Begin typing your search above and press return to search.

40 ఏళ్ల 'సింహాస‌నం': థియేటర్‌ల వద్ద 144సెక్షన్ పెట్టాల్సొచ్చింది!

తారాగణం విషయానికి వస్తే.. జయప్రద, రాధలతో పాటు బాలీవుడ్ నటి మందాకినిని ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం చేశారు.

By:  Sivaji Kontham   |   21 March 2026 10:30 AM IST
40 ఏళ్ల సింహాస‌నం: థియేటర్‌ల వద్ద 144సెక్షన్ పెట్టాల్సొచ్చింది!
X

తెలుగు చలనచిత్ర చరిత్రలో సాహసాలకు మారుపేరు సూపర్‌స్టార్ కృష్ణ. ఆయన కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ రికార్డుల పుటల్లో చెరగని ముద్ర వేసిన సినిమా సింహాసనం. 1986 మార్చి 21న విడుదలైన ఈ చిత్రం నేటితో అంటే 2026 మార్చి 21 నాటికి విజయవంతంగా 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఒకానొక దశలో వరుస ప్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న కృష్ణను ఈ సినిమా మళ్లీ తిరుగులేని సూపర్ పవర్‌గా నిలబెట్టింది. అప్పట్లో యంగ్ హీరోల దూకుడుకు చెక్ పెడుతూ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఈ జానపద బ్రహ్మాండంతో ఆయన నిరూపించారు.

50ల‌క్ష‌ల‌తో సెట్ వేసారు:

ఈ సినిమా వెనుక కృష్ణ చేసిన కృషీ సాహసం సామాన్యమైనవి కావు. ఒకేసారి తెలుగులో `సింహాసనం` హిందీలో `సింఘాసన్` పేరుతో రెండు భాషల్లోనూ అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్రీకరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంతటి భారీ పీరియడ్ సినిమాను కేవలం 60 రోజుల్లో అంటే రెండు నెలల రికార్డు సమయంలో షూటింగ్ పూర్తి చేసి సంచ‌ల‌నం సృష్టించారు. పద్మాలయా స్టూడియోస్‌లో అప్పట్లోనే 50 లక్షల రూపాయల ఖర్చుతో వేసిన భారీ సెట్లు చూడటానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు క్యూ కట్టేవారంటే ఈ సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

70ఎంఎం 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్‌:

సాంకేతికత విషయంలో కృష్ణ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండేవారు. ఆ క్రమంలోనే టాలీవుడ్‌కు తొలి 70ఎంఎం 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్‌ను ఈ చిత్రం ద్వారానే పరిచయం చేశారు. అంతేకాకుండా సూపర్‌స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా కూడా ఇదే. కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వ బాధ్యతలన్నీ తనే భుజానికెత్తుకుని విక్రమసింహ, ఆదిత్య వర్ధనుడు అనే రెండు విభిన్న పాత్రల్లో అద్భుతమైన ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించారు.

అజ‌య్ దేవ‌గ‌న్ తండ్రి ఫైట్స్ అందించారు:

తారాగణం విషయానికి వస్తే.. జయప్రద, రాధలతో పాటు బాలీవుడ్ నటి మందాకినిని ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం చేశారు. అలాగే షోలే ఫేమ్ అంజాద్ ఖాన్ నటించిన మొదటి తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. సంగీత దర్శకుడు బప్పీలహరిని టాలీవుడ్‌కు తీసుకువచ్చి ఆకాశంలో ఒక తార వాహ్వా నీ యవ్వనం వంటి క్లాసిక్ హిట్స్ అందించారు. వీరు దేవగణ్ ఫైట్స్, విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రహణం ఈ సినిమాను సాంకేతికంగా మరో మెట్టు ఎక్కించాయి.

ఇది యూనిక్ రికార్డ్:

ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎంతటిదంటే విజయవాడలో థియేటర్ల వద్ద జనాన్ని నియంత్రించడం పోలీసులకు సాధ్యం కాలేదు. టాలీవుడ్ చరిత్రలో మొదటిసారిగా ఒక సినిమా విడుదల సమయంలో థియేటర్ల వద్ద 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. టికెట్ ఉన్నవారిని మాత్రమే ఆ వీధిలోకి అనుమతించే పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ జనంతో నిండిపోవడంతో ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లించారు. ఆ రోజుల్లోనే ఈ సినిమా తెలుగులో 1.50 కోట్లు రెండు భాషల్లో కలిపి 2.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది.

400 బ‌స్సుల్లో అభిమానులు:

కేవలం వసూళ్లలోనే కాదు వేడుకల్లోనూ సింహాసనం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. మద్రాసులో శతదినోత్సవ వేడుక జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా ఇది నిలిచింది. చెన్నైలోని విజిపి గార్డెన్స్‌లో జరిగిన ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 400 బస్సుల్లో అభిమానులు తరలిరావడం చూసి తమిళనాడు ప్రభుత్వం నివ్వెరపోయింది. ఇలా ప్రతి అంశంలోనూ సాహసానికి ప్రతిరూపంగా నిలిచిన `సింహాసనం` సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో మరో పదేళ్ల పాటు తిరుగులేని ఇమేజ్‌ను కట్టబెట్టింది.