Begin typing your search above and press return to search.

హిట్‌ సీక్వెల్‌ అన్నారు... ఇదెక్కడి విడ్డూరం!

రాజమౌళి దర్శకత్వంలో సునీల్‌ హీరోగా వచ్చిన 'మర్యాద రామన్న' సినిమాకు రీమేక్‌గా బాలీవుడ్‌లో రూపొందిన చిత్రం 'సన్నాఫ్‌ సర్ధార్‌'.

By:  Tupaki Desk   |   16 July 2025 4:00 PM IST
హిట్‌ సీక్వెల్‌ అన్నారు... ఇదెక్కడి విడ్డూరం!
X

రాజమౌళి దర్శకత్వంలో సునీల్‌ హీరోగా వచ్చిన 'మర్యాద రామన్న' సినిమాకు రీమేక్‌గా బాలీవుడ్‌లో రూపొందిన చిత్రం 'సన్నాఫ్‌ సర్ధార్‌'. అజయ్ దేవగన్‌ హీరోగా సంజయ్ దత్‌, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రల్లో నటించిన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 2012లో వచ్చిన సన్నాఫ్ సర్ధార్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తీసుకు వచ్చేందుకు ప్లాన్‌ చేశారు. ఒరిజినల్‌ మర్యాద రామన్న సినిమాకి సీక్వెల్‌ చేయాలనే ఆలోచన రాజమౌళికి లేదు. కానీ సన్నాఫ్ సర్దార్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అజయ్ ఆసక్తి మేరకు సన్నాఫ్ సర్ధార్‌ 2 సినిమా పట్టాలెక్కింది, విడుదలకు రెడీ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

సన్నాఫ్‌ సర్దార్‌ 2 సినిమా ప్రకటించిన సమయంలో అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా అజయ్‌ దేవగన్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాను చేస్తేనే జనాలు చూస్తారని అంతా భావించారు. సన్నాఫ్ సర్ధార్‌ సినిమాకు పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. సినిమా ప్రకటన సమయంలో ఉన్న ఆసక్తి విడుదల సమయం వరకు తగ్గుతూ వచ్చింది. అందుకు కారణం సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఆసక్తిగా లేకపోవడం. ఈ మధ్య కాలంలో సినిమాలను ట్రైలర్‌, పాటలను చూసిన తర్వాత చూడాలా.. వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ట్రైలర్‌ కట్‌ సరిగా లేకుంటే మొత్తం సినిమాపై ప్రభావం పడుతుంది.

ఆ మధ్య వార్‌ 2 సినిమా టీజర్‌ నెగటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో ఏ స్థాయిలో డ్యామేజ్‌ జరిగిందో అందరికీ తెలిసిందే. అయినా కూడా సన్నాఫ్‌ సర్ధార్‌ టీం జాగ్రత్త పడలేదు. నాసిరకంగా ట్రైలర్‌ను కట్‌ చేశారు, అంతే కాకుండా పాటలతోనూ ఆకట్టుకోలేక పోయారు. పాటలు విడుదల చేయకున్నా బాగుండేదని ఇప్పుడు కొందరు అంటున్నారు. సినిమా ప్రమోషన్‌ విషయంలో మేకర్స్‌ ఏమాత్రం జాగ్రత్తలు పాటించడం లేదు. ఇప్పటి వరకు సినిమాపై ఆసక్తి కలిగించే విధంగా టీజర్‌ కానీ, ట్రైలర్‌ కానీ, పాటలు కానీ రాలేదు. అందుకే ఈ సినిమా హిట్‌ సీక్వెల్‌ అనే పాజిటివ్‌ బజ్ నుంచి ప్రమోషనల్‌ స్టఫ్‌ ఒక్కటి కూడా ఆకట్టుకోక పోవడంతో ఆసక్తి తగ్గుతూ వచ్చింది.

మృణాల్‌ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో హిట్‌ కోసం చాలా కాలంగా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తుంది. పదేళ్ల ఎదురు చూపులకు ఈ సినిమా తెర దించుతుందని, తప్పకుండా ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఆమె ఆశ పెట్టుకుంది. కానీ సినిమా ప్రమోషనల్‌ స్టఫ్‌ ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడంతో.. సినిమా అసలు ఆడేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిట్‌ మూవీ సీక్వెల్‌ అనే పాజిటివ్‌ బజ్ ఉన్నది కాస్త పోగొట్టారు.

ఇప్పుడు సినిమా విడుదలై పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుంటే తప్ప జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. ప్రమోషన్‌ సరిగ్గా లేకపోవడంతో ఖచ్చితంగా ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ పై పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. అజయ్ దేవగన్‌, మృణాల్‌ ఠాకూర్‌లకు తీవ్ర నిరాశే మిగులుతుందేమో అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.