Begin typing your search above and press return to search.

బర్త్ డే పార్టీలో డ్రగ్స్? మంగ్లీ ఏమన్నారంటే?

టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుకలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్‏ లో జరిగిన మంగ్లీ పుట్టిన రోజు వేడుకలపై పోలీసులు దాడి చేశారు.

By:  Tupaki Desk   |   12 Jun 2025 12:03 PM IST
బర్త్ డే పార్టీలో డ్రగ్స్? మంగ్లీ ఏమన్నారంటే?
X

టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే వేడుకలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్‏ లో జరిగిన మంగ్లీ పుట్టిన రోజు వేడుకలపై పోలీసులు దాడి చేశారు. కొందరు గంజాయి సేవించినట్లు ఆరోపణలు ఉండగా.. మంగ్లీ, రిసార్ట్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. "మంగళవారం రాత్రి పార్టీ స్టార్ట్ అవ్వగా, రిసార్ట్‌ నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్నాయని సమాచారం రావడంతో పోలీసులు వెళ్లారు. అప్పుడు మొత్తం కలిపి 30 మంది లోపే ఉన్నారు. ఒకరికి గంజాయి పాజిటివ్ గా వచ్చింది" అని ఆయన తెలిపారు.

"పోలీసులు వీడియోలు తీస్తుండగా మంగ్లీ అడ్డుకోవడానికి ట్రై చేశారు. కానీ తమ విధులను ఎలా అడ్డుకుంటారని వారు ప్రశ్నించడంతో సైలెంట్ అయ్యారు. నాలుగు మద్యం సీసాలు, డీజే సామగ్రి, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేడుకకు వంద మందికి పైగానే హాజరైనట్లు సమాచారం ఉంది" అని డీసీపీ చింతమనేని చెప్పారు.

ఆ తర్వాత మంగ్లీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. లిక్కర్ వాడకంపై ముందస్తు అనుమతి తీసుకోవాలనే విషయం తనకు తెలియదని చెప్పారు. అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో బర్త్‌ డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్‌ మాదిరిగా జరుపుకోవాలనుకున్నానని పేర్కొన్నారు.

"రిసార్ట్ లో లిక్కర్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. కానీ వాటికి పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు. ఐడియా కూడా లేదు. సడెన్ గా అంతా ప్లానింగ్ అయింది. ముందే తెలిసి ఉంటే అనుమతి తీసుకునేదాన్ని. నాకు అలా చేయాలని ఎవరూ కూడా ఏం చెప్పలేదు. నేను మాత్రం కావాలని ఎలాంటి తప్పు చేయలేదు" అని తెలిపారు.

"రిసార్ట్‌లో లిక్కర్‌ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు లేవు. ఎవరూ వాడలేదు. గంజాయి పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎప్పుడో తీసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు కదా. విచారణకు సహకరిస్తున్నా. నేను ఒక రోల్‌ మోడల్‌ గా ఉండాలని అనుకుంటాను. కాబట్టి అలాంటి పనులు ఎందుకు చేస్తా? అందుకే ఆధారాలు లేని అభియోగాలు మోపొద్దు ప్లీజ్‌" అని మంగ్లీ కోరారు.