కొత్త తరహా ప్రమోషన్లు - సైలెంట్ స్ట్రాటజీ!
ఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే నిత్యం ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వడం. పోస్టర్లు విడుదల చేయడం లేదా ఇంటర్వ్యూలతో హడావుడి చేయడం.
By: Srikanth Kontham | 28 April 2026 4:00 PM ISTఒకప్పుడు సినిమా ప్రమోషన్ అంటే నిత్యం ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వడం. పోస్టర్లు విడుదల చేయడం లేదా ఇంటర్వ్యూలతో హడావుడి చేయడం. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారుతోంది. సినిమా మేకర్లు పాత పద్ధతులకు భిన్నంగా సైలెంట్ స్ట్రాటజీ ని అనుసరిస్తున్నారు. అభిమానులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారిలో ఉత్కంఠను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అప్‌డేట్లు ఇవ్వకపోవడమే అతిపెద్ద అప్‌డేట్ అన్నట్లుగా ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద సినిమాల ప్రచార పర్వం మారుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న గ్లోబల్ మూవీ `వారణాసి` ఇందుకు మొదటి ఉదాహరణ.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమైంది. అయినా చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అప్‌డేట్లు రావడం చాలా అరుదు. ఇటీవల కామికాన్ ఈవెంట్‌లో కొన్ని విజువల్స్ చూపించినట్లు వార్తలు వచ్చినా? ఆ గ్లిమ్స్ బయటకు రాకుండా చిత్ర బృందం ఎంతో జాగ్రత్త పడింది. ఈ రహస్యమే సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలను, నిరంతర చర్చకు తెర తీస్తోంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `రాకా` కూడా ఇదే బాటలో కనిపిస్తోంది. ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ తర్వాత అధికారికంగా విశేషాలు వెల్లడించింది చాలా తక్కువ సందర్భాల్లోనే. బన్నీ ఎయిర్‌పోర్ట్ లుక్స్‌తోనే సోషల్ మీడియాలో ఈ సినిమా నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది.
అప్‌డేట్లు లేకపోయినా బన్నీ కొత్త హెయిర్ స్టైల్ ? డ్రెస్సింగ్ స్టైల్‌ను బట్టి సినిమా కథను, పాత్రను అభిమానులే ఊహించుకుంటున్నారు. మేకర్లు ఏమీ చెప్పకుండానే సినిమాపై క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ విషయంలోనూ ఇదే వ్యూహం కనిపిస్తోంది. ప్రభాస్ నటిస్తోన్న `ఫౌజీ`, `స్పిరిట్`, `కల్కి 2` సినిమాల గురించి అఫీషియల్ న్యూస్ పెద్దగా రాకపోయినా? ప్రతిరోజూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. లీకైన ఫోటోలు , రూమర్స్ ద్వారానే ప్రభాస్ సినిమాలు నిత్యం చర్చల్లో ఉంటున్నాయి. మేకర్లు అధికారికంగా మౌనం వహించడం వల్ల వచ్చే చిన్న అప్‌డేట్ కూడా భారీ సెన్సేషన్ సృష్టిస్తోంది.
ఈ సైలెంట్ స్ట్రాటజీ వెనుక బలమైన మార్కెటింగ్ ప్లాన్ కూడా కనిపిస్తోంది. నిత్యం అప్‌డేట్లు ఇస్తూ ఉంటే ప్రేక్షకుల్లో కుతూహలం తగ్గిపోయే ప్రమాదం ఉంది. అదే సస్పెన్స్ మెయింటైన్ చేస్తే సినిమా గురించి చిన్న చిన్న లీక్‌లు కూడా మంచి హైప్ తీసుకొస్తుంది. మేకర్లు తమ మేకింగ్ క్వాలిటీపై నమ్మకంతోనే ఇలాంటి రిస్క్ చేస్తున్నారన్నది కాదనలేని నిజం. అతిగా ప్రచారం చేయడం కంటే కంటెంట్ పట్ల ప్రేక్షకుల్లో ఆకలిని పెంచడం ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
నేటి డిజిటల్ యుగంలో సమాచారం అందుబాటులో ఉన్న తరుణంలో మౌనం అనేది ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. రాజమౌళి, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్లు అనుసరిస్తున్న ఈ సరికొత్త ప్రమోషన్ పద్ధతి ఇతర చిన్న సినిమాలకు కూడా స్ఫూర్తినిస్తోంది. అంచనాలను అదుపులో ఉంచుతూనే సరైన సమయంలో బాంబు పేల్చడం తో మంచి హైప్ కు దారి తీస్తుందని మేకర్లు పట్టుదలతో ఉన్నారు. మరి ఈ సైలెంట్ వేవ్ టాలీవుడ్‌లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
