Begin typing your search above and press return to search.

'చీకటిలో' మూవీ రివ్యూ

బాలీవుడ్లో పేరున్న సినిమాలు- వెబ్ సిరీస్ లు చేసిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ.. పెళ్లి తర్వాత కొంత కాలం నటనకు దూరంగా ఉంది.

By:  Tupaki Desk   |   23 Jan 2026 3:05 PM IST
చీకటిలో మూవీ రివ్యూ
X

నటీనటులు: శోభిత ధూళిపాళ్ళ- విశ్వదేవ్ రాచకొండ- అదితి మ్యాకల్- కృష్ణచైతన్య- వడ్లమాని శ్రీనివాస్- ఈషా చావ్లా- ఆమని- సురేష్- రవీంద్ర విజయ్- ఝాన్సీ- శ్రీలక్ష్మి తదితరులు

సంగీతం: శ్రీ చరణ్ పాకాల

ఛాయాగ్రహణం: మల్లికార్జున్

నిర్మాత: సురేష్ బాబు

కథ-స్క్రీన్ ప్లే-మాటలు: చంద్ర పెమ్మరాజు

దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి

బాలీవుడ్లో పేరున్న సినిమాలు- వెబ్ సిరీస్ లు చేసిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ.. పెళ్లి తర్వాత కొంత కాలం నటనకు దూరంగా ఉంది. ఆమె ఇప్పుడు ‘చీకటిలో’ చిత్రంతో తిరిగి సినిమాల్లోకి పునరామగనం చేసింది. ఇది అమేజాన్ ప్రైమ్ కోసం శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సీనియర్ నిర్మాత సురేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన చిత్రం. ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: సంధ్య నెల్లూరి (శోభిత ధూళిపాళ్ళ) ఒక టీవీ ఛానెల్లో క్రైమ్ ప్రోగాం నడిపే యాంకర్. కానీ తన అభిరుచికి భిన్నంగా న్యూస్ ప్రెజెంట్ చేయడం ఇష్టం లేక ఆ ప్రోగ్రాం నుంచి తప్పుకొని.. పాడ్ కాస్ట్ మొదలుపెట్టాలని అనుకుంటుంది. ఆ పాడ్ కాస్ట్ మొదలుపెట్టడానికి సంధ్యను ఉత్సాహపరిచిన బాబీ (అదితి మ్యాకల్)తో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ తమ ఫ్లాట్లో దారుణ రీతిలో హత్యకు గురవుతారు. ఈ బాధను దిగమింగుకుని ‘చీకటిలో’ పేరుతో పాడ్ కాస్ట్ మొదలుపెట్టిన సంధ్య.. తన స్నేహితురాలి మరణం వెనుక మిస్టరీని ఛేదించడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఆ అపార్ట్మెంట్ వాచ్ మ్యానే ఈ హత్యలు చేసినట్లు సంధ్య ద్వారా పోలీసులు ఒక నిర్ధారణకు వస్తారు. వాచ్ మ్యాన్ అరెస్టుతో సమస్య పరిష్కారమైందని అంతా అనుకుంటారు. కానీ అసలు హంతకుడు వేరే అని తర్వాత వెల్లడవుతుంది. మరో జంట ఇలాగే హత్యకు గురవుతుంది. ఇంతకీ ఈ హత్యలు చేస్తున్నదెవరు.. తన గతమేంటి.. ఈ మిస్టరీని పోలీసుల సాయంతో సంధ్య ఎలా ఛేదించింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ఓటీటీ విప్లవం పుణ్యమా అని.. కొన్నేళ్లనుంచి వివిధ భాషలకు చెందిన అద్భుతమైన థ్రిల్లర్లను చూసే అవకాశం లభిస్తోంది ప్రేక్షకులకు. ప్రాంతీయ భాషా చిత్రాల నుంచి అంతర్జాతీయ సినిమాల వరకు ఉత్కంఠతో ఊపేసే సినిమాలు.. వెబ్ సిరీసులు చూశాక ఆషామాషీ కథాకథనాలతో ప్రేక్షకులను సంతృప్తి పరచడం కష్టమైపోయింది. ప్రతి క్షణం ఉత్కంఠతో ఊపేసేలా సన్నివేశాలు ఉండాలి. స్క్రీన్ ప్లే వాట్ నెక్స్ట్ అని ప్రేక్షకులను గెస్సింగ్ లో ఉంచేలా సాగాలి. బ్యాక్ స్టోరీ క్రేజీగా అనిపించాలి. సీరియల్ కిల్లింగ్స్ నేపథ్యంలో సాగే ‘చీకటిలో’ చిత్రంలో హంతకుడి తాలూకు నేపథ్యం హైలైట్ గా నిలుస్తుంది. ఒక మామూలు వ్యక్తి కిరాతకంగా హత్యలు చేసేలా మారడానికి దారితీసే కారణాన్ని బాగా చూపించారిందులో. చిత్రమైన ప్యాటర్న్ లో రెండు హత్యలు చేసి.. అదే తరహాలో హత్యలు చేయడాన్ని ఒక అబ్సెషన్ గా మార్చుకున్న కిల్లర్ వ్యవహారం క్రేజీగా అనిపిస్తుంది. కానీ చివర్లో వచ్చే ఈ ట్రాక్ ఉన్నంత ఆసక్తికరంగా.. ఉత్కంఠభరితంగా మిగతా సినిమా కూడా ఉండుంటే ‘చీకటిలో’ ప్రత్యేకమైన సినిమాగా నిలిచేది. కానీ అవి మిస్ అవడంతో ‘చీకటిలో’ అంచనాలకు చాలా దూరంలో నిలిచిపోయింది.

