Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శింబు అదరగొట్టనున్నారా?

ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దర్శకుడు కీర్తిశ్వరన్ చెప్పిన కథ శింబును ఆకట్టుకుందని సమాచారం.

By:  M Prashanth   |   31 May 2026 7:00 AM IST
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శింబు అదరగొట్టనున్నారా?
X

కోలీవుడ్ స్టార్ హీరో శింబుకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తమిళంలో నటించిన అనేక చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యి మంచి రెస్పాన్స్ పొందడంతో ఆయనకు ఇక్కడ సూపర్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే ఇప్పటివరకు శింబు స్ట్రయిట్ తెలుగు మూవీలో యాక్ట్ చేయలేదు. దీంతో ఆయన టాలీవుడ్ ఎంట్రీపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి శింబు డైరెక్ట్ తెలుగు సినిమా విషయం చర్చనీయాంశంగా మారింది.

కొన్ని నెలలుగా శింబు తెలుగు బడా నిర్మాణ సంస్థతో సినిమా చేయబోతున్నారనే ప్రచారం కొనసాగుతోంది. గతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ లో శింబు హీరోగా సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వచ్చాయి. మనసనమహా షార్ట్ ఫిల్మ్‌ తో గుర్తింపు పొందిన దర్శకుడు దీపక్ రెడ్డి చెప్పిన కథకు నిర్మాతలు ఆసక్తి చూపినట్లు ప్రచారం జరిగింది. శింబు కూడా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపించింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దర్శకుడు కీర్తిశ్వరన్ చెప్పిన కథ శింబును ఆకట్టుకుందని సమాచారం. ఇటీవల విడుదలైన డ్యూడ్ చిత్రంతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన చెప్పిన కథలో కొత్తదనం ఉండటంతో శింబు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టును మొదట ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.

అయితే సితార ఎంటర్‌టైన్మెంట్సే ఆ సినిమాను నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇక శింబుకు ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్‌ తో ఒక కమిట్మెంట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ AGS ఎంటర్టైన్మెంట్స్ కూడా శింబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తి నెలకొంది.

శింబు కెరీర్ విషయానికి వస్తే, చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం లవ్ స్టోరీలు, యాక్షన్ చిత్రాలు, మాస్ ఎంటర్టైనర్లతో తమిళ ప్రేక్షకులను అలరించారు. ఒక దశలో తెలుగులో కూడా ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే వరుస పరాజయాలు, వ్యక్తిగత వివాదాలు కారణంగా కెరీర్ కొంత వెనుకబడింది. తర్వాత మళ్లీ వరుస విజయాలతో శింబు తన స్థానాన్ని తిరిగి సంపాదించుకున్నారు.

ఇలాంటి సమయంలో తెలుగు మార్కెట్‌ పై దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తమిళ హీరోలు చాలామంది నేరుగా తెలుగు సినిమాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో శింబు కూడా అదే బాటలో నడవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. 20 ఏళ్ల సినీ జర్నీ తర్వాత ఆయన టాలీవుడ్‌ లో నేరుగా అడుగుపెడతారా? ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు నిజమవుతాయా? డెబ్యూతో అదరగొడతారా అనే ప్రశ్నలకు సమాధానం అధికారిక ప్రకటన, సినిమా వచ్చిన తర్వాతే తెలియనుంది.