స్టార్ బాయ్ టిల్లు మత్తుని వీడాల్సిందే
మూసధోరణిలో సినిమాలు చేస్తే ప్రస్తుతం ప్రేక్షకులు ఆదిరించడం లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా అందులో కొత్తదనం ఉంటేనే బ్రహ్మరధంపడుతున్నారు.
By: Tupaki Desk | 10 April 2025 7:11 AMమూసధోరణిలో సినిమాలు చేస్తే ప్రస్తుతం ప్రేక్షకులు ఆదిరించడం లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా అందులో కొత్తదనం ఉంటేనే బ్రహ్మరధంపడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిన్న లాజిక్‌ని మరిచిన కొంత మంది ఒక్క హిట్‌ని పట్టుకుని అదే ఫార్ములాని ఫాలో అవుతూ పదే పదే అదే క్యారెక్టర్‌తో ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేసి మళ్లీ మళ్లీ సక్సెస్‌లని దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇలా పదే పదే ఫాలో కావడం వల్ల ప్రేక్షకులకు బోర్ కొట్టి సదరు హీరో కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు, సినీ ప్రియులు పెదవి విరుస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. స్టార్ బాయ్ సిద్దూ ఊరాఫ్ సిద్దూ జొన్నలగడ్డ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి గుంటూరు టాకీస్‌తో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. అయితే ఈ యంగ్ హీరోకు తిరుగులేని గుర్తింపుని, పాపులారిటీని తెచ్చి పెట్టింది మాత్రం 'డీజే టిల్లు'. ఈ మూవీకి రైటర్‌గా కూడా వర్క్ చేసిన సిద్దూ స్టార్ బాయ్ అనే ట్యాగ్‌ని సొంతం చేసుకున్నాడు. తెలంగాణ యాసలో సాగిన సిద్దూ క్యారెక్టర్ ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సిద్దూ కు ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చి పెట్టింది.
కేవలం రూ.5 కోట్లతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.30 కోట్లను రాబట్టడంతో సిద్దూకు క్రేజ్ భారీ స్థాయిలో పెరిగింది. ఆ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో దీనికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్'ని చేశాడు. ఇది కూడా మంచి హిట్ అనిపించుకున్నా డీజే స్థాయిలో మాత్రం ప్రేక్షకుల్ని సంతృప్తి పరచలేకపోయింది.
అయినా సరే టిల్లు మత్తులో ఉన్న సిద్దూ జొన్నలగడ్డ తన తాజా మూవీ 'జాక్' లోనూ అదే ఫ్లేవర్‌ని కొనసాగించాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసి ఈ మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. జాక్ క్యారెక్టర్ టిల్లుని గుర్తు చేస్తూ సాగింది. ఇదొక స్పై థ్రిల్లర్ కానీ ఎక్కడా ఆ ఫ్లేవర్‌ని సీరియస్‌గా క్యారీ చేయలేదు. అంతే కాకుండా సినిమా సగం వండి విదిలేసినట్టుగా అనిపిస్తోంది. సినిమాని వన్ లైనర్‌లతో నెట్టుకురావాలనుకున్నారు. అదే దీనికి పెద్ద డ్రా బ్యాక్‌గా మారి ఆడియన్స్‌ని చిరాకు పెట్టిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్లలో అత్యధిక శాతం మంది నెటిజన్‌లు సిద్దూ 'టిల్లు' మత్తు నుంచి బయటికి రాకపోతే కష్టం అని తేల్చేస్తున్నారు. మరి ఈ కామెంట్‌లపై స్టార్ బాయ్ సిద్దూ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.