Begin typing your search above and press return to search.

ఒక్కసారిగా పడిపోయిన 'మదరాసి' మార్కెట్‌!

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'సికిందర్‌' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   1 April 2025 11:09 AM IST
ఒక్కసారిగా పడిపోయిన మదరాసి మార్కెట్‌!
X

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'సికిందర్‌' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సికిందర్‌ సినిమాకు మొదటి రోజు పాతిక కోట్ల వసూళ్లు నమోదు అయినట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సౌత్‌ ఇండియాలో మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఆ స్థాయి వసూళ్లు సొంతం చేసుకుంటున్నారు. ఇక సౌత్‌ స్టార్‌ హీరోలు మొదటి రోజు వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు దక్కించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సికిందర్‌ సినిమా పాతిక కోట్ల వసూళ్లను రాబట్టడం అంటే ఫలితం ఏంటో అర్థం చేసుకోవచ్చు. సికిందర్‌ సినిమాతో సల్మాన్‌ ఖాన్‌ మార్కెట్‌ మరింతగా తగ్గిందనే విశ్లేషణలు వస్తున్నాయి.

సికిందర్‌ సినిమా వల్ల సల్మాన్‌ ఖాన్‌కి జరిగిన నష్టం గురించి పక్కన పెడితే కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌ సినిమాకు పెద్ద డ్యామేజ్ అయ్యేలా ఉంది. శివ కార్తికేయన్‌ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి పరాశక్తి కాగా మరోటి మదరాసి. సుధ కొంగర దర్శకత్వంలో పరాశక్తి రూపొందుతూ ఉండగా, మదరాసి సినిమాకు మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్‌లో ఉంది. సికిందర్‌ సినిమాతో సమాంతరంగా మదరాసి సినిమాను మురగదాస్ రూపొందించాడు. శివ కార్తికేయన్‌ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో భారీ బడ్జెట్‌ను నిర్మాతలు ఖర్చు చేశారు. మొన్నటి వరకు మదరాసి సినిమాకు మినిమం వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంతా భావించారు.

మురగదాస్ బాలీవుడ్‌లో సికిందర్‌ సినిమాతో ఫ్లాప్‌ను మూట కట్టుకున్నాడు. ఒక్క సినిమాతో ఫ్లాప్‌ అయితే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ గత పదేళ్లుగా మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో సక్సెస్‌ రేటు చాలా తక్కువగా ఉంది. సికిందర్‌ సినిమా మినిమం ఆడినా కూడా మదరాసి సినిమాకు మంచి బిజినెస్ జరిగి ఉండేది. కానీ సికిందర్‌ సినిమాతో మరుగదాస్ తన పదేళ్ల ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నాడు. అందుకే మదరాసి సినిమాతో అయినా ఆయన సక్సెస్‌ను అందుకుంటాడేమో అనే ఆలోచన కూడా ఎవరికీ లేదు. అందుకే మదరాసి సినిమాకు మినిమం బిజినెస్ జరిగే పరిస్థితి లేదు అంటూ కోలీవుడ్‌ సినీ వర్గాల వారు, బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కోలీవుడ్‌ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మొన్నటి వరకు 'మదరాసి' సినిమాకు మినిమం బజ్ ఉండేది. శివ కార్తికేయన్‌ సినిమా కావడంతో మంచి బిజినెస్‌ జరిగే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కాని సికిందర్‌ విడుదలైన వెంటనే మదరాసి సినిమా గురించి నెగటివ్‌ టాక్ ప్రారంభం అయిందట. మురగదాస్‌ దర్శకత్వంలో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒకప్పుడు ఉన్న ఆసక్తిలో ఇప్పుడు కనీసం సగం కూడా లేదు. బయ్యర్లు సైతం మురుగదాస్ సినిమా అంటే అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. సికిందర్‌ ఫలితం తర్వాత మురుగదాస్ పై నమ్మకం మరింతగా సన్నగిల్లిందనే టాక్‌ వినిపిస్తుంది. అందుకే మదరాసి సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో భారీ నష్టం తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక వేళ మదరాసి సినిమాకు హిట్ టాక్‌ వస్తే అప్పుడు తప్పకుండా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి మదరాసితో అయినా మురగదాస్ తన సత్తా చాటుతాడా అనేది చూడాలి.