అది మనసులో పెట్టుకునే జ్యోతికను టార్గెట్ చేస్తున్నారా?
ఓటీటీ వేదికగా రిలీజైన సిస్టమ్ వెబ్ సిరీస్ ప్రస్తుతం కథ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ చిన్న క్లిప్ కారణంగా చర్చనీయాంశమైంది.
By: Sravani Lakshmi Srungarapu | 23 May 2026 11:53 PM ISTఓటీటీ వేదికగా రిలీజైన సిస్టమ్ వెబ్ సిరీస్ ప్రస్తుతం కథ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ చిన్న క్లిప్ కారణంగా చర్చనీయాంశమైంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన జ్యోతికపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. అయితే వైరలవుతున్న వీడియోను పూర్తిగా పరిశీలిస్తే, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నంత బోల్డ్ లేదా వల్గర్ కంటెంట్ అందులో కనిపించదు. కేవలం 15 సెకన్ల నిడివి ఉన్న ఆ చిన్న క్లిప్ లో జ్యోతిక తన పాత్రకు సంబంధించిన ఓ పర్సనల్ మూమెంట్ లో కనిపిస్తుందంతే. కానీ అదే క్లిప్‌ను కట్ చేసి, దానికి సెన్సేషనల్ థంబ్‌నైల్స్, తప్పుదారి పట్టించే క్యాప్షన్లతో వైరల్ చేస్తూ అసలు సందర్భాన్ని పూర్తిగా మార్చేశారు.
సిస్టమ్ సిరీస్ లో జ్యోతిక సారిక రావత్ అనే లాయర్ పాత్రలో నటించారు. పెళ్లైన వ్యక్తితో రిలేషన్‌లో ఉండే మహిళగా ఈ సిరీస్ లో ఆమె పాత్రను డిజైన్ చేశారు. కథలో భాగంగా వచ్చే ఓ సీన్ ను పట్టుకుని వామ్మో జ్యోతిక బోల్డ్ సీన్, ఇద్దరు పిల్లల తల్లి ఇలా చేస్తుందా? వంటి కామెంట్లతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆ సీన్ చూస్తే అది పాత్ర డిమాండ్‌కు సంబంధించిన సీన్ మాత్రమే. కానీ చాలామంది పాత్రను, నటిని వేరు చేయకుండా పర్సనల్‌గా జ్యోతికను టార్గెట్ చేస్తున్నారు. ఒక నటుడు విలన్ పాత్ర చేస్తే నిజజీవితంలో విలన్ కాదన్న అవగాహన ప్రేక్షకుల్లో ఉంటుంది. కానీ నటీమణుల విషయంలో మాత్రం ఇంకా అదే పరిపక్వత కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ఈ ట్రోలింగ్ అంతా కేవలం ఆ సీన్ కారణంగానే జరుగుతోందా? లేక గతంలో జరిగిన కొన్ని సంఘటనల ప్రతిఫలమా? అనే చర్చ కూడా మొదలైంది. ముఖ్యంగా కంగువా సినిమా టైమ్ లో ట్రోలర్స్‌పై జ్యోతిక ఓపెన్‌గా రియాక్ట్ అవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. సోషల్ మీడియాలో మహిళలపై జరిగే వ్యక్తిగత దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇప్పుడదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ, ఛాన్స్ దొరికింది కదా అన్నట్టుగా కొందరు నెటిజన్లు ఆమెను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.
మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. సిరీస్ లో ఆ సీన్ ను మించి ట్రోలింగ్‌లో ఉపయోగిస్తున్న భాష మరింత వల్గర్‌గా మారడం. మీమ్స్, కామెంట్స్, యూట్యూబ్ థంబ్‌నైల్స్‌లో జ్యోతికను అవమానించే విధంగా కంటెంట్ తయారు చేస్తున్నారు. అసలు సీన్ లో లేని అంశాలను కూడా ఊహించి ప్రచారం చేయడం మరింత ప్రమాదకరం. ఒక మంచి నటి చేసిన పాత్రను విశ్లేషించకుండా, కేవలం 15 సెకన్ల క్లిప్ ఆధారంగా తీర్పులు ఇవ్వడం సోషల్ మీడియా మైండ్‌సెట్‌ను ప్రశ్నించేలా మారింది. వాస్తవానికి సిస్టమ్ లో జ్యోతిక నటనకు మంచి ప్రశంసలే వస్తున్నాయి. న్యాయ వ్యవస్థలోని లొసుగులపై రూపొందిన ఈ కథలో ఆమె పాత్రకు బలమైన ప్రాధాన్యం ఉంది. కానీ ప్రస్తుతం చర్చంతా ఆమె నటన గురించి కాకుండా ఆ వైరల్ క్లిప్ గురించి జరగడం బాధాకరం.
