Begin typing your search above and press return to search.

సిరివెన్నెలకు గొప్ప గౌరవం

మహా కవి జీవించును జనం నాల్కల మీద అని పెద్దలు చెప్పారు. రాజు తన పాలన కాలంలోనే జనానికి గుర్తు ఉంటాడు అని వారే అన్నారు.

By:  Tupaki Desk   |   21 May 2025 11:11 PM IST
సిరివెన్నెలకు గొప్ప గౌరవం
X

మహా కవి జీవించును జనం నాల్కల మీద అని పెద్దలు చెప్పారు. రాజు తన పాలన కాలంలోనే జనానికి గుర్తు ఉంటాడు అని వారే అన్నారు. అలాగే కత్తి కన్న కలమే పదునైనది అన్నారు. కత్తితో మనిషిని బంధించవచ్చు కానీ మనసును ఏమీ చేయలేరు. అదే కలంతో అయితే ఆలోచనలను ప్రేరేపించి మనసుని సైతం బంధించవచ్చు. అలా ఏ విధంగా చూసినా కవి ఎప్పటికీ చిరంజీవి అని అంటారు. అదే అక్షరాల సత్యం.

ఇక విషయానికి వస్తే సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి తెలియని వారు ఉండరు. ఆయన అలతి పదాలతో అద్భుతమైన అర్ధాలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలుగు సినిమా చరిత్రలో ఎందరో గొప్ప కవులు ఉన్నారు. వారి సరసన చేరిన వారు శాస్త్రిగారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఒక మల్లాది రామకృష్ణ శాస్త్రి, సముద్రాల సీనియర్, పింగళి నాగేంద్రరావు, శ్రీశ్రీ , ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, సినారే, వేటూరి సుందరరామమూర్తి వంటి వారు తెలుగు సినిమా గీతాన్ని తలెత్తుకునేలా చేశారు. ఆ తరువాత వచ్చిన సీతారామశాస్త్రి తన జీవితం మొత్తం సినీ గీతానికే అంకితం చేశారు. ఆయన 29 ఏళ్ళ వయసులో సినీ పరిశ్రమలో ప్రవేశించారు. జీవితం లో ఆఖరి శ్వాస దాకా రాస్తూనే ఉన్నారు. ఆయన 2021లో మరణించారు. ఆయన జయంతి మే 20న.

ఈ ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన డెబ్బయ్యవ జయంతిగా దీనిని తెలుగు నాటనే కాకుండా అంతర్జాతీయంగా జరుపుకున్నారు. శాస్త్రి గారి పాటలను నెమరేసుకుని ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఇక శాస్త్రి గారిది అనకాపల్లి. అక్కడ నుంచి మొలకెత్తిన ఆ కవితా విత్తనం మహావృక్షంగా మారి విశ్వవ్యాప్తం అయింది.

దాంతో మా అనకాపల్లి బిడ్డ కీర్తి అజరామరంగా మారింది అని ఆ గడ్డ పులకరించింది. ఇంతటి కీర్తిని తెచ్చిపెట్టిన సిరివెన్నెలను చిరస్మరణీయంగా గుర్తు చేసుకోవడానికి ఆయన విగ్రహాన్ని అనకాపల్లిలోని ముఖ్య కూడలిలో ఏర్పాటు చేస్తామని స్థానిక శాసనసభ్యుడు, జనసేన నేత కొణతాల రామకృష్ణ ప్రకటించారు.

ఈ విగ్రహం కోసం ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తానా ప్రతినిధుల సహకారంతో సిరివెన్నెల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో తెలుగు సాహితీవేత్తలతో పాటు సినీ సాహిత్య అభిమానులు సిరివెన్నెల పాటలను ఆరాధించి అభిమానించే వారు కూడా ఎంతగానో ఆనందిస్తున్నారు. విగ్రహం రూపంలో సిరివెన్నెల ఇక మీదట ప్రతీ రోజూ జనాలకు కనిపించి వారికి ఒక స్పూర్తి దాతగా కార్యోన్ముఖులను చేస్తారు అని అంటున్నారు. వర్తమాన కాలంలో ఎవరికీ దక్కని గౌరవం సిరివెన్నెలకు ఆ విధంగా దక్కుతోంది అని అంటున్నారు.

అలనాటి మహా కవులు శ్రీశ్రీ ఆరుద్ర వంటి వారి విగ్రహాలు విశాఖ బీచ్ లో ఏర్పాటు అయ్యాయి. ఇపుడు సిరివెన్నెల విగ్రహం ఏర్పాటుతో ఆయన చిరంజీవిగా నిలిచి తన కీర్తి కాయంతో కవితా లోకాన్ని ఓలలాడిస్తారు అని అంటున్నారు.