదని వెల్లడించారు. అలాగే సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తుండటం పట్ల ఆమిర్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
ఒక సామాజిక కార్యకర్తగా వాంగ్ చుక్ పడుతోన్న తపనను అర్థం చేసుకోగలమని కానీ ఆయన ఆరోగ్యమే తమకు ప్రాధాన్యమని ఆమిర్ పేర్కొన్నారు. వాంగ్‌చుక్ చేస్తున్న నిరసన వెనుక ఉన్న డిమాండ్లను సానుకూల దృక్పథంతో చూడాలని పలువురు కోరుతున్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం ఆయన చేస్తున్న పోరాటం, నీట్ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఈ నిరసన రోజురోజుకూ బలపడుతోంది.
వైద్యుల సూచనల మేరకు సోనమ్ వాంగ్‌చుక్ నిరంతరం పర్యవేక్షణలో ఉన్నారు. బరువు తగ్గడం, బలహీనత వంటి సమస్యలు వేధిస్తున్నప్పటికీ తన పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం తన డిమాండ్ల పట్ల స్పందించి చర్చలు జరపాలని కోరుతున్నారు. వాంగ్ చుక్ దీక్షను విరమించుకోవాలని ఎంతో మంది శ్రేయోభి లాషులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల ఆవేదన ..నిరసనలను ప్రభుత్వం ఏ విధంగా స్వీకరి స్తుంది? సమాజంలో మార్పు రావాలంటే నిరసనలే మార్గమా లేక చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందా? అన్నది ఆలోచించాల్సిన విషయం. సోనమ్ వాంగ్‌చుక్ వంటి వ్యక్తులు ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్న పోరాటం వ్యవస్థలో మౌలిక మార్పులకు దారి తీస్తుందా? లేదా? అన్నది చూడాలి.
