Begin typing your search above and press return to search.

దేశంలో అతి పెద్ద యాక్ష‌న్ డైరెక్ట‌ర్ ఖాళీగా

దేశంలో అతి పెద్ద పాన్ ఇండియా యాక్ష‌న్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ ఖాళీగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 March 2024 4:05 AM GMT
దేశంలో అతి పెద్ద యాక్ష‌న్ డైరెక్ట‌ర్ ఖాళీగా
X

దేశంలో అతి పెద్ద పాన్ ఇండియా యాక్ష‌న్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ ఖాళీగా ఉన్నారు. ద‌ర్శ‌కుడిగా నెక్ట్స్ ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి. గ‌త ప‌రాజ‌యం ఫ‌లిత‌మా? లేక అత‌డికి గ్ర‌హ‌గ‌తులు అనుకూలించ‌లేదా? ఇంకేదైనా కార‌ణ‌మా? అంటే .. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లాలి.


బ్యాక్ టు బ్యాక్ భారీ యాక్ష‌న్ చిత్రాల‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన ద‌ర్శ‌కుడిగా సిద్ధార్థ్ ఆనంద్ ప్ర‌తిభ గురించి చెప్పాల్సిన పని లేదు. బ్యాంగ్ బ్యాంగ్, వార్ లాంటి చిత్రాల‌తో యాక్షన్ కంటెంట్ కి కొత్త అర్థం చెప్పిన మేటి ద‌ర్శ‌కుడిగా అత‌డి పాపులారిటీ అసాధార‌ణ‌మైన‌ది. గ‌త ఏడాది `ప‌ఠాన్` లాంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ తో కింగ్ ఖాన్ షారూఖ్ కి ఊపిరులూదాడు. ఖాన్ కెరీర్లోనే ప‌ఠాన్ బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. కానీ ఈ విజ‌యాన్ని ఆ త‌ర్వాత కూడా కొన‌సాగించ‌డంలో అత‌డు త‌డ‌బాటుకు గుర‌య్యాడు. భారీ అంచ‌నాల న‌డుమ జ‌న‌వ‌రిలో విడుద‌ల చేసిన ఫైట‌ర్ చిత్రం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. హృతిక్ రోష‌న్, దీపిక ప‌దుకొనే లాంటి భారీ తారాగ‌ణం ఉన్నా కానీ, ఫైట‌ర్ ఆశించి విజ‌యాన్ని సాధించ‌లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద‌ కేవ‌లం యావ‌రేజ్ గ్రాస‌ర్ గా నిలిచింది. వైమానిక ద‌ళం సాహ‌సాలు, యుద్ధం- దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో రూపొందించిన ఈ చిత్రం ఎందుక‌నో దేశ ప్ర‌జ‌ల‌కు స‌రిగా క‌నెక్ట్ కాలేదు.

అయితే ఫైట‌ర్ త‌ర్వాత సిద్ధార్థ్ ఆనంద్ తెర‌కెక్కించ‌బోయే సినిమా ఇప్ప‌టివ‌ర‌కూ ప్రారంభం కాక‌పోవ‌డంతో అభిమానుల్లో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. నిజానికి సిద్ధార్థ్ ఆనంద్ చాలా కాలంగా టైగ‌ర్ ష్రాఫ్ తో భారీ బ‌డ్జెట్ చిత్రం `రాంబో`ని ప్రారంభించాల‌ని భావిస్తున్నాడు. సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ రాంబో స్ఫూర్తితో రూపొందుతున్న సినిమా ఇది. కానీ ఈ భారీ యాక్ష‌న్ సినిమా అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతూ వాయిదా పడుతూనే ఉంది. టైగర్- సిద్ధార్థ్ క‌ల‌యిక‌లోని `రాంబో` గత కొన్నేళ్లుగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. అయితే సిద్ధార్థ్ ఆనంద్ క్యాంప్ నుండి ఏదీ పూర్తి క్లారిటీతో తెరపైకి రాలేదు. అంతేకాదు, ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమైందని ఇటీవల కొన్ని వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. కానీ అది ఇప్పట్లో కుదిరేలా కనిపించడం లేదనేది తాజా గుస‌గుస‌. జియో స్టూడియోస్‌ సహకారంతో సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉండ‌గా జియో నిర్మాత‌ల నుంచి సందిగ్ధ‌త ఎదుర‌వుతోంది. సిధ్ మాత్రం డైరెక్టర్ కుర్చీలో కూర్చోడు. దీనికి దర్శకత్వం వహించే బాధ్యతను రోహిత్ ధావన్‌కు అప్పగించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. నిజానికి దర్శకుడు రోహిత్ ధావన్ - సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2024 లో ప్రారంభించాలని అనుకున్నారు.. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా ఆలస్యం అవుతోంది.

150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్ప‌ట్లో ప్రారంభ‌మ‌య్యే సూచ‌న‌లు అయితే క‌నిపించ‌డం లేదు. జియో స్టూడియోస్ టైగ‌ర్ న‌టించిన‌ `బడే మియాన్ ఛోటే మియాన్` విడుదల కోసం వేచి చూస్తోంది. ఈ సినిమా రిజ‌ల్ట్ చూశాకే వారు `రాంబో`తో ముందుకు వెళ్లాలని భావించిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బడే మియాన్ ఛోటే మియాన్ బాక్సాఫీస్ పనితీరు ఆధారంగా రాంబో బడ్జెట్‌ను మళ్లీ అంచనా వేయనున్నట్లు తెలుస్తోంది. రాంబో చిత్రాన్ని జూలై 2024 లో ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద `బడే మియాన్ చోటే మియాన్` ప్రదర్శన రాంబో భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

బడే మియాన్ చోటే మియాన్ గురించి చెప్పాలంటే ఇది కూడా భారీ యాక్ష‌న్ చిత్రం. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ - టైగర్ ష్రాఫ్ కనిపించబోతున్నారు. దీనికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నారు. మానుషి చిల్లర్, అలయ ఎఫ్ ఈ చిత్రంలో తమ నటనలోని మ్యాజిక్‌ను చూపించనున్నారు.

ప్ర‌స్తుతం ట్యాలెంటెడ్ సిద్ధార్థ్ ఆనంద్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించే సినిమా కోసం వేచి చూస్తున్నాడు. వైఆర్.ఎఫ్ స్పై యూనివ‌ర్శ్ మూవీ `టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్` కి అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సి ఉంది. ఇందులో స‌ల్మాన్- షారూఖ్ ఒకరికొక‌రు విరోధులుగా క‌నిపిస్తారు. టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్ బౌండ్ స్క్రిప్టు ఇంకా రెడీ కాలేదు. ఇది పూర్తి చేయ‌డానికే ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని అంచ‌నా. అంటే 2024లో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారా లేదా? అన్న‌ది కూడా ఇప్పుడే చెప్ప‌లేం. అంటే ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా దేశంలోని అతిపెద్ద యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ప‌రిస్థితి ఇప్పుడు డైల‌మాలో ఉంద‌ని అంగీక‌రించాలి. బ్యాంగ్ బ్యాంగ్, వార్, ప‌ఠాన్ లాంటి భారీ హిట్లు అందుకున్న త‌ర్వాతా అత‌డు ఇంకా డైల‌మాలో ఉండ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.