టాలీవుడ్‌లో కార్చిచ్చు: 'పర్సంటేజీ' వర్సెస్ 'రెంటల్` వివాదం!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య 'పర్సంటేజీ' వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By: Sivaji Kontham | 25 May 2026 11:15 AM ISTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య 'పర్సంటేజీ' వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంటల్ (ఫిక్స్‌డ్ అద్దె) విధానం అమలులో ఉంది. దీని ప్రకారం.. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసినా.. థియేటర్ యజమానికి కేవలం ఒప్పందం కుదుర్చుకున్న 7 లక్షల అద్దె మాత్రమే దక్కుతుంది. మిగిలిన భారీ మొత్తం నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ జేబుల్లోకి వెళ్తుంది. దీనికి భిన్నంగా మల్టీఫ్లెక్స్‌లలో `పర్సంటేజీ` పద్ధతి నడుస్తోంది. అక్కడ వసూళ్లలో మల్టీఫ్లెక్స్ యాజమాన్యానికి, నిర్మాతకు దాదాపు 45:55 నిష్పత్తిలో వాటాలు ఉంటాయి. ఇప్పుడు ఇదే పర్సంటేజీ విధానాన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ వర్తింపజేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుండటమే ఈ సరికొత్త వివాదానికి కారణమైంది.
అసలు ఈ పర్సంటేజీ వ్యాపారం థియేటర్లలో టికెట్ల అమ్మకాలు.. ఎన్ని వారాలు అనే ప్రాతిపదికన నడుస్తుంది. సాధారణంగా సినిమా విడుదలైన మొదటి వారంలో వచ్చే వసూళ్లలో మల్టీఫ్లెక్స్‌లు లేదా ఎగ్జిబిటర్లు తక్కువ వాటా (ఉదాహరణకు 45 శాతం) తీసుకుని.. నిర్మాతకు ఎక్కువ వాటా (55 శాతం) ఇస్తారు. రెండో వారం వచ్చేసరికి ఈ నిష్పత్తి 50:50గా మారుతుంది. మూడో వారం నుంచి థియేటర్ల వాటా మరింత పెరుగుతుంది. సినిమా ఆడుతున్న రోజులను బట్టి వచ్చే కలెక్షన్లలో కచ్చితమైన వాటాల్ని పంచుకోవడమే ఈ వ్యాపార సూత్రం. సింగిల్ స్క్రీన్ యజమానులు కూడా ఈ విధానం వస్తేనే పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, కరెంట్ బిల్లుల భారాన్ని మోస్తూ తాము మనుగడ సాగించగలమని వాదిస్తున్నారు.
అయితే ఈ పర్సంటేజీ విధానం వల్ల నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని టాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెంటల్ విధానంలో సినిమా సూపర్ హిట్ అయి భారీ వసూళ్లు సాధిస్తే... కేవలం స్థిరమైన అద్దె మాత్రమే థియేటర్‌కు చెల్లించి మిగిలిన లాభాలన్నీ నిర్మాతలే దక్కించుకోవచ్చు. కానీ పర్సంటేజీ విధానం వస్తే.. వసూళ్లు పెరిగే కొద్దీ థియేటర్ ఓనర్లకు ఇచ్చే వాటా కూడా కోట్లలో పెరుగుతుంది. దీనివల్ల భారీ బడ్జెట్ సినిమాలకు వచ్చే లాభాల్లో సింహభాగం థియేటర్ల ఖాతాలోకి వెళ్ళిపోతుంది. పైగా సినిమా ప్లాప్ అయితే థియేటర్లకు కనీస అద్దె కూడా రాదనే నెపంతో.. కేవలం పెద్ద సినిమాల లాభాల్లో వాటాల కోసమే ఎగ్జిబిటర్లు (థియేటర్ల యజమానులు) ఈ పట్టుబడుతున్నారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
ఈ వివాదం ఇలాగే కొనసాగితే టాలీవుడ్ థియేట్రికల్ రన్ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటీటీల పోటీని తట్టుకోలేక ప్రేక్షకులు థియేటర్లకు రాక సింగిల్ స్క్రీన్లు మూతపడే స్థితికి చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య సమన్వయం కుదరకపోతే సినిమా ప్రదర్శన రంగం మరింత సంక్షోభంలో పడుతుంది. మల్టీఫ్లెక్స్ తరహా కార్పొరేట్ పద్ధతులను సింగిల్ స్క్రీన్లకు అప్లై చేయడం వల్ల చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లలో విడుదల కావడమే గగనంగా మారుతుందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
