Begin typing your search above and press return to search.

12 నిమిషాల్లో చేసిన పాట 12 ఏళ్లు అయినా బోర్‌ కొట్టలే..!

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎలా హిట్‌ అయ్యాయో అర్థం కాదు, కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్‌ అయ్యాయో అర్థం కాదు.

By:  Tupaki Desk   |   11 Jun 2025 11:00 PM IST
12 నిమిషాల్లో చేసిన పాట 12 ఏళ్లు అయినా బోర్‌ కొట్టలే..!
X

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఎలా హిట్‌ అయ్యాయో అర్థం కాదు, కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్‌ అయ్యాయో అర్థం కాదు. చాలా కష్టపడి తీసిన సినిమాలు హిట్‌ కావు, అలాగే కొన్ని సినిమాలు ఎలాగూ ఫ్లాప్‌ అవుతాయిలే అని లైట్‌ తీసుకుని ముగించిన సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. రెండో కేటగిరీ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సింపుల్‌గా తీసిన సినిమాలు, నిమిషాల్లో షూట్‌ చేసిన పాటలు, గంటల వ్యవధిలో ట్యూన్‌ చేసిన పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. ఈమధ్య కాలంలో సినిమాల రీ రిలీజ్ సమయంలో అలాంటి ముచ్చట్లు వింటూ ఉన్నాం. తాజాగా బిజినెస్‌మెన్‌ సినిమాలోని సారొస్తారా పాట గురించి ఆసక్తికర విషయాన్ని తమన్‌ షేర్ చేశాడు.

తమన్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలోనే మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా మహేష్ బాబు వంటి సూపర్‌ స్టార్‌కి దూకుడు వంటి మ్యూజికల్‌ హిట్‌ను ఇవ్వడం ద్వారా ఆయన టాలీవుడ్‌లో బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జాబితాలో చోటు సంపాదించాడు. ఆ సినిమా తర్వాత మహేష్ బాబుతో చాలా సినిమాలకు వర్క్ చేసే అవకాశం దక్కింది. మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన బిజినెస్‌మెన్ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందించాడు. ఆ సినిమా కమర్షియల్‌గా బిగ్‌ హిట్‌ కాకున్నా కూడా ఆ సినిమాలోని పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సినిమా విడుదల అయ్యి దాదాపు 12 ఏళ్లు అవుతున్నా కూడా ఆ సినిమాలోని సారొస్తారా పాట మాత్రం బోర్‌ కొట్టడం లేదు.

తాజాగా తమన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సారొస్తారా పాట గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. బిజినెస్‌మెన్‌ షూటింగ్‌ గోవాలో జరుగుతుంది. అందరం అక్కడే ఉన్నాం. ఆ సమయంలో దూకుడు హిట్‌ కావడంతో మంచి జోష్‌లో ఉన్నాం. ఒకసారి పూరి సర్ వద్దకు వెళ్లి ఇప్పటివరకు ట్యూన్ చేసిన పాటల్లో ఎక్కువగా యాటిట్యూడ్‌ పదాలు వచ్చాయి. మహేష్ బాబు గారి క్రేజ్‌ కి అనుసారంగా ఒక మెలోడీ పెడితే బాగుంటుంది అని చెప్పాను. అప్పుడు పూరి గారు కథలో ఎక్కడ పెడదాం అంటావు అని ప్రశ్నించారు. అప్పుడు నేను ఒక సీన్‌ చెప్పినప్పుడు ఆయన కన్విన్స్ అయ్యారు. భాస్కరభట్ల ను తీసుకు వెళ్లి ఆ పని చూడాల్సిందిగా చెప్పాడు.

అక్కడే ఉన్న మరో రూం కి నేను, భాస్కరభట్ల గారు వెళ్లి ట్యూన్ చేయడం మొదలు పెట్టాము. 10 నుంచి 12 నిమిషాల తర్వాత పూరిగారు రూం కి వచ్చారు. ఆయన పాట వినిపించాం. ఆయనకు నచ్చింది. వెంటనే వర్మ గారు వచ్చారు. ఆయనకు ఈ పాట వినిపిస్తే ఇలాంటి సినిమాలో సార్‌ వచ్చాడు.. పోయాడు అంటూ ఏం పాట అన్నాడు. దాంతో పూరి గారు ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డాడు. చివరకు మహేష్ బాబు గారి నిర్ణయం మేరకు సినిమాలో ఆ పాట పెట్టాం. ఆయన విన్న వెంటనే చాలా బాగుంది తమన్‌ అన్నారు. ఆయన ఈ పాటకు చాలా అభినందించారు. దాంతో సినిమాలో పాట ఉంచాం. సినిమాలో పాట సూపర్‌ హిట్‌ అయింది. అన్ని ప్లాట్‌ ఫామ్‌ల్లోనూ ఇంకా మంచి స్పందన దక్కించుకుంటుంది. 12 ఏళ్లు అయినా 12 నిమిషాల్లో చేసిన పాట బోర్‌ కొట్టించడం లేదు అంటే ఏ స్థాయిలో పాట విజయాన్ని సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు.