మూవీ రివ్యూ : ‘సిగ్మా’
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ రూపొందించిన సినిమా.. సిగ్మా. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 2 Oct 2026 3:13 PM IST‘సిగ్మా’ మూవీ రివ్యూ
నటీనటులు: సందీప్ కిషన్- ఫరియా అబ్దుల్లా- సంపత్- రాజు సుందరం- శివ్ పండిట్- యోగ్ జేపీ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: కృష్ణన్ వసంత్
నిర్మాత: సుభాస్కరన్
రచన-దర్శకత్వం: జేసన్ సంజయ్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ రూపొందించిన సినిమా.. సిగ్మా. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సీఎం కొడుకు దర్శకుడిగా మెప్పించాడా? సందీప్ కిషన్ ఫ్లాపుల పరంపరకు ‘సిగ్మా’ అడ్డుకట్ట వేసిందా? తెలుసుకుందాం పదండి.
కథ:
గురు (సందీప్ కిషన్) తల్లిదండ్రులను కోల్పోయి.. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న కుర్రాడు. అతను తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన లైబ్రరీని నడుపుతుంటాడు. తాను చేసిన అప్పుల వల్ల ఆ లైబ్రరీని కోల్పోయే పరిస్థితి తలెత్తుతుంది. ఒక్క రోజులో పాతిక లక్షలు కడితే తప్ప లైబ్రరీని కాపాడుకోలేని స్థితిలో అతను విన్సెంట్ (శివ్ పండిట్) అనే మాఫియా డాన్ నడిపే క్యాసినోకు వెళ్తాడు. కానీ అక్కడ చేతిలో ఉన్న కాస్త డబ్బు కూడా పోయి పూర్తిగా జీరో అయిపోతాడు గురు. అతడి గర్ల్ ఫ్రెండ్ సామ్ (ఫరియా అబ్దుల్లా) కూడా తనకు దూరమవుతుంది. ఈ పరిస్థితుల్లో గురు ఏం చేశాడు.. అతను లైబ్రరీని కాపాడుకోగలిగాడా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
విజయ్ లాంటి సూపర్ స్టార్ కొడుకు హీరో అవుతానంటే రెడ్ కార్పెట్ వేసి స్వాగతించేవాళ్లు తమిళ ప్రేక్షకులు. కానీ జేసన్ సంజయ్ నటన కాదని దర్శకత్వం వైపు అడుగులు వేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. అతనీ మార్గాన్ని ఎంచుకున్నాడంటే డైరెక్షన్ మీద ఎంతో ప్యాషన్ ఉండుంటుంది.. అందులో నైపుణ్యం సాధించే ఉంటాడు.. తన తొలి సినిమాలో ఏదో విశేషం ఉండే ఉంటుంది అనుకుంటాం. కానీ ‘సిగ్మా’ మొదలైన కాసేపటికే ఆ భ్రమలన్నీ విడిపోతాయి. ‘సిగ్మా’ అంటూ జెన్ జీ వాడే పదాన్ని టైటిల్ గా పెట్టుకున్నాడే కానీ.. కథాకథనాల్లో మాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు సంజయ్. పాత కథనే అయినా కొంచెం పద్ధతిగా-ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడా అంటే అదీ లేదు. ప్రతి సన్నివేశంలోనూ విపరీతమైన హడావుడి.. గందరగోళం తప్పితే.. కుదురుగా కథ చెప్పలేదు. ప్రేక్షకుల్లో ఎక్కడా రవ్వంత కూడా క్యూరియాసిటీ కలిగించకుండా.. ఆరంభం నుంచి చివరి వరకు ఫ్రస్టేట్ చేసే సినిమా ఇది.
ఆర్థిక సమస్యల్లో ఉన్న హీరో.. ఒక మాఫియాతో తలపడి మరింత చిక్కుల్లో పడడం.. చివరికి తన సమస్యలన్నీ తీరిపోయి జాక్ పాట్ కొట్టడం.. ఇదీ స్థూలంగా ‘సిగ్మా’ కథ. ఇలాంటి స్టోరీలను మనం ‘క్షణక్షణం’ రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఆర్జీవీ ‘క్షణక్షణం’ ఇప్పుడు చూసినా ట్రెండీగా అనిపిస్తే.. జేసన్ సంజయ్ ‘సిగ్మా’ మాత్రం ఔట్ డేటెడ్ ఫీల్ తో సాగుతుంది. నరేషన్ బాగుంటే..మామూలు కథలు కూడా పాసైపోతాయి. కానీ క్లారిటీ లేకుండా.. గందరగోళంగా సాగిన జేసన్ సంజయ్ నరేషన్ వల్ల అసలే అంతంతమాత్రంగా ఉన్న కథ ఇంకా పేలవంగా తయారైంది. కథలో ముఖ్యమైన అంశాలను కూడా అతను స్పష్టంగా చెప్పలేకపోయాడు. ఈ కథ అంతా ఒక పెన్ డ్రైవ్.. దాంతో పాటే ఉన్న ఒక కీ చుట్టూ తిరుగుతుంది. కానీ ఈ వ్యవహారాన్ని చాలా గందరగోళంగా.. అనాసక్తికరంగా ప్రెజెంట్ చేశాడు సంజయ్. హీరో-విలన్ల మధ్య సాగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ మినిమం ఇంట్రెస్ట్ కలిగించదు. చూసిన సన్నివేశాలనే మళ్లీ మళ్లీ చూస్తున్నట్లు ఉంటుంది తప్ప.. కథ ముందుకే కదలదు.
‘సిగ్మా’లో పాత్రలేమో బోలెడు. కానీ హీరో సహా ఏ పాత్రనూ జేసన్ సంజయ్ సరిగా తీర్చిదిద్దలేదు. విలన్ పాత్రలైతే మరీ పేలవం. కామెడీగా అనిపించే ఆ క్యారెక్టర్ల వల్ల కథ ఎక్కడా సీరియస్ గా అనిపించదు. హీరోకు పెద్ద కష్టం వస్తే ప్రేక్షకులు దాని గురించి ఫీలై అతనీ సమస్య నుంచి ఎలా బయటపడతాడా అని ఉత్కంఠగా చూడాలి. కానీ ఇక్కడ హీరో లైబ్రరీకి సంబంధించిన ట్రాక్ ను ఎలాంటి ఎమోషన్ కలగని విధంగా నడిపించాడు దర్శకుడు. మరోవైపు క్రైమ్ ఎలిమెంట్ చుట్టూ జరిగే తంతు కూడా ఆరంభంలో తేలిపోవడంతో.. ఈ వ్యవహారం కూడా ఆసక్తి రేకెత్తించదు. హీరో హీరోయిన్ల ట్రాక్ అయితే అసలెందుకు పెట్టారో అర్థం కాదు. ఫరియా పాత్ర ఈ కథలో అసలు అవసరమే లేదనిపిస్తుంది. సినిమాలో సింక్ అయిందా లేదా అని పక్కన పెడితే.. విడిగా చూసినా ఇందులో భలే ఉంది అనిపించే ఒక్క సన్నివేశం కూడా లేదు. అంత గందరగోళంగా.. అనాసక్తికరంగా సినిమాను నడపించాడు జేసన్ సంజయ్.
నటీనటులు:
సందీప్ కిషన్ గురు పాత్రలో బాగానే నటించాడు. తన లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. తన పెర్ఫార్మెన్స్ బాలేదని చెప్పలేం కానీ.. పాత్రలో విషయం లేకపోవడం వల్ల ఇంపాక్ట్ ఏమీ కనిపించలేదు. ఫరియా అబ్దుల్లా టాలెంట్ వేస్ట్ అయిపోయింది. ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి తనను పెట్టినట్లున్నారు. విలన్ పాత్రలో సంపత్ నటన బాగున్నా.. ఆ క్యారెక్టర్ ఇరిటేట్ చేస్తుంది. ఇంకో విలన్ క్యారెక్టర్లో శివ్ పండిట్ కూడా చేసిందేమీ లేదు. రాజు సుందరం అక్కడక్కడా కాస్త కామెడీ చేసి రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. హీరో పక్కనే ఉండే ఇంకో కుర్రాడి పాత్ర చేసిన నటుడు పర్వాలేదు.
సాంకేతిక వర్గం:
‘సిగ్మా’ కోసం తమన్ గట్టి ఎఫర్టే పెట్టాడు. విషయం లేని సన్నివేశాలను బీజీఎం ద్వారా ఎలివేట్ చేయడానికి బాగా ట్రై చేశాడు. కానీ కంటెంట్ వీక్ గా ఉండడం వల్ల బీజీఎం చాలా చోట్ల అతిగా అనిపిస్తుంది. తన పాటల గురించి చెప్పడానికేమీ లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఏమీ ఢోకా లేదు. సినిమాను రిచ్ గానే తీశారు. ఐతే జేసన్ సంజయ్ కి కావాల్సిన వనరులన్నీ బాగానే సమకూరినా.. బలహీనమైన స్క్రిప్ట్.. సాధారణమైన టేకింగ్ తో అన్నింటినీ వేస్ట్ చేశాడు. తన అనుభవలేమి అడుగడుగునా కనిపించింది. కొన్ని సీన్లు చూస్తే.. జేసన్ ను ఎవరూ సరిగా గైడ్ చేయలేదనిపిస్తుంది.
చివరగా: ‘సిగ్మా’.. ఆసక్తి లేని క్యాట్ అండ్ మౌస్ గేమ్!
రేటింగ్- 1.75/5
