రాష్ట్రపతి సినిమా చూడాలనుకోవడం తప్పా?
ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోసం అమీర్ ఒక ప్రత్యేక షో ఏర్పాటు చేసారు.
By: Tupaki Desk | 25 Jun 2025 11:53 PM ISTమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించి నిర్మించిన `సీతారే జమీన్ పార్` ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పాజిటివ్ సమీక్షలు వచ్చాయి. అయితే సూపర్ స్టార్ రేంజుకు తగ్గ వసూళ్లు దక్కలేదు. విడుదలైన నాలుగో రోజుకే థియేటర్లకు వచ్చే జనం తగ్గారు. అయితే అమీర్ ఖాన్ తన సినిమాకి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.
ఇది అందరికీ రుచించడం లేదు. దీనిని కొందరు ప్రచార హంగామా అని కొట్టి పారేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోసం అమీర్ ఒక ప్రత్యేక షో ఏర్పాటు చేసారు. ఈ షో వీక్షించిన ద్రౌపది ముర్ము ఒక ప్రత్యేక కాజ్ కోసం ఇలాంటి సినిమాలు తీయడం ప్రశంసనీయం అని అభినందించారు. అయితే ఒక కీలక పదవిని అలంకరించిన ద్రౌపది ముర్ము ఇలా సినిమాల కోసం సమయాన్ని వృధా చేయకూడదని కొందరు నెటిజనులు విమర్శిస్తున్నారు.
కొందరు రాష్ట్రపతి ప్రాధాన్యతలను ప్రశ్నించారు. దేశంలో చాలా సమస్యలు ఉంటే రాష్ట్రపతి అధికారిక బాధ్యతలను నెరవేర్చడానికి బదులుగా సినిమా కోసం సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. అమీర్ తన సినిమా ప్రచారం కోసం రాష్ట్రపతి సమయం వృధా చేసారని కూడా విమర్శించారు. అయితే విమర్శించడం సులువు. రాష్ట్రపతి అయినంత మాత్రాన ఎప్పుడో ఓసారి థియేటర్ లో సినిమా చూడాలని అనుకోవడం క్షమించరాని నేరమా? వారికి కూడా కొంత వ్యక్తిగత జీవితం ఉంటుంది.. వినోదం అవసరమే కదా! అని కొందరు ద్రౌపది ముర్ముకు అండగా నిలిచారు. ఒక సామాజిక అంశాన్ని బయటి ప్రపంచానికి చెప్పడం కోసం అమీర్ ఖాన్ ఈ సినిమాని తీసారు. ప్రముఖులు తన సినిమాని వీక్షించాలని కోరుకున్నారు. ఇది కూడా తప్పు కాదు కదా! అని కొందరు అతడిని సమర్థిస్తున్నారు.
