శ్రీ విష్ణు, సమంత సినిమాలకు గోల్డెన్ ఛాన్స్
పండగ సీజన్ల తర్వాత టాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు, కలెక్షన్లు వచ్చే సీజన్ సమ్మర్ సీజనే.
By: Tupaki Desk | 7 May 2025 6:46 AMపండగ సీజన్ల తర్వాత టాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు, కలెక్షన్లు వచ్చే సీజన్ సమ్మర్ సీజనే. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఉండటంతో ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకు వెళ్లాలనుకునే వారు ఎక్కువ. మామూలు రోజుల్లో ఒక టికెట్ వచ్చే దగ్గర, సమ్మర్ లో మూడు నాలుగు టికెట్స్ రావడమంటే కలెక్షన్లలో ఎంతో తేడా వస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ ఏడాది ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. నేచురల్ స్టార్ నాని ఈసారి మే ను ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. మే 1న రిలీజైన హిట్3 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతుంది. హిట్ 3 ఇప్పటికే సెకండ్ వీక్ లోకి ఎంటరైంది. ఇదిలా ఉంటే ఈ వారం బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
అందులో ఒకటి శ్రీవిష్ణు సింగిల్ కాగా రెండోది సమంత నిర్మించిన మొదటి సినిమా శుభం. ఈ రెండు సినిమాలు మే 9న రిలీజ్ కానున్నాయి. అందులో శ్రీవిష్ణు సింగిల్ సినిమా రొమాంటిక్ కామెడీ తో పాటూ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ సినిమాకు శ్రీవిష్ణు చేస్తున్న డిఫరెంట్ ప్రమోషన్స్ కూడా యూత్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
ఇక సమంత శుభంతో నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఆల్రెడీ దీనిపై మంచి బజ్ ఉంది. చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ హర్రర్ డ్రామాలో సమంత కూడా ఓ గెస్ట్ రోల్ చేస్తోంది. టీవీ సీరియల్స్ పై డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల చేసిన ప్రయత్నం అందరినీ నవ్విస్తుందని, శుభం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది.
అయితే మే 9న రిలీజ్ కానున్న శ్రీవిష్ణు సింగిల్ సినిమాకీ, సమంత శుభం సినిమాకీ ఓ పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఈ వారం ఇవి రెండు కాకుండా మరే సినిమాలూ రావడం లేదు. దానికి తోడు నెక్ట్స్ వీక్ ఎలాంటి థియేట్రికల్ రిలీజ్‌లూ లేవు. విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ వచ్చే వరకు ఈ రెండు సినిమాలకు ఫ్రీ గ్రౌండ్ దొరుకుతుంది. కాబట్టి సినిమాలకు మంచి టాక్ రావడమే లేటు. ఆడియన్స్ ను కంటెంట్ తో ఇంప్రెస్ చేయగలిగితే ఈ రెండు సినిమాలకూ కాసుల వర్షం కురవడం ఖాయం. చూడాలి మరి ఈ రెండు సినిమాలూ ఎలాంటి ఫలితాల్ని అందుకుంటాయో.