Begin typing your search above and press return to search.

బ్యాగ్రౌండ్ లేదు కానీ, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎవరికైనా అంత ఆశామాషీ విషయం కాదు.

By:  Tupaki Desk   |   25 April 2024 4:16 AM GMT
బ్యాగ్రౌండ్ లేదు కానీ, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి!
X

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎవరికైనా అంత ఆశామాషీ విషయం కాదు. ఎంత టాలెంట్ ఉన్నా, దానికి కాస్త అదృష్టం కూడా తోడైతేనే ఇక్కడ రాణించగలుగుతారు. అయితే ఇటీవల కాలంలో నేటితరం యువ హీరోలు కొందరు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అడుగుపెట్టి, స్వయంకృషితో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం తమ టాలెంట్ తో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నారు. ఆ చిన్న మీడియం రేంజ్ హీరోలేవరో ఇప్పుడు చూద్దాం.

తేజ సజ్జ:

చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన తేజ సజ్జ.. పెద్దవాడయ్యాక 'ఓ బేబీ' చిత్రంలో నటించాడు. 'జాంబిరెడ్డి'తో హీరోగా మారి డెబ్యూతోనే హిట్టు కొట్టాడు. 'అద్భుతం' సినిమాతో ఓటీటీలో సందడి చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'హను-మాన్‌' మూవీతో బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి, సూపర్ హీరోగా ఎపిక్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు సూపర్‌ యోధుడిగా 'మిరాయ్‌' సినిమాతో మరో సంచలనం సృష్టించారని రెడీ అవుతున్నాడు తేజ.


సిద్ధు జొన్నలగడ్డ:

'జోష్‌' సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన సిద్ధు.. కెరీర్ స్టార్టింగ్ లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లోనే ఎక్కువగా నటించాడు. 'గుంటూరు టాకీస్‌' చిత్రంతో యూత్ ను ఆకట్టుకున్నాడు. 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీల' సినిమాతో హీరోగా మంచి హిట్టు అందుకున్నారు. ఇక 'డీజే టిల్లు'తో ఎవరూ ఊహించని పెద్ద విజయాన్ని సాధించాడు. దానికి సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్‌' సినిమా తీసి రూ.125 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టాడు. ప్రస్తుతం 'జాక్', 'తెలుసు కదా' చిత్రాల్లో నటిస్తున్న స్టార్ బాయ్.. త్వరలో 'టిల్లు క్యూబ్' మూవీ తెరకెక్కించనున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా సొంతంగా స్టోరీలు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసుకోవడం అతని ప్రత్యేకత.


విశ్వక్ సేన్:

'బంగారు బాబు' అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన విశ్వక్ సేన్.. 'వెళ్ళిపోమాకే'తో హీరోగా పరిచయమయ్యాడు. 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో యూత్ కి దగ్గరయ్యాడు. తన స్వీయ దర్శకత్వంలో 'ఫలక్‌నుమా దాస్‌' మూవీ తీసి మాస్ కా దాస్ గా మారిపోయాడు. ఆ తరువాత 'హిట్‌' 'అశోకవనంలో అర్జున కల్యాణం' 'పాగల్', 'దాస్ కా ధమ్కీ' 'గామి'.. ఇలా వేటికవే ప్రత్యేకమైన సినిమాలతో ఆడియన్స్ ను అలరించాడు. మే 17న 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి'తో థియేటర్లలో సందడి చేయటానికి వస్తున్నాడు విశ్వక్.


అడివి శేష్:

'సొంతం'లో చిన్న పాత్ర పోషించిన అడివి శేష్.. తన స్వీయ దర్శకత్వంలో 'కర్మ' చిత్రం చేశాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా సపోర్టింగ్ రోల్స్ చేసిన టాలెంటెడ్ యాక్టర్.. 'క్షణం' మూవీతో సత్తా చాటాడు. 'గూఢచారి', 'ఎవరు', 'హిట్‌' 2' 'మేజర్‌' వంటి బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. స్వతహాగా కథలు, స్క్రీన్‌ప్లే రాసుకునే శేష్‌.. ప్రస్తుతం గూఢచారి సీక్వెల్‌ 'G 2', 'డెకాయిట్‌' సినిమాల్లో నటిస్తున్నాడు.


నవీన్ పోలిశెట్టి:

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' లో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసిన నవీన్.. 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా తొలి ప్రయత్నంలోనే హిట్టు కొట్టాడు. 'ఛిచోరే'తో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో 'జాతి రత్నాలు', 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. త్వరలో మూడు పెద్ద నిర్మాణ సంస్థల్లో సినిమాలు చేయటానికి సిద్ధమవుతున్నాడు.


నిఖిల్ సిద్ధార్థ:

'సంబరం'లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నిఖిల్.. 'హ్యాపీ డేస్'తో గుర్తింపు తెచ్చుకున్నాడు. 'యువత'తో మెప్పించాడు. 'స్వామి రారా' 'కార్తికేయ' 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' 'అర్జున్ సురవరం' లాంటి హిట్లు సాధించాడు. 'కార్తికేయ 2' సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ప్రస్తుతం 'స్వయంభూ' సినిమాలో నటిస్తున్న నిఖిల్.. 'కార్తికేయ 3' తో పాటుగా ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టాడు.


శ్రీ విష్ణు:

'బాణం'లో చిన్న పాత్ర పోషించిన శ్రీ విష్ణు.. కొన్నాళ్లపాటు సపోర్టింగ్ రోల్స్ తోనే నెట్టుకొచ్చాడు. 'ప్రేమ ఇష్క్ కాదల్' 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా 'మెంటల్ మదిలో' 'నీది నాది ఒకటే కథ', 'బ్రోచేవారెవరురా', 'రాజ రాజ చోర' లాంటి విజయాలు అందుకున్నాడు. గతేడాది 'సామజవరగమన' తో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీ విష్ణు.. ఇటీవల 'ఓం భీమ్ బుష్' తో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు 'రాజ రాజ చోర' ప్రీక్వెల్ 'స్వాగ్' తో పాటుగా SV18 సినిమాలో నటిస్తున్నాడు.


సుహాస్:

'పడి పడి లేచె మనసు' లో హీరో ఫ్రెండ్ గా నటించిన సుహాస్.. కమెడియన్‌గా కొన్ని సినిమాలు చేశాడు. 'కలర్‌ ఫొటో'తో హీరోగా పరిచయమై, తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ సాధించాడు. 'ఫ్యామిలీ డ్రామా' 'హిట్ 2' చిత్రాల్లో నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలతో ఆశ్చర్యపరిచాడు. 'రైటర్‌ పద్మభూషణ్‌' 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాలతో హిట్లు కొట్టాడు. మే 3న 'ప్రసన్న వదనం' తో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్న సుహాస్.. ప్రజెంట్ 'కేబుల్ చారీ', 'ఆనందరావు అడ్వెంచర్స్', 'గొర్రె పురాణం' లాంటి సినిమాలలో నటిస్తున్నాడు.