Begin typing your search above and press return to search.

వీడియో : కారు ఛేజింగ్ షూట్‌లో స్టంట్స్‌ ఆర్టిస్ట్‌ మృతి

ప్రముఖ దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్పట్టా పరంబరై' సినిమా షూటింగ్‌లో భాగంగా కార్‌ ఛేజింగ్‌ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 July 2025 1:11 PM IST
వీడియో : కారు ఛేజింగ్ షూట్‌లో స్టంట్స్‌ ఆర్టిస్ట్‌ మృతి
X

ఒకప్పటి సినిమాలతో పోల్చితే ఇప్పుడు సినిమాలు చాలా రియాల్టీగా ఉంటున్నాయి. ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌ను ఒకప్పుడు హీరో ఒక్క పంచ్‌కి విలన్‌ల గుంపు కింద పడే విధంగా చూపించే వారు. అయితే ఆ షాట్‌లో రియాల్టీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు అదే షాట్‌ ను చాలా రియాల్టీగా తీస్తున్నారు. అందుకోసం చాలా వర్కౌట్ చేస్తున్నారు. విలన్స్‌ను రోప్‌తో కట్టి, హీరోతో గట్టిగా కొట్టించి రకరకాలుగా చేసి అదే షాట్‌ రియాల్టీకి చాలా దగ్గరగా ఉండేలా చేస్తున్నారు. అందుకోసం హీరోలు మాత్రమే కాకుండా ఫైటర్స్‌, స్టంట్స్ మాస్టర్స్‌ సైతం చాలా రిస్క్ తీసుకుంటున్నారు. చాలా వరకు రోప్‌ షాట్స్ చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ తాడు తెగుతుందో అనే టెన్షన్‌ ఉంటుంది.

యాక్షన్‌ సీన్స్ చేస్తూ చాలా మంది హీరోలు గాయాల పాలు అయినట్లు వార్తలు వస్తూ ఉంటాయి, అంతే కాకుండా చాలా మంది స్టంట్స్ అసిస్టెంట్స్‌, ఫైటర్స్‌ గాయాల పాలు అయ్యారని వార్తలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏకంగా ఒక సినిమా షూటింగ్‌ సమయంలో చేస్తున్న స్టంట్స్‌లో అదుపు తప్పి ఒక స్టంట్ ఆర్టిస్ట్‌ మృతి చెందాడు. కోలీవుడ్‌కు చెందిన స్టంట్‌ ఆర్టిస్ట్‌ ఎస్‌ ఎం రాజు కారు ఛేజింగ్‌ సీన్‌లో నటిస్తూ అదుపు తప్పి మృతి చెందాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎన్నో స్టంట్స్‌ చేసిన రాజు మృతి చెందడంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్పట్టా పరంబరై' సినిమా షూటింగ్‌లో భాగంగా కార్‌ ఛేజింగ్‌ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చాలా ఎత్తు నుంచి కారును దూకించారు. అందులో స్టంట్‌ ఆర్టిస్ట్‌ రాజు ఉన్నాడు. కారు ఫల్టీలు కొట్టడంతో రాజు మృతి చెందాడు. షాట్‌ కంప్లీట్‌ అయిన తర్వాత వెంటనే యూనిట్‌ అంతా రాజు వద్దకు వెళ్లిన సమయంలో అప్పటికే అతడు తీవ్ర గాయాలతో చనిపోయాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగానే రాజు చనిపోయాడు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. షూటింగ్‌ను అర్థాంతరంగా ముగించి యూనిట్‌ సభ్యులు తదుపరి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

స్టంట్ ఆర్టిస్ట్‌ రాజు మరణంపై హీరో విశాల్‌ స్పందించాడు. పా. రంజిత్ సినిమా షూటింగ్‌లో భాగంగా కారు బోల్తా పడి స్టంట్‌ ఆర్టిస్టు రాజు మరణించాడని తెలిసి షాక్ అయ్యాను. అతడి మరణంను జీర్ణించుకోలేక పోతున్నాను. చాలా ఏళ్లుగా రాజుతో నాకు పరిచయం ఉంది. నేను చేసిన చాలా రిస్కీ షాట్స్ లో రాజు సహకారం చాలా ఉంది. అలాంటి రాజు మృతి చెందడంను తట్టుకోలేక పోతున్నాను. రాజు మృతికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. కోలీవుడ్‌కి చెందిన మరికొందరు ప్రముఖులు సైతం రాజు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు.