కోట్లు మిస్ అయినా, జీవితంలో గెలిచా!
సినిమా ప్రపంచం వెలుగుల్లో కనిపించే ప్రతి నవ్వు వెనుక ఒక కథ ఉంటుంది. అలాంటి ఓ వ్యక్తిగత ప్రయాణాన్ని తాజాగా బయటపెట్టారు నటుడు శివాజీ.
By: Sravani Lakshmi Srungarapu | 4 March 2026 3:40 PM ISTసినిమా ప్రపంచం వెలుగుల్లో కనిపించే ప్రతి నవ్వు వెనుక ఒక కథ ఉంటుంది. అలాంటి ఓ వ్యక్తిగత ప్రయాణాన్ని తాజాగా బయటపెట్టారు నటుడు శివాజీ. రియల్ ఎస్టేట్‌తో కోట్లు సంపాదించారన్న ప్రచారంపై ఆయన స్పందించిన తీరు, మాటల్లోని నిజాయితీ, అనుభవాలపై చూపిన స్పష్టత గురించి ఆయన చెప్తుంటే విషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు.
అప్పుడదే జీవనాధారం
రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించాను అని చెప్పనని, ఎందుకంటే అది అబద్ధం అవుతుందని సూటిగా చెప్పారు శివాజీ. సినీ అవకాశాలు తగ్గిన టైమ్ లో తనకు జీవనాధారంగా మారింది రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని చెప్పారు. ప్లాట్లు కొనడం, వాటిని అమ్మడం, అదే అప్పుడు తన రోజువారీ రొటీన్ అని, చెప్పారు. అలా అన్నీ అమ్మినవేనా, దాచుకున్నవి ఏమైనా ఉన్నాయా అంటే కొనడం, అమ్మడమే తన వ్యాపారం, ఆధారమైనప్పుడు అమ్మాల్సిందే కదా అని చెప్పడం ఆయన నిజాయితీని సూచిస్తుంది.
రూ.70 వేలకు కొని, రూ.9 లక్షలకు అమ్మా
అయితే ఈ జర్నీలో, ఎప్పుడైనా ఏదైనా ఇది అనవసరంగా అమ్మేసానే అనే ఫీలింగ్ వచ్చిందా అనే ప్రశ్న ఈ సందర్భంగా ఆయనకు ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ, యాదగిరి గుట్ట దగ్గరలో 10 ఎకరాలు, ఎకరం రూ.70 వేల చొప్పున కొన్నానని, తర్వాత దాన్ని ఎకరం రూ.9 లక్షలకు అమ్మానని, అప్పట్లో అదే తనకు పెద్ద లాభమనిపించిందని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని శివాజీ అన్నారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 18 అమ్మా..
అదే విధంగా హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో 18 ఎకరాలు కొని, తర్వాత అమ్మేశానని, ఒక ఎకరం అయినా ఉంచుకోవచ్చు కదా అనిపిస్తుందని, ఇప్పుడు అక్కడ ఒక్కో ఎకరం రూ.100 కోట్లు అంటున్నారని, అంటే రూ.1800 కోట్లు మిస్ అయినట్టే కదా అని.. కానీ అప్పుడు ఆ డబ్బుతోనే బిజినెస్ ను రొటేషన్ చేసుకుంటూ ముందుకెళ్లానని, ఆ ఏరియా లో అంత డిమాండ్ పెరుగుతుందని తాను అప్పుడు ఊహించలేదని, అయినా అవేమీ లేకపోయినా, ఇప్పటికప్పుడు ఏం లేకపోయినా జీవితం హాయిగానే వెళ్తుందని ఆయన చెప్పిన మాట తన జీవితంలోని తృప్తిని స్పష్టంగా తెలియచేస్తోంది.
మార్చి 6న సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని రిలీజ్
అయితే కోట్లు మిస్ అయినా, లైఫ్ ను మాత్రం ఎప్పుడూ కోల్పోలేదనే భావన శివాజీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. ప్రస్తుతం శివాజీ సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలోనే శివాజీ తన పర్సనల్ లైఫ్ లోని ఈ ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో లయ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మార్చి 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
