Begin typing your search above and press return to search.

ఆనందంతోనే అందం.. అక్కినేని కోడ‌లు కొత్త బ్యూటీ టిప్స్

అక్కినేని కొత్త కోడ‌లు, హీరో నాగ చైత‌న్య భార్య శోభిత ధూళిపాళ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   3 April 2025 2:08 PM IST
ఆనందంతోనే అందం.. అక్కినేని కోడ‌లు కొత్త బ్యూటీ టిప్స్
X

అక్కినేని కొత్త కోడ‌లు, హీరో నాగ చైత‌న్య భార్య శోభిత ధూళిపాళ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్పుడు అంద‌రూ మేక‌ప్ త‌ప్ప‌నిస‌రిగా వాడుతుంటారు. కొంత‌మంది సౌంద‌ర్య సాధ‌నాల కోస‌మే ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు పెడ‌తారు. అయితే శోభిత మాత్రం త‌న‌కు ట్రెడిష‌న‌ల్ సౌంద‌ర్య ఉత్ప‌త్తులే ఇష్ట‌మని, అవే త‌నను మ‌రింత అందంగా ఉంచుతాయ‌ని అంటోంది.

రీసెంట్ గా వోగ్ బ్యూటీ స్కోప్ తో మాట్లాడిన శోభిత త‌న బ్యూటీ సీక్రెట్స్, త‌న చ‌ర్మ సంరక్ష‌ణ‌కు తీసుకునే జాగ్ర‌త్త‌ల గురించి మాట్లాడింది. ఈ సంద‌ర్భంగా శోభిత అందంగా క‌నిపించాలంటే ముందు మ‌న‌సు ఆనందంగా ఉండాల‌ని, అప్పుడే ముఖం మ‌రింత అందంగా క‌నిపిస్తుంద‌ని, ఆత్మ విశ్వాసం కూడా మ‌నల్ని అందంగా చూపిస్తుంద‌ని అస‌లైన అందం లోప‌ల నుంచే వ‌స్తుంద‌ని శోభిత చెప్తోంది.

తాను త‌న చ‌ర్మ సంర‌క్ష‌ణ కోసం బ్యూటీ ప్రొడ‌క్ట్స్ పై ఆధార‌ప‌డ‌న‌ని, సాధారణంగా ఇంట్లో ఉండే వ‌స్తువుల‌తోనే చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాన‌ని శోభిత అంటోంది. త‌న చ‌ర్మం ఒక్కోసారి నార్మ‌ల్ గా, మ‌రోసారి పొడిబారుతూ ఉంటుంద‌ని దాని వ‌ల్ల త‌న పెద‌వులు వాతావ‌ర‌ణంతో సంబంధం లేకుండా పొడి బారుతుంటాయ‌ని చెప్పింది. మొద‌ట్లో ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి ఎన్నో ర‌కాల లిప్ బాప్స్, లిప్ మాస్క్‌లు వాడాన‌ని, అయినా ఫ‌లితం లేద‌ని శోభిత తెలిపింది.

దీంతో పెద‌వుల‌కు నెయ్యి రాసుకోవ‌డం మొద‌లుపెట్టాన‌ని, నెయ్యి రాసుకుంటున్న ద‌గ్గ‌ర‌నుంచి త‌న పెద‌వుల్లో మార్పు మొద‌లైంద‌ని, అప్ప‌ట్నుంచి ప్ర‌తీ రోజూ ఉద‌యం లేవ‌గానే తాను మొద‌టిగా చేసే ప‌ని అదేన‌ని శోభిత చెప్పింది. నెయ్యి రాసుకోవ‌డం వ‌ల్ల పెద‌వుల‌కు స‌హ‌జంగానే తేమ అంది, మంచి రంగును అందిస్తాయ‌ని చెప్తోంది.

పొడిబారిన చ‌ర్మానికి తాను కొబ్బ‌రి నూనెను వాడ‌తాన‌ని, దాని వ‌ల్ల ద‌ద్దుర్లు , దుర‌ద లాంటివి రావ‌ని, కొబ్బ‌రినూనె మంచి మాయిశ్చ‌రైజ‌ర్ గా ప‌ని చేస్తుంద‌ని శోభిత తెలిపింది. పొడిబారే చ‌ర్మత‌త్వం వ‌ల్ల త‌న జుట్టు కూడా వెంట‌నే పొడిబారుతుంటుంద‌ని దానిక్కూడా తాను కొబ్బ‌రినూనెనే వాడ‌తాన‌ని చెప్తోంది. నూనె తో కొన్ని నీళ్లు క‌లిపి దాన్ని జుట్టుకు స్ప్రే చేస్తే జుట్టు మ‌ళ్లీ నార్మ‌ల్ గా మారుతుంద‌ని తెలిపిన శోభిత‌, జుట్టుకు కొబ్బ‌రినూనె తో మ‌ర్ద‌నా చేసుకోవ‌డం వ‌ల్ల త‌న‌కున్న మైగ్రేన్ స‌మ‌స్య నుంచి బయ‌ట‌ప‌డిన‌ట్టు తెలిపింది.

త‌న ఐబ్రోస్ అంత ఒత్తుగా ఉండ‌టానికి కార‌ణం తాను చిన్న‌ప్ప‌టి నుంచి ఆముదం వాడ‌ట‌మేన‌ని శోభిత చెప్పింది. ఎంత మేక‌ప్ ఇష్టం లేక‌పోయినప్ప‌టికీ లిప్ బామ్, ఐ లైన‌ర్, కాటుక లేకుండా తాను ఉండ‌లేన‌ని, ఆ మూడు త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని అంటోంది. అయితే కెమెరా ముందుకు వెళ్లిన‌ప్పుడు మాత్రం న‌చ్చినా న‌చ్చ‌క‌పోయినా మేక‌ప్ వేసుకుంటాన‌ని, అలాంటప్పుడు బ్లూ మేక‌ప్ వేసుకోవ‌డానికి ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తాన‌ని శోభిత వెల్ల‌డించింది.