దుమ్ముదులుపుతున్న చిన్న సినిమా
కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు స్టార్ హీరో సినిమానా?, స్టార్ డైరెక్టర్ సినిమానా? అని చూడటం లేదు.
By: Tupaki Desk | 2 April 2025 3:00 PM ISTకంటెంట్ బాగుంటే ప్రేక్షకులు స్టార్ హీరో సినిమానా?, స్టార్ డైరెక్టర్ సినిమానా? అని చూడటం లేదు. చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఆలోచింపజేసే విధంగా ఉంటే ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఇది చాలా సినిమాల విషయంలో రుజువైంది కూడా. తాజాగా మరోసారి చిన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ కలెక్షన్‌ల వర్షం కురిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం `కోర్ట్ : స్టేట్ వర్సెస్ నోబడీ`. ప్రియదర్శి కీలక పాత్రలో నటించగా హర్షా రోషన్, శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్‌కి తక్కువ.ఓటీటీకి ఎక్కువ అనే కామెంట్‌లు నిర్మాణం నుంచే వినిపించినా సినిమాపై నమ్మకంతో హీరో నాని ఈ మూవీని థియేట్రికల్ రిలీజ్ చేయడం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 14న విడుదైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ విమర్శకులని విస్మయానికి గురి చేస్తోంది.
పది కోట్లలోపు బడ్జెట్‌తో కొత్త దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైనే రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ సత్తాచాటుతూ వన్ మిలియన్‌మార్కుని దాటేసి అక్కడ కూడా దుమ్ముదులిపేస్తోంది. ఇక ఇదే తరహాలో మరో చిన్న సినిమా కూడా బాక్సాఫీస్‌ని రఫ్ఫాడించేస్తోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించిన మూవీ `మ్యాడ్ స్క్వేర్`. మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
లాజిక్‌లతో సంబంధంలేకుండా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. లడ్డుగాని పెళ్లి నేపథ్యంలో సాగే వినోదాత్మక కథగా ఆద్యంత యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించారు. రిలీజ్ రోజు మిక్స్డ్ టాక్‌ని సొంతం చేసుకున్న ఈ మూవీ తొలి రోజు వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 60 కోట్లకు పైనే రాబట్టడం విశేషం. ఇలా చిన్న సినిమాలుగా విడుదలై వరల్డ్ వైడ్‌గా ఈ రెండు సినిమాలు కాసుల వర్షం కురిపిస్తుండటంతో చిన్న సినిమాల నిర్మాతలు మరింత జోష్‌తో మరిన్ని చిన్న చిత్రాలని నిర్మించడానికి ముందుకొస్తుండటం విశేషం.