Begin typing your search above and press return to search.

సౌత్ హీరోలు ఆల్క‌హాల్‌కి ప్రచారం చేయ‌రు: సిద్ధార్థ్

తాజా ఇంట‌ర్వ్యూలో సిద్ధార్థ్ మాట్లాడుతూ..క‌మ‌ల్ హాస‌న్‌తో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించడం దేవుని ఆదేశంగా తాను భావిస్తున్నానని.. అది 'గత కర్మ' ఫలితమని చెప్పాడు.

By:  Tupaki Desk   |   10 July 2024 3:51 PM GMT
సౌత్ హీరోలు ఆల్క‌హాల్‌కి ప్రచారం చేయ‌రు: సిద్ధార్థ్
X

కమల్ హాసన్ లాంటి లెజెండ‌రీ న‌టుడితో క‌లిసి న‌టించాడు యంగ్ హీరో సిద్ధార్థ్‌. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రూ భార‌తీయుడు 2 ప్ర‌మోష‌న్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. దాదాపు 28 సంవత్సరాల తర్వాత సీక్వెల్ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. దేశంలో అవినీతిని ప్రక్షాళన చేయడానికి ప్రయత్నించే ఒక యువ జాగరూకుడిగా సిద్ధార్థ్‌ను తెర‌పై చూడ‌బోతున్నాం. తాజా ఇంట‌ర్వ్యూలో సిద్ధార్థ్ మాట్లాడుతూ..క‌మ‌ల్ హాస‌న్‌తో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించడం దేవుని ఆదేశంగా తాను భావిస్తున్నానని.. అది 'గత కర్మ' ఫలితమని చెప్పాడు.

తాను కానీ త‌న సాటి హీరోలు కానీ క‌మ‌ల్ హాస‌న్, ర‌జ‌నీకాంత్ వంటి దిగ్గజాల నుంచి ఎంతగా స్ఫూర్తి పొందుతారో వెల్ల‌డించారు సిద్ధార్థ్. క‌మ‌ల్, ర‌జ‌నీ తీసుకున్న నిర్ణ‌యాలు తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ ఒక పాఠంగా ఉప‌యోగ‌ప‌డతాయ‌ని అన్నారు. ''రజినీ సార్- కమల్ సర్ కొన్ని సంవత్సరాల క్రితం ఎప్ప‌టికీ ఆల్క‌హాల్ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించ‌లేమ‌ని, ఇచ్చిన‌ మాట‌పై నిలబడాల‌ని ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు మద్యం, ధూమపానం, పాన్ మసాలా వంటి సర్రోగేట్ ప్రకటనలను ఆమోదించరు. వాటిలో న‌టించ‌రు'' అని అన్నారు

''అంత పెద్ద స్టార్లు అలాంటి వాటిలో న‌టించి ఉంటే, దక్షిణాదిలో ఇతరులు కూడా అదే ప‌ని చేసి ఉండేవారు. లెజెండ‌రీ స్టార్లు ఒక దారి చూపించినందున ఇక‌ ఎవరూ ఆ ప‌ని చేయరు. మా పరిశ్రమలో అలాంటి ఇద్దరు లెజెండ్స్ ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము.. ఎందుకంటే ఆ ఇద్ద‌రు స్టార్లు మాకు అనేక విధాలుగా కొత్త‌ మార్గాన్ని చూపించారు'' అని అన్నారు.

భార‌తీయుడు 2 లో న‌టించే అవ‌కాశం అదృష్టం త‌న‌కు క‌లిగినందుకు సిద్దార్థ్ ఆనందం వ్య‌క్తం చేసారు. సిద్ధార్థ్ 21 సంవత్సరాల తర్వాత శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. భార‌తీయుడు 2, రోబో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందించిన శంక‌ర్ స‌ర్ ఆ ఇద్ద‌రు లెజెండ‌రీల‌కు ఎప్పుడూ క‌నెక్ట్ అయి ఉంటారు. వారు కలిసి చేసే సినిమాలు ఒక తరంలో ఒక తరం అప్పీల్‌ను కలిగి ఉంటాయి. శంకర్‌ సర్‌ వీరిద్దరినీ పర్ఫెక్ట్‌గా ఉపయోగించుకున్నారు! అని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు.

నా జీవితంలో 200 రోజులకు పైగా శంకర్ స‌ర్ సెట్‌లో ఉన్నందుకు నాకు గౌరవంగా ఉంది. నా మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు (నా 38వ సినిమా వరకు) శంక‌ర్ స‌ర్ తన ప్రశాంతతను కోల్పోవడం నేను ఎప్పుడూ చూడలేదు. నేను ఆయ‌న‌ స్థానంలో ఉండి ఉంటే నా బుర్ర ప‌గిలిపోయేదేమో!. మరోవైపు ఆయ‌న సూటిగా చూస్తూ స్థిర‌మైన మ‌న‌స్సుతో త‌దుప‌రి ఏం చేయాలా? అని ఆలోచిస్తూ ఉంటార‌ని సిధ్ తెలిపాడు.