Begin typing your search above and press return to search.

'మర్యాద రామన్న' సీక్వెల్‌ ట్రైలర్‌ చూశారా..!

సీక్వెల్‌ లోనూ అజయ్‌ దేవగన్ హీరోగా నటించగా, హీరోయిన్‌ పాత్రను మాత్రం మృణాల్‌ ఠాకూల్‌ పోషించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

By:  Tupaki Desk   |   11 July 2025 4:31 PM IST
మర్యాద రామన్న సీక్వెల్‌ ట్రైలర్‌ చూశారా..!
X

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో 'మర్యాద రామన్న' చాలా విభిన్నంగా ఉంటుంది. అన్ని సినిమాలను స్టార్స్‌తో తీస్తే మర్యాద రామన్న సినిమాను ఒక కామెడీ హీరోతో తీశాడు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సినిమాలను తీసిన రాజమౌళి 'మర్యాద రామన్న' తీశాడు అంటే కాస్త అతిశయోక్తి అన్నట్లుగా ఉంటుంది. ఒక ప్రయోగాత్మక మూవీగా ఆ సినిమాను తీసిన రాజమౌళి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సునీల్‌ హీరోగా నటించగా సలోని హీరోయిన్‌గా నటించింది. ఒక విభిన్నమైన కామెడీ కాన్సెప్ట్‌ను తీసుకుని, ప్రేక్షకుల అభిరుచికి చాలా సింపుల్‌గా, తక్కువ బడ్జెట్‌తో రూపొందించి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

మర్యాద రామన్న సినిమాను హిందీలో 'సన్నాఫ్‌ సర్ధార్‌' అనే టైటిల్‌తో తీశారు. అజయ్‌ దేవగన్‌ నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దశాబ్ద కాలం తర్వాత ఆ సినిమా గురించి మళ్లీ చర్చ మొదలైంది. సాధారణంగా ఒరిజినల్‌ మూవీస్‌కి సీక్వెల్‌ వస్తే, రీమేక్‌లకు కూడా సీక్వెల్‌ చేస్తూ ఉంటారు. కానీ రాజమౌళికి మర్యాద రామన్న సినిమాకు సీక్వెల్‌ చేసే ఆసక్తి లేదు, ప్రస్తుత మార్కెట్‌లో అది సాధ్యం కాదు. కానీ హిందీ రీమేక్ సన్నాఫ్‌ సర్దార్‌ సినిమాకు సీక్వెల్‌ రూపొందింది. సీక్వెల్‌ లోనూ అజయ్‌ దేవగన్ హీరోగా నటించగా, హీరోయిన్‌ పాత్రను మాత్రం మృణాల్‌ ఠాకూల్‌ పోషించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

సన్నాఫ్ సర్దార్‌ 2 మూవీని ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా విడుదలకు రెండు వారాల ముందుగానే విడుదలైన ఈ ట్రైలర్‌కి మంచి స్పందన దక్కింది. మొదటి పార్ట్‌కి ఏమాత్రం తగ్గకుండా రెండో పార్ట్‌ కామెడీ ఉంటుందని తెలుస్తోంది. తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అజయ్‌ దేవగన్‌ తో పాటు ఈ సినిమాలో రవి కిషన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సర్దార్‌లపై కామెడీ అంటూ కొందరు విమర్శలు చేసినా వారి గౌరవం పెంచే విధంగా ఈ సినిమా ఉంటుంది అంటూ కొందరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మర్యాద రామన్నకు సీక్వెల్‌ రాకున్నా, దాని రీమేక్‌కు సీక్వెల్‌ వస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది.

హిందీలో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ఖచ్చితంగా తెలుగులో రీమేక్‌ చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ వినిపిస్తుంది. ఒక వేళ తెలుగు లో రీమేక్ సాధ్యం కాకుంటే డబ్‌ చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. సునీల్‌ ఈ సినిమాను మరో దర్శకుడితో అయినా రీమేక్‌ చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు. మర్యాద రామన్న సినిమా సునీల్‌ కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. కనుక సన్నాఫ్‌ సర్ధార్‌ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే తెలుగులో రీమేక్ చేయాలని చాలా మంది కోరుతున్నారు. అందుకు రాజమౌళి నుంచి, సునీల్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రీమేక్ అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.