Begin typing your search above and press return to search.

మైత్రికి, సితార నాగవంశీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది

దిల్ రాజు సోదరుడు, SVC సహా నిర్మాత శిరీష్ మొదటిసారి ఒక ఇంటర్వ్యూ ద్వారా జనాల దృష్టిని ఆకర్షించారు.

By:  Tupaki Desk   |   1 July 2025 7:15 PM IST
మైత్రికి, సితార నాగవంశీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది
X

దిల్ రాజు సోదరుడు, SVC సహా నిర్మాత శిరీష్ మొదటిసారి ఒక ఇంటర్వ్యూ ద్వారా జనాల దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా ఆయన బయటకు రారు. సినిమా ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ లో బిజీగా ఉండే శిరీష్ ఈమధ్య కాలంలో పలు రకాల ఇండస్ట్రీ మీటింగ్లలో కూడా చర్చనీయాంశంగా మారారు. కాస్త డేరింగ్ మాట్లాడే స్వభావం ఉన్నట్లు ఆయనే ఒప్పుకున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా ఫలితంపై ఇటీవల నిర్మాత శిరీష్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా శిరీష్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ముఖ్యంగా హీరో రామ్ చరణ్,దర్శకుడు శంకర్ నష్టపోయినప్పుడు కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.

అలాగే మైత్రి మూవీస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలపై మాట్లాడిన విధానం మరో చర్చను తెరలేపింది. డిస్ట్రిబ్యూటర్లపై మైత్రి సంస్థ ఎప్పుడూ కూడా పెద్దగా శ్రద్ధ పెట్టిందనే మాటలు వినిపించలేదని, కానీ నాగవంశీ మాత్రం ఎప్పుడూ డిస్ట్రిబ్యూటర్లకు అండగా ఉండే వ్యక్తి అని చెప్పారు. ఈ మాటల ద్వారా ఆయన నాగవంశీని ప్రశంసించారు. మైత్రికి, సితార నాగవంశీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

శిరీష్ వివరించిన దాని ప్రకారం, గతంలో సవ్యసాచి, గ్యాంగ్ లీడర్ సినిమాల కోసం తాము డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నప్పటికీ ఆ సినిమాలు నష్టాలను మిగిల్చాయని, కానీ మైత్రి సంస్థ నుండి ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదని చెప్పారు. అయితే ఇటీవల గుంటూరు కారం సినిమాతో తాము 8 కోట్లు నష్టపోయామని, వాటిని నిర్మాత నాగవంశీ సర్దుబాటు చేశారని వివరించారు. వాటిలో నాలుగు కోట్లు మాడ్ స్క్వేర్ ద్వారా, మిగతా నాలుగు కోట్లు నాగవంశీ స్వయంగా ఇచ్చారని వెల్లడించారు.

ఇక తమ డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడంలో నాగవంశీ చూపిన నిబద్ధతను గుర్తు చేస్తూ, ఈ పరిశ్రమలో అటువంటి నైతిక విలువలు ఉండటం చాలా గొప్ప విషయమని శిరీష్ అభిప్రాయపడ్డారు. అలాంటి గుణమే తమకు కూడా ఉందని అన్నారు. ఇక వారి నిర్మాణంలో రూపొందిన “తమ్ముడు” జూలై 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు రాబోతోంది.