సోనాలి బింద్రే రీఎంట్రీ.. క్రైమ్ డ్రామా ట్రైలర్ ఎలా ఉందంటే?
నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు రానున్న వెబ్ సిరీస్ రాఖ్.
By: M Prashanth | 1 Jun 2026 11:08 PM ISTనిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు రానున్న వెబ్ సిరీస్ రాఖ్. అలీ ఫజల్, సోనాలి బింద్రే, అమీర్ బషీర్ లీడ్ రోల్స్ లో నటించిన ఆ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. 1970ల నాటి ఢిల్లీ నేపథ్యంలో సాగే ఆ కథ.. ఒకప్పుడు కుదిపేసిన రంగా-బిల్లా కేసు నేపథ్యంలో సాగింది.
ట్రైలర్ ప్రారంభం నుంచే మిస్టరీ, టెన్షన్ తో నిండిపోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు టీనేజ్ పిల్లలు కనిపించకుండా పోవడంతో కథ మొదలవుతుంది. మొదట సాధారణ మిస్సింగ్ కేసులా కనిపించిన ఆ ఘటన.. మెల్లగా భయంకరమైన ట్విస్టులు తిరుగుతుంది. పిల్లల కోసం ఆందోళన చెందుతున్న కుటుంబాల బాధ, పోలీసులపై పెరుగుతున్న ఒత్తిడి, కేసు వెనుక దాగి ఉన్న యాంగిల్స్ ను ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా చూపించింది.
ఆ కేసును ఛేదించే బాధ్యతను సబ్ ఇన్ స్పెక్టర్ జయప్రకాష్ జాటవ్ పాత్రలో కనిపించిన అలీ ఫజల్ భుజాన వేసుకుంటారు. ఆయన పోషించిన పాత్ర సాధారణ పోలీస్ ఆఫీసర్ లా కాకుండా లోపాలు, వ్యక్తిగత సమస్యలతో కూడిన వ్యక్తిగా కనిపిస్తోంది. ఒకవైపు కేసు వెనుక ఉన్న క్రిమినల్స్ ను వెంబడిస్తూ, మరోవైపు తనలోని సంఘర్షణలతో పోరాడే పాత్రగా ట్రైలర్ లో ఆయన ప్రెజెన్స్ ఆకట్టుకుంది.
ఇక చాలా కాలం తర్వాత సోనాలి బింద్రే కీలక పాత్రలో కనిపించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మోనా అరోరా అనే పాత్రలో ఆమె ఎమోషన్స్ ను స్ట్రాంగ్ గా చూపించినట్లు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. అలాగే అమీర్ బషీర్ పోషించిన లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ అరోరా పాత్ర కథలో మెయిన్ అసెట్ గా కనిపిస్తోంది. తన పిల్లల్ని కోల్పోయిన తండ్రి వేదనను ఆయన పాత్ర ద్వారా చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ట్రైలర్ లో కిడ్నాప్, హత్యల మిస్టరీ మాత్రమే కాకుండా, బాధిత కుటుంబాల మానసిక వేదన, న్యాయం కోసం జరిగే పోరాటం, సమాజంలోని డార్క్ యాంగిల్స్ ను చూపించారు. దీంతో సినిమా కేవలం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథగా కాకుండా ఎమోషన్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చిన థ్రిల్లర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిరీస్ కు ప్రసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. కథను అనూష నందకుమార్, సందీప్ సాకేత్ అందించగా.. రాకేష్ బేది, దివ్యేందు భట్టాచార్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కనిపించింది. ముఖ్యంగా సోనాలి బింద్రే రీఎంట్రీపై అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలీ ఫజల్ ఇంటెన్స్ రోల్ లో కనిపించడంపై కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఏదేమైనా రంగా- బిల్లా కేసు నేపథ్యంలో రూపొందిన రాఖ్ మూవీ ట్రైలర్ ఆసక్తి రేకెత్తించేలా ఉంది. థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్, ఎమోషనల్ డ్రామా, క్యాస్టింగ్ యాక్టింగ్.. మెయిన్ అట్రాక్షన్లుగా కనిపిస్తున్నాయి. జూన్ 12 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న ఆ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
