అందరి దృష్టిలో మంచోడు అనిపించుకోవడం భ్రమ!
నిజమైన మంచితనం ఎప్పుడూ ఆత్మగౌరవం నుండి పుట్టాలి. ఎదుటివారి మెప్పు కోసం కాకుండా.. మన అంతరాత్మ తృప్తి కోసం ఇతరులకు తోడ్పడాలి.
By: Sivaji Kontham | 12 April 2026 9:48 AM IST`మంచితనం` అనే రుద్దుడు గురించి హీరో సిద్ధార్థ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఇది త్రోబ్యాక్ వీడియోనే అయినా నేటితరానికి అతడి సూచన ఉపయుక్తంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచితనంలో కృత్రిమత్వం గురించి సిధ్ చాలా చక్కగా వివరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
సమాజం మనకు చిన్నప్పటి నుండి నేర్పించే అత్యంత చెత్త సిద్ధాంతం ఏమిటంటే.. అందరి దృష్టిలో `మంచోడు` అని అనిపించుకోవడం. హీరో సిద్ధార్థ్ అభిప్రాయం ప్రకారం.. మంచితనం అనేది ఒక భ్రమ. ఎదుటివాడు మనల్ని మంచోడు అని అంటున్నాడంటే అది కేవలం మన ప్రవర్తన వాడికి నచ్చడం వల్లే కానీ... మనం నిజంగా గొప్పవాళ్లమని కాదు. డబ్బు ఇచ్చి కూడా మన గురించి మంచిగా చెప్పించుకోవచ్చు... అలాంటి కృత్రిమ ప్రశంసలను చూసి మనల్ని మనం మర్చిపోతామని సిధ్ తనదైన శైలిలో హెచ్చరించారు.
సిద్ధార్థ్ విమానంలో ఆక్సిజన్ మాస్క్ ఉదాహరణను జీవితానికి చక్కగా అన్వయించారు. విమానంలో ప్రమాదం జరిగినప్పుడు ముందుగా మనకు మనం మాస్క్ వేసుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయాలని చెబుతున్నారు. ఎందుకంటే మనం బతికి ఉంటేనే ఇంకొకరికి సాయం చేయగలం. జీవితం కూడా అంతే.. మనం ముందు సంతోషంగా ఉంటేనే ఇతరులను సంతోషపెట్టగలం. మనమే లోలోపల కుమిలిపోతూ ఇతరులకు ఆనందాన్ని పంచలేము కాబట్టి మన సంతోషమే మనకు మొదటి ప్రాధాన్యత కావాలి.
త్యాగం అనే పదాన్ని సమాజం ఒక ఆయుధంగా వాడుకుంటోంది. వేరే వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం మనల్ని మనం తగ్గించుకుని చేసే త్యాగాలు ఏమాత్రం అర్థవంతమైనవి కావు. త్యాగం చేస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకోవడం లేదా పేరు కోసం ప్రాకులాడటం కేవలం మూర్ఖత్వమే. అటువంటి పేరు కోసం పాకులాడటం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది తప్ప దానివల్ల మనకు ఎలాంటి నిజమైన ప్రయోజనం ఉండదు.
నిజమైన మంచితనం ఎప్పుడూ ఆత్మగౌరవం నుండి పుట్టాలి. ఎదుటివారి మెప్పు కోసం కాకుండా.. మన అంతరాత్మ తృప్తి కోసం ఇతరులకు తోడ్పడాలి. ఆత్మగౌరవంతో చేసే సాయం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మెప్పు కోసం చేసే పనులు గుర్తింపు రానప్పుడు మనల్ని నిరాశలోకి నెట్టేస్తాయి. అందుకే మనం ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పరుచుకుని మనల్ని మనం గౌరవించుకుంటూ సాయం చేయడం నేర్చుకోవాలి.
చివరగా మనం సంతోషంగా ఉంటూ.. ఆ సంతోషంలో నుంచి ఇతరులకు భాగం ఇవ్వడమే అసలైన మానవత్వం. మనల్ని మనం తక్కువ చేసుకుని చేసే త్యాగం మనల్ని మానసికంగా ఖాళీ చేస్తుంది. ప్రేమతో, ఇష్టంతో చేసే తోడ్పాటు మాత్రమే మనకు .. సమాజానికి మేలు చేస్తుంది. అందుకే సిద్ధార్థ్ చెప్పినట్లు ఇతరుల ముద్రల కోసం కాకుండా మన మనసు సంతోషం కోసం బతకడం నేర్చుకోవాలి.
నటుడిగా సిద్ధార్థ్ 2026 కెరీర్ గురించి విశ్లేషిస్తే.. ప్రస్తుతం అతడి కెరీర్ నెమ్మదించింది. గత ఏడాది 3 బిహెచ్‌కే అనే చిత్రంలో సిద్ధార్థ్ నటించాడు. శంకర్ తో భారీ చిత్రం ఇండియన్ 2 ఫ్లాపైనా సిద్ధార్థ్ నటనకు పేరొచ్చింది. మిస్ యు అనే చిత్రంలో నటనకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం సోలో హీరోగా నటించేందుకు కథలు, స్క్రిప్టులు వింటున్నారని సమాచారం.
