సింగం 4: అక్కడ దేవగన్ - ఇక్కడ సూర్య భారీ ప్లాన్స్!
గత చిత్రం `సింగం అగైన్` లో మల్టీస్టారర్ కాన్సెప్ట్..ఎక్కువ మంది హీరోల క్రాస్ఓవర్ల కారణంగా బాజీరావ్ సింగం - ఒరిజినల్ అగ్రెసివ్ క్యారెక్టరైజేషన్ కొంత తగ్గిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి.
By: Srikanth Kontham | 27 May 2026 8:30 AM ISTబాలీవుడ్ లో అత్యంత విజయవంతమైన యాక్షన్ ఫ్రాంచైజీలలో ఒకటైన `సింగం` సిరీస్ నుండి తదుపరి భాగం `సింగం 4` రూపొందుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో భాగంగా గత ఏడాది దీపావళికి విడుదలైన `సింగం అగైన్` చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 390 కోట్ల వసూళ్లతో ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే ఆ చిత్రానికి వచ్చిన మిశ్రమ స్పందనను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు రోహిత్ శెట్టి- యాక్షన్ స్టార్ అజయ్ దేవగన్ ఈ నాలుగో భాగాన్ని మరింత పకడ్బందీగా పాత `సింగం` తరహా బ్రాండ్ మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి స్క్రిప్ట్ పనులను వేగవంతం చేశారు.
గత చిత్రం `సింగం అగైన్` లో మల్టీస్టారర్ కాన్సెప్ట్..ఎక్కువ మంది హీరోల క్రాస్ఓవర్ల కారణంగా బాజీరావ్ సింగం - ఒరిజినల్ అగ్రెసివ్ క్యారెక్టరైజేషన్ కొంత తగ్గిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకున్న అజయ్ దేవగన్ ఈసారి `సింగం 4` లో ప్రేక్షకులు కోరుకునే ప్యూర్ మాస్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్ .. ఒళ్లు గగుర్పొడిచే ఒరిజినల్ సింగం మార్కు ఇంటెన్సిటీని మళ్లీ పునరావృతం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి సోలో హీరో ఎలిమెంట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.
మరోవైపు సౌత్ సినీ ఇండస్ట్రీలోనూ ఇదే టైటిల్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతుండటం విశేషం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ హరి తెరకెక్కించిన సూపర్ హిట్ తమిళ `సింగం` ఫ్రాంచైజీకి కూడా నాలుగో భాగం `సింగం 4` కోసం కథాచర్చలు జరుగుతున్నట్లు దర్శకుడు హరి అధికారికంగా ధృవీకరించారు. గతంలో ప్రాంతీయ, అంతర్జాతీయ నేరగాళ్లను వేటాడిన దురైసింగం పాత్రను ఈసారి మరింత వైవిధ్యమైన కథనంతో.. సరికొత్త విలన్లతో పాన్-ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు సూర్య, హరిల కాంబో సన్నాహాలు చేస్తోంది.
అక్కడ బాలీవుడ్ లో సింగం ఫ్రాంఛైజీలో కొత్త సినిమా దేవగన్ తో తెరకెక్కిస్తే.. అదే సమయంలో సూర్య హీరోగా హరి కూడా బరిలో దిగుతున్నారు గనుక ఈ ఫ్రాంఛైజీ మరోసారి నిరంతరం వార్తల్లో నిలవడం ఖాయం. దానికి తగ్గట్టే ఫ్యాన్స్ లోను అంతే క్రేజ్ నెలకొంటుంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి కాస్టింగ్, అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. షూటింగ్ షెడ్యూల్ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
