శోభన్ బాబు మనవడికి గిన్నీస్ రికార్డు.. ఎందుకంటే
తెలుగు సినీ ప్రపంచంలో శోభన్ బాబు కు ప్రత్యేక క్రేజ్, ఎంతో మంది అభిమానులున్నారు.
By: Tupaki Desk | 6 May 2025 5:28 PM ISTతెలుగు సినీ ప్రపంచంలో శోభన్ బాబు కు ప్రత్యేక క్రేజ్, ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి. తన నటన, సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన శోభన్ బాబు భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన నటించిన సినిమాల రూపంలో ఇప్పటికీ మనతోనే ఉన్నారు.
శోభన్ బాబు ఎంతో స్టార్ హీరోగా నిలిచినప్పటికీ తన ఫ్యామిలీ నుంచి ఎవరినీ ఇండస్ట్రీకి తీసుకుని వచ్చింది లేదు. ఇదిలా ఉంటే ఆయన వారసులు సినీ ఇండస్ట్రీలో లేకపోయినా ఆయన పేరుని మరో రంగంలో ముందుకు తీసుకెళ్తున్నారు. శోభన్ బాబు మనవడు సురక్షిత్ డాక్టర్. వైద్యరంగంలో ఆయన ఇటీవల ఓ గొప్ప విజయాన్ని సాధించి దేశం మొత్తం అతని గురించి మాట్లాడేలా చేశాడు.
చెన్నైలో గైనకాలిజిస్ట్ గా వైద్య సేవలందిస్తున్న సురక్షిత్ రీసెంట్ గా ఓ ఆపరేషన్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు. 44 ఏళ్ల మహిళ గర్భాశయంలో ఏర్పడిన 4.5 కేజీల సిస్ట్‌ను అత్యాధునిక ట్రూ త్రీడీ ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో తొలగించి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆయన చేసిన ఈ సర్జరీ వైద్య రంగంలో ఓ సంచలనంగా మారింది.
మామూలుగా అయితే ఇంత భారీ సిస్ట్‌ను తొలగించాలంటే ఓపెన్ సర్జరీ చేయాలి కానీ సురక్షిత్ మాత్రం ఆ ఆపరేషన్ ను ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసి సక్సెస్ అయ్యాడు. దాదాపు 8 గంటల పాటూ ఈ సర్జరీని చేసి మహిళ ప్రాణాలను కాపాడాడు డాక్టర్ సురక్షిత్. ఇండిగో ఉమెన్స్ సెంటర్ పేరిట హాస్పిటల్ ను స్థాపించి ఇప్పటికే 10 వేలకు పైగా సర్జరీలు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన సురక్షిత్ ను అందరూ మెచ్చుకుంటూ అతన్ని తాతకు తగ్గ మనవడిగా ప్రశంసిస్తున్నారు.
