సైమా 2025లో టాప్ నామినేటెడ్ సినిమాలివే!
సౌత్ సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తున్న సైమా 2025కు రంగం సిద్ధమైంది. ప్రతీ ఏటా లాగే ఈ ఏడాది కూడా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక జరగబోతుంది.
By: Tupaki Desk | 23 July 2025 4:49 PM ISTసౌత్ సినీ లోకం ఎంతగానో ఎదురుచూస్తున్న సైమా 2025కు రంగం సిద్ధమైంది. ప్రతీ ఏటా లాగే ఈ ఏడాది కూడా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక జరగబోతుంది. 2012లో మొదలైన ఈ సైమా వేడుకలు పన్నెండేళ్లుగా సక్సెస్‌ఫుల్ గా జరుగుతుండగా ఇప్పుడు 13వ ఎడిషన్ కు సైమా ముస్తాబవుతోంది. సెప్టెంబర్ 5,6 తేదీల్లో దుబాయ్ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుంచి ఉత్తమ ప్రతిభను కనపరిచిన సినిమాలను, నటీనటులను గుర్తించి వారిని సత్కరించే సైమా వేడుకలు గత రెండేళ్లుగా దుబాయ్ లోనే జరుగుతున్నాయి. తాజాగా నామినేషన్స్ లిస్ట్ ను సైమా అవార్డుల కమిటీ రిలీజ్ చేయగా అందులో తెలుగులో ఎక్కువ నామినేషన్స్ తో పుష్ప2 సినిమా టాప్ లో నిలిచింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమాకు సైమాలో 11 నామినేషన్స్ దక్కాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. పుష్ప2 తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శక్వంలో వచ్చిన కల్కి 2898ఏడీ సినిమాకు 10 నామినేషన్స్ దక్కాయి. ఆ తర్వాత తేజ సజ్జ- ప్రశాంత్ వర్మ కలయికలో వచ్చిన హనుమాన్ సినిమాకు కూడా 10 నామినేషన్స్ వచ్చాయి. గతేడాది రిలీజైన ఈ మూడు సినిమాలూ ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ అందుకోవడంతో పాటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కూడా కురిపించాయి.
కాగా తమిళంలో అమరన్ సినిమాకు 13 నామినేషన్స్ దక్కగా, లబ్బర్ పందు కు 8, వాళై కు 7 నామినేషన్స్ వచ్చాయి. కన్నడలో భీమాకు 9 నామినేషన్స్, కృష్ణ ప్రణయ సఖికి 9, ఇబ్బని తబ్బిడ ఇలియాలి కి 7 నామినేషన్స్ వచ్చాయి. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితంకు 10 నామినేషన్స్ తో టాప్ లో ఉండగా, ఏఆర్ఎం9, ఆవేశం 8 నామినేషన్స్ దక్కాయి.