‘చీకటిలో’ కథను బాగానే మొదలుపెట్టినా.. ఆ టెంపోను కొనసాగించడంలో టీం ఫెయిలైంది. హత్యలు చేసింది ఒకరైతే.. ఇంకొకరు అందులో ఇరుక్కోవడం.. ఆ తర్వాత అసలు హంతకుడు వేరే అని తేలడం.. ఇలా లైన్ ఆసక్తికరంగా అనిపించినా.. తెర మీద ఎగ్జిక్యూట్ చేసిన తీరు ఆసక్తి రేకెత్తించదు. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేగేలా సన్నివేశాలను ప్రెజెంట్ చేయలేకపోయారు. థ్రిల్లర్ సినిమాల్లో ఉత్కంఠ రేగాలంటే.. ఒక సన్నివేశానికి ఇంకో సన్నివేశం లింక్ అయ్యేలా కథనం ఆసక్తికరంగా సాగాలి. చిక్కుముడిని బిగించడంలో.. తర్వాత దాన్ని విప్పడంలో ఎంతో నేర్పు కనిపిస్తేనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. కానీ ప్రేక్షకుల్లో ఆ రకంగా ఉత్కంఠ పెంచేలా ఇందులో కథనం సాగదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదో నామమాత్రంగా నడుస్తుంటే.. హీరోయిన్ సింపుల్ గా అన్ని విషయాలనూ బయటపెట్టేస్తుంటుంది. తన పాడ్ కాస్ట్ కూడా ఊరికే అలా వైరల్ అయిపోయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటుంది. హీరోయిన్ కనిపెట్టే విషయాలు కూడా ఏమంత ఉత్కంఠభరితంగా అనిపించవు.

ఒక దశ దాటాక సీరియల్ కిల్లర్.. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వ్యవహారమంతా పక్కకు వెళ్లిపోయే అవసరం లేని సీన్లతో ‘చీకటిలో’ బాగా బోర్ కొట్టించేస్తుంది. కథతో సంబందం లేని ట్రాక్స్ సినిమా ఫ్లోను పూర్తిగా దెబ్బ తీస్తాయి. ఐతే కిల్లర్ ఎవరు అని వెల్లడించే నేపథ్యంలో చివరి 20 నిమిషాలు మాత్రం ఉత్కంఠ రేకెత్తించేలా సాగుతాయి. విలన్ బ్యాక్ స్టోరీ సినిమాలో మేజర్ హైలైట్ గా చెప్పొచ్చు. కానీ ఆ ఎపిసోడ్ మీద పెట్టిన శ్రద్ధ.. మిగతా కథ-కథనం మీద కూడా పెట్టి ఉంటే బాగుండేది. థ్రిల్లర్ కథలకు రేసీ స్క్రీన్ ప్లేను జోడించకపోతే.. నిడివి తక్కువ ఉన్నప్పటికీ లెంగ్తీగా అనిపిస్తాయి. ‘చీకటిలో’ ఆ కోవకే చెందుతుంది. ఇది ఓటీటీ సినిమా కాబట్టి.. విలన్ బ్యాక్ స్టోరీ.. కొన్ని సన్నివేశాలు.. శోభిత పెర్ఫామెన్స్ కోసమైతే ఒక లుక్కేయొచ్చు.

నటీనటులు: బాలీవుడ్లో మంచి పెర్ఫామర్ గా గుర్తింపు తెచ్చుకున్న శోభిత ధూళిపాళ్ళ తెలుగులో చేసిన తొలి ఫుల్ లెంగ్త్ మూవీ ఇది. కథంతా తన చుట్టూనే తిరిగే సినిమాలో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. అమ్మాయి కావడం వల్ల అనేక ఆంక్షలతో పెరిగి.. అనేక సందర్భాల్లో నోరు కట్టేసుకుని.. తన వాయిస్ బలంగా వినిపించే అవకాశం వచ్చినపుడు విజృంభించే పాత్రకు శోభిత న్యాయం చేసింది. పాత్రకు తగ్గట్లు సింపుల్ లుక్స్.. సటిల్ యాక్టింగ్ తో శోభిత మెప్పించింది. ఆమెకు జోడీగా నటించిన విశ్వదేవ్ రాచకొండ జస్ట్ ఓకే అనిపించాడు. కృష్ణచైతన్య పోలీస్ పాత్రకు న్యాయం చేశాడు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన సీనయిర్ నటుడు సురేష్.. ఈషా చావ్లాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా ఏమీ లేదు. వాళ్ల పాత్రలు అంతగా ఇంపాక్ట్ వేయలేకపోయాయి. రవీంద్ర విజయ్ క్యారెక్టర్ కూడా అంతే. వడ్లమాని శ్రీనివాస్ బాగా చేశాడు. ఆమని.. ఝాన్సీ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘చీకటిలో’ మెప్పిస్తుంది. థ్రిల్లర్ సినిమాలకు బీజీఎం ఇవ్వడంలో తన ప్రత్యేకతను శ్రీ చరణ్ పాకాల మరోసారి చూపించాడు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్లో ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. మల్లికార్జున్ ఛాయాగ్రహణం బాగుంది. థ్రిల్లర్ సినిమాల శైలికి నప్పే థీమ్ తో సాగుతాయి విజువల్స్. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ చంద్ర పెమ్మసాని ఎంచుకున్న కథ బాగున్నా.. స్క్రీన్ ప్లే అనుకున్నంత ఉత్కంఠభరితంగా లేదు. దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి టేకింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. పొటెన్షియాలిటీ ఉన్న థ్రిల్లర్ కథనే తీసుకున్నప్పటికీ.. దాన్ని థ్రిల్లింగ్ గా తెరపై ప్రెజెంట్ చేయలేకపోయారు.

చివరగా: చీకటిలో.. కొన్ని థ్రిల్స్ కోసం