పాప్ కల్చర్‌లో పాపులరైతే ఛాన్సులే ఛాన్సులు
ఇకపోతే ఇటీవలి కాలంలో పంజాబీ పాప్ కల్చర్ లో పాపులరై, అక్కడ సినిమాల్లో నటించిన సోనమ్ బజ్వా నెమ్మదిగా బాలీవుడ్ లో పాపులరవుతోంది.
By: Tupaki Desk | 15 Jun 2025 8:15 AM ISTగ్లామర్ పరిశ్రమలో అవకాశాలు ఎలా వస్తాయో? అదృష్టం ఎవరిని ఎలా తలుపు తడుతుందో ముందే ఊహించలేం. అందం, ప్రతిభ ఉన్నా చాలా మందికి అవకాశాలు రావు. ఆ రెండిటితో పాటు, ప్రచారంలో దూసుకుపోయే వారికి చాన్సులు రావొచ్చు. ముఖ్యంగా పంజాబీ పాప్ కల్చర్ లో భాగంగా ఉండే నటీమణులకు బాలీవుడ్ ఎప్పుడూ రెడ్ కార్పెట్ వేస్తుంది. కథానాయికలుగా అవకాశం కోసం కలలు కనే చాలా మంది యూత్ పంజాబీ పాప్ పాటలతో పాపులరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కేవలం పంజాబ్ కే వర్తించదు. హైదరాబాద్ పరిశ్రమలోను పలు సింగిల్ ఆల్బమ్స్ లో నటించి టాలీవుడ్ లో అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నించిన వారు లేకపోలేదు.
ఇకపోతే ఇటీవలి కాలంలో పంజాబీ పాప్ కల్చర్ లో పాపులరై, అక్కడ సినిమాల్లో నటించిన సోనమ్ బజ్వా నెమ్మదిగా బాలీవుడ్ లో పాపులరవుతోంది. ఈ భామ ఇప్పుడు బార్డర్ 2 లాంటి క్రేజీ చిత్రంలో నటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. దిల్జీత్ సరసన సోనమ్ నటించనుంది. ఈ నెలాఖరు నాటికి సోనమ్ తన సన్నివేశాలను పూర్తి చేస్తుందని సమాచారం. సోనమ్ బజ్వా పాత్ర పంజాబీ అమ్మాయిగానే ఉంటుందని కూడా తెలిసింది. వార్ డ్రామా ఒకవైపు, ప్రేమ జంటపై సన్నివేశాలు మరోవైపు రక్తి కట్టిస్తాయని కూడా చెబుతున్నారు.
సన్నీడియోల్ లాంటి సీనియర్ తో పాటు ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు. అతడి సరసన మరో పాపులర్ నటిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రం చివరి షెడ్యూల్ జూన్- ఆగస్టులో సాగనుండగా ప్రధాన తారాగణం అటెండవుతారు. సోనమ్ బజ్వా ఇటీవల భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. అక్షయ్ సహా పలువురు అగ్ర తారలు నటించిన `హౌస్ ఫుల్ 5`లోను సోనమ్ బజ్వా నటించింది. తదుపరి బోర్డర్ 2, భాఘి 4లోను కనిపించనుంది. దీవానియాత్ అనే చిత్రంలోను సోనమ్ బజ్వా నటిస్తుంది.
